Odisha Fake alcohol: ఒడిసా నుంచి భారీగా నకిలీ మద్యం!
ABN , First Publish Date - 2022-12-20T03:19:55+05:30 IST
ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేస్తున్న అక్రమ, నకిలీ మద్యం రాష్ట్ర ఆబ్కారీ ఆదాయానికి గండి కొడుతోంది.
రాకెట్‌ను ఛేదించిన ఎక్సైజ్ అధికార్లు
10 కోట్ల విలువైన మద్యం పట్టివేత?
న్యూ ఇయర్ వేడుకల వేళ కలకలం
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో
3078 లీటర్ల నకిలీ మద్యం పట్టివేత
26 మంది అరెస్టు, నలుగురు పరారీ
నారాయణ్‌పూర్‌లో ఎస్వీ వైన్ షాప్
లైసెన్స్ రద్దు: ఎక్సైజ్ అధికారులు
హైదరాబాద్/నల్లగొండ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేస్తున్న అక్రమ, నకిలీ మద్యం రాష్ట్ర ఆబ్కారీ ఆదాయానికి గండి కొడుతోంది. అంతేగాక ఈ మద్యం ఎక్సైజ్ అధికారులకు సవాలుగా మారుతోంది. ఇదివరకు మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం దిగుమతి అయ్యేదని, తాజాగా ఒడిసా నుంచి కూడా అక్రమంగా తీసుకొస్తున్నారని గుర్తించారు. ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన సోదాల్లో 3078 లీటర్ల అక్రమ, నకిలీ మద్యం పట్టుబడింది. దీని తీగలాగితే ఒడిసాలో డొంక కదిలింది. అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ అధికారుల బృందం భారీ రాకెట్‌ను ఛేదించినట్లు తెలిసింది. దీని విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిసాలో అక్రమ బాటిలింగ్ యూనిట్‌ను సీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, అక్కడ ఎంత మొత్తం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్న వివరాలను మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఈ రాకెట్ వెనక రాష్ట్రానికి చెందిన పెద్దలు, ఎక్సైజ్ అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే అధికారులు వివరాలు వెల్లడించడం లేదని సమాచారం. కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకునే నిందితులు ఈ అక్రమ మద్యాన్ని ఒడిసా నుంచి తరలించడానికి ప్లాన్ వేసినట్లు తెలిసింది. నగర శివార్లలోని మొండి గౌరెల్లి, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, దేవలమ్మనాగారం ప్రాంతాల్లో అక్రమ, నకిలీ మద్యం విక్రయాలు సాగుతున్నట్లు హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ అధికారులకు ఐదారు రోజుల కిందట సమాచారం అందింది. దీంతో మొండి గౌరెల్లి, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లోని బెల్టు షాపుల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు.
3078 లీటర్ల నకిలీ, అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొండి గౌరెల్లిలో భూనేటి గోపీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నకిలీ, అక్రమ మద్యం మూలాలు ఒడిసాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శనివారం ఒడిసాకు వెళ్లి కటక్ సమీపంలోని టాంగీ వద్దనున్న డిస్టిలరీలో తనిఖీలు చేసింది. అది లైసెన్సు లేని డిస్టిలరీ అని తేలడంతో దాన్ని సీజ్ చేశారు. అక్కడ రూ.10 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని గుర్తించినట్లు తెలిసింది. ఆ మొత్తం మద్యాన్ని తెలంగాణకు సరఫరా చేయడానికి సిద్ధం చేశారని తెలిసింది.
కొత్త సంవత్సరం వేడుకల వేళ..
కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న సందర్భంలో నకిలీ మద్యం రాష్ట్రంలోకి దిగుమతి కావడం పట్ల ఉన్నతాధికారులు సీరియ్‌సగా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోనే సరిపడా మద్యం, బీరు తయారవుతోంది. 19 డిస్టిలరీలు, ఐదు బ్రూవరీలు ఇక్కడి అవసరాల మేర మద్యాన్ని, బీరును ఉత్పత్తి చేస్తున్నాయి. విక్రయాలు భారీగా ఉండి, లోటు ఏర్పడితే.. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెప్పించుకుంటుంది. నకిలీ, అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు అక్రమార్కులు నకిలీ టీపీలు, వే బిల్లులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నల్లగొండ, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లలో పట్టుబడిన 3078 లీటర్ల నకిలీ మద్యం ఒడిసా నుంచి వచ్చినట్లు సమాచారం. ఇలా అక్రమంగా మద్యం దిగుమతి అవుతుండడంతో ఆబ్కారీ శాఖ రాబడిపై ప్రభావం చూపుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
3078 లీటర్ల నకిలీ మద్యం పట్టివేత
నకిలీ మద్యం సరఫరా కేసులో మొత్తం 3078 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి 26 మందిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని, ఒక వైన్ షాపు లైసెన్సును రద్దు చేశామని వివరించింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి, నల్లగొండ డిప్యూటీ కమిషనర్లు సోమవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండి గౌరెల్లిలో భూనేటి గోపీకృష్ణ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారని తెలిపారు. గోపీకృష్ణను అరెస్టు చేసి, విచారించగా.. ఇలాంటి నకిలీ మద్యం డంప్ ఇంకా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఈ రాకెట్‌తో అన్నేపల్లి శివారెడ్డి అలియాస్ కొండల్‌రెడ్డి, బింగి బాలరాజుగౌడ్, పోరండ్ల సంజయ్‌కుమార్‌లకు సంబంధం ఉన్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఒడిసాలోని అక్రమ బాటిలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసిందన్నారు. అదేసమయంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇంకా అక్రమ మద్యం నిల్వలు ఉన్నా యా అన్న కోణంలో తనిఖీలు చేపట్టామని వివరించారు. ఈ తనిఖీల్లో 3078 లీటర్ల నకిలీ మద్యం, ముడిసరుకు, ఇతర మత్తు పదార్థాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కటక్‌లోనూ నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుతో బింగి బాలరాజుగౌడ్‌కు సంబం ధం ఉన్నట్లు తేలినందున యాదాద్రి-భువనగిరి జిల్లా నారాయణ్‌పూర్ మండలంలో ఆయన నడుపుతున్న ఎస్వీ వైన్ షాపు లైసెన్సును రద్దు చేశామని, షాపును మూసివేశామని వివరించారు.
‘మునుగోడు’లోనూ ..?
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్వీ గ్రూపు పేరిట మద్యం సిండికేట్‌గా మారినట్లు సమాచారం. ఈ సిండికేట్‌లో 20కి పైగా వైన్ షాపులు ఉన్నట్లు తెలిసింది. వీటి ద్వారా హయత్‌నగర్ కేంద్రంగా కల్తీ, అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం దందాకు బాలరాజుగౌడ్ సూత్రధారుడని అధికారులు గుర్తించారు. కల్తీ మద్యం తయారుచేసి వైన్ షాపులు, బెల్ట్ షాపులకు విక్రయించడమేగాక ఒడిసా నుంచి ఈ ప్రాంతాలకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐబీ క్వార్టర్ ధర రూ.190 కాగా, ఒడిసా నుంచి అక్రమంగా తీసుకొచ్చే బాటిల్ ధర రూ.50 మాత్రమేనని సమాచారం. దీంతో పలువురు వైన్ షాపుల యజమానులు ఆ మద్యంపై దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఒడిసా నుంచి వచ్చిన నకిలీ మద్యాన్ని పెద్ద మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.