విశాఖలో హైటెన్షన్‌

ABN , First Publish Date - 2022-10-17T09:03:28+05:30 IST

ఏపీలోని ప్రశాంత విశాఖ నగరంలో ఆదివారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

విశాఖలో హైటెన్షన్‌

  • పవన్‌ పర్యటనను అడ్డుకున్న పోలీసులు 
  • ‘జనవాణి’కి ర్యాలీగా వెళ్లకుండా నిషేధం
  • బసచే సిన హోటల్‌ చుట్టూ బలగాలు 
  • పలువురు జనసేన నేతల నిర్బంధం
  • సభలు, సమావేశాలకు నిరాకరణ
  • ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  • బసచే సిన హోటల్‌ చుట్టూ బలగాలు.. పలువురు జనసేన నేతల నిర్బంధం

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):  ఏపీలోని ప్రశాంత విశాఖ నగరంలో ఆదివారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పవన్‌ హోటల్‌ నుంచి బయలుదేరి పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, పోలీసు ఆంక్షల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకోవలసి వచ్చింది. కాగా.. పవన్‌ బసచేసిన హోటల్‌ను పోలీసులుశనివారం అర్ధరాత్రే తమ అధీనంలోకి తీసుకున్నారు. భారీఎత్తున బలగాలను మోహరించారు. నగరంలో పోలీసు యాక్ట్‌-30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ ఆయనకు నోటీసు ఇచ్చారు. పోలీసు యాక్ట్‌  ఉన్నప్పటికీ శనివారం ఎయిర్‌పోర్టులో 500 మందికి పైగా నేతలతో పవన్‌ గుమిగూడారని.. ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా నోవాటెల్‌కు భారీ ర్యాలీ నిర్వహించారని అందులో ఆక్షేపించారు. 


పవన్‌ ఆధ్వర్యంలో జనసేన మద్దతుదారులు మంత్రులు, పౌరులు, పోలీసు అధికారులపై దాడి చేసి పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కలిగించారని.. ఆ దాడిలో కొందరు ప్రజాప్రతినిధులు, పౌరులు, పోలీసు అధికారులు గాయపడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదని, డ్రోన్లు కూడా ఉపయోగించరాదని నోటీసులో స్పష్టం చేశారు. అయితే దీనిని తీసుకునేందుకు పవన్‌ తొలుత తిరస్కరించారు. అనంతరం తన లీగల్‌ అడ్వయిజర్‌ సూచనల మేరకు కొన్ని సవరణలు సూచించారు. ఈ మేరకు సవరించిన నోటీసును పోలీసులు ఇచ్చారు. దానిని అందుకున్న పవన్‌.. ఎయిర్‌పోర్టులో జనం గుడిగూడడంతో తమకు సంబంధం లేదని.. నిరసనగానే నోటీసులు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు.. పవన్‌ను అరెస్టు చేయబోతున్నారని, బలవంతంగా నగరం నుంచి పంపించేస్తున్నారని ప్రచారం జరగడంతో జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హోటల్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. జనవాణి జరిగే పోర్టు స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో జనసేన నేతలు జనవాణిని రద్దు చేశారు. ప్రమాదవశాత్తూ మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు అదే వేదికపై రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించాలని ఆ పార్టీ నిర్ణయించింది. కానీ జనవాణి రద్దుతో మృతుల కుటుంబీకులను నాయకులు నోవాటెల్‌ హోటల్‌కు తీసుకెళ్లి అక్కడ పవన్‌ చేతుల మీదుగా చెక్కులు ఇప్పించారు. 


కోడికత్తి తరహా దాడి!

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి.. ప్రశాంత విశాఖ నగరంలో కోనసీమ తరహా దాడులు కోరుకుంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన అటువంటి అవకాశం కల్పించదని స్పష్టం చేశారు. కోడికత్తి తరహాలోనే.. విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై వాళ్లే దాడులు చేసుకుని.. తిరిగి జనసేన మీదకు నెడుతున్నారని విమర్శించారు. శనివారం అర్ధరాత్రి జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టు నేపథ్యంలో ఆదివారం ఉదయం పవన్‌ నోవాటెల్‌  హోటల్లో విలేకరులతో మాట్లాడారు. విశాఖలో ఏదో ఒకరకంగా గొడవలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. తనకు పోలీసు శాఖ అంటే గౌరవమని.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కింద పోలీసులు పనిచేయాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘‘నాపైజులుం ప్రదర్శించిన పోలీసులు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసుల్లో ఎందుకంత వేగంగా విచారణ చేయడం లేదు?’’ అని నిలదీశారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే చేతులు కట్టుకు కూర్చోవాలా..? అని ప్రశ్నించారు. తన దృష్టిలో మూడు రాజధానులు లేవని.. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నానని.. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని అన్నారు. ‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది.. మీరు ప్రారంభించారు. దానిని స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని జగన్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. 


పవన్‌ ట్వీట్ల దాడి

అధికార వైసీపీకి చురకలు అంటిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ వరుస ట్వీట్లు చేశారు.  ‘ఉడతా ఉడతా ఊచ్‌.. ఎక్కడికెళ్తావోచ్‌.. రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా..? మా వైసీపీకి ఇస్తావా..? మా థానోస్‌ గూట్లో పెడతావా’.. ‘నా గది కిటికీలో నుంచి పలకరించొద్దని ఏపీ పోలీసులు నాకు చెప్పరని ఆశిస్తున్నాను’.. ‘ఒక ఆలోచన నా మనసును దాటింది. ఆర్కే బీచ్‌లో సాయంత్రం నడకకు వెళ్లి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి పోలీసులు నాకు అనుమతి ఇస్తారా’..అంటూ ట్వీట్లు చేశారు. ఆర్కే బీచ్‌లో తనకోసం వేచి చూస్తున్న జన సైనికుల వీడియోను కూడా పోస్టు చేశారు.

Updated Date - 2022-10-17T09:03:28+05:30 IST