హైకోర్టు తరలింపుపై హెచ్‌సీఏఏ భేటీ
ABN , First Publish Date - 2022-12-16T02:53:00+05:30 IST
హైదరాబాద్, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అనువైన ప్రాంతానికి హైకోర్టును తరలించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు అడ్వకేట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి హైకోర్టును
హైదరాబాద్, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అనువైన ప్రాంతానికి హైకోర్టును తరలించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు అడ్వకేట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి హైకోర్టును తరలించాలన్న ప్రతిపాదనలపై గురువారం హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) భేటీ అయింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ... 2008లోనే హైకోర్టును తరలించాలని బార్ అసోసియేషన్ నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే అప్పట్లో అది అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుత హైకోర్టు 18 ఎకరాలలో విస్తరించి ఉందని, దాదాపు 7 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారని, అది 500 వాహనాలకు మాత్రమే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. సోమ, శుక్రవారాల్లో పరిమితికి మించి వాహనాలు వస్తుడటంతో పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. పార్కింగ్ తదితర సమస్యలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టును తరలించే విషయాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. నూతన హైకోర్టు నిర్మాణంకోసం 4 ప్రాంతాల్లో స్థలాలు అనువుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మలక్‌పేట కాలనీలో 80 ఎకరాలు, ఎర్రమంజిల్ కాలనీలోని 85 ఎకరాల ప్రభుత్వ క్వార్టర్స్, మెహదీపట్నంలోని ఖాళీ స్థలం, జూపార్కు స్థలం 150 ఎకరాలు పరిశీలనలో ఉన్నాయని ఆయన వివరించారు. జూపార్కును ప్రభుత్వం మరో ప్రదేశానికి తరలించే ఆలోచనలో ఉందన్నారు. సమావేశంలో న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, చిక్కుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.