హాస్టల్‌ నుంచి విద్యార్థినుల పరార్‌

ABN , First Publish Date - 2022-10-18T04:58:05+05:30 IST

హాస్టల్‌ నుంచి విద్యార్థినుల పరార్‌

హాస్టల్‌ నుంచి విద్యార్థినుల పరార్‌

 6 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

 కాజీపేట సెయింట్‌ ఆన్స్‌ హాస్టల్‌లో ఘటన

 కాజీపేట, అక్టోబరు 17 : హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక ఆరుగురు విద్యార్థులు హాస్టల్‌ నుంచి పారిపోయారు. హాస్టల్‌ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల ఆధారంగా ఆరు గంటల్లోనే విద్యార్థినుల ఆచూకీ కొనుగొన్నారు. క్షేమంగా హాస్టల్‌కు చేర్చారు. ఈ ఘటన సోమవారం కాజీపేటలో జరిగింది. కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ జి. మహేందర్‌ రెడ్డి  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కాజీపేట సెయింట్‌ ఆన్స్‌ హాస్టల్‌లో ఉండి నాలుగో తరగతి చదువుతున్న గుర్రం అశ్విత, గుర్రం  అక్షయ,  రోళ్లకంటి భవాని, రోళ్లకంటి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న తాటికాయల దివ్య, ఎనిమిదో తరగతి చదువుతున్న కురం మాధురి అనే ఆరుగురు విద్యార్థినులు సోమవారం ఉదయం హాస్టల్‌ నుంచి పారిపోయారు. ఉదయం ఐదు గంటలకు హాస్టల్‌ వార్డెన్‌ విజయ రాణి పిల్లలను నిద్రలేపి స్కూల్‌కు వెళ్లేందుకు తయారుకావాలని చెప్పి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఆరుగురు విద్యార్థినులు స్కూల్‌బ్యాగులతో సహా హాస్టల్‌నుంచి పారిపోయారు. వెంటనే హాస్టల్‌ ఇన్‌చార్జి పయ్యాల సుధారాణి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటినా హాస్టల్‌కు వెళ్లారు. హాస్టల్‌ ఇన్‌చార్జి సుధారాణి, వార్డెన్‌ విజయరాణితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో అన్ని సీసీ కెమెరాలు పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. బాలికల కుటుంబ సభ్యుల సహకారంతో పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి తప్పిపోయిన బాలిక ఒకరు వారి అమ్మకు ఏడుస్తూ ఫోన్‌చేసింది. తామంతా కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి వద్ద ఉన్నామని చెప్పడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బాలికలను పట్టుకుని  హాస్టల్‌ వార్డెన్‌ సుధారాణికి అప్పగించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, బాలికల ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కాజీపేటలో చర్చనీయాంశం అయింది. ఆరు గంటల్లో కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్‌, ఇన్స్‌పెక్టర్‌ జి.మహేందర్‌ రెడ్డి, ఎస్సై ప్రమోద్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, శ్వేత, కానిస్టేబుల్‌ సదానందం, చలపతి, హోంగార్డు సదానందం సీపీ తరుణ్‌ జోషి అభినందించి రివార్డు ఇచ్చినట్లు ఇన్‌స్పెక్టర్‌ జి.మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-10-18T04:58:05+05:30 IST