హమ్మయ్యా.. గేట్లు కిందికి దిగాయ్‌

ABN , First Publish Date - 2022-08-10T10:09:37+05:30 IST

కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.

హమ్మయ్యా.. గేట్లు కిందికి దిగాయ్‌

కడెం ఆయకట్టు రైతులకు ఊపిరి  

ప్రాజెక్టులోని 16 గేట్ల మరమ్మతులు పూర్తి

సాగు నీటి విడుదలపై అధికారుల దృష్టి 


నిర్మల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 18 గేట్లలో 16 పాడవ్వగా... రెండు మినహా మిగిలిన అన్నింటి మరమ్మతులను పూర్తి చేశారు. కౌంటర్‌వేటర్‌లు వస్తే మిగిలిన రెండు గేట్లు కూడా సిద్ధమవుతాయి. మరోపక్క, కాలువల మరమ్మతు పనులు కూడా చేయిస్తున్న అధికారులు.. ఆయకట్టు రైతులకు నీరు అందించడంపై దృష్టి పెట్టారు. నెలాఖరులోగా కాలువలకు నీటిని విడుదల చేయాలనే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో వానాకాలం సీజన్‌లో సాగుకు నీరు అందుతుందా? లేదా అనే సందేహంలో ఉన్న ఆయకట్టు రైతులకు ఊపిరి అందినట్టు అయ్యింది. కడెం ప్రాజెక్టు ఆయకట్టు 68 వేల ఎకరాలు కాగా ప్రతీ ఏటా 60 వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతోంది.


అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల దాదాపు 6.50లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టును ముంచెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లలో 17ను పైకెత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ తర్వాత గేట్లు కిందకు దిగకుండా మొరాయించడంతో 40 టీఎంసీలకు పైగా వరద నీరు వృథాగా దిగువకు పోయింది. దీంతో రిజర్వాయర్‌ నీటి మట్టం ఒక్కసారిగా పడిపోగా, వానాకాలం సాగుకు నీటి లభ్యతపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, పదిహేను రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించిన నీటిపారుదల శాఖ సాంకేతిక సిబ్బంది గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 16 గేట్లను కిందికి దించారు. కౌంటర్‌ వెయిటర్లు లేని కారణంగా రెండు, మూడు నంబర్‌ గేట్లు మాత్రమే ప్రస్తుతానికి కిందికి దిగడం లేదు. దీంతో అధికారులు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెంచడంపై దృష్టి పెట్టారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.289 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15 నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సుశీల్‌ కుమార్‌ తెలిపారు. అలా జరగని పక్షంలో ఈ నెల చివరివారంలో ఎట్టిపరిస్థితు ల్లో సాగుకు నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Read more