హరిత నిధి కళకళ..

ABN , First Publish Date - 2022-10-16T08:38:30+05:30 IST

హరితనిధికి దండిగా నిధులు సమకూరుతున్నాయి.

హరిత నిధి కళకళ..

దండిగా వస్తున్న నిధులు.. 5 నెలల్లో రూ.23 కోట్లు జమ

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హరితనిధికి దండిగా నిధులు సమకూరుతున్నాయి. గత మే నెల ఇప్పటి వరకు ఏకంగా రూ.23 కోట్లు హరితనిధికి జమయ్యాయి. రాష్ట్రంలో హరితహారం అమలుకు నిధుల కొరత రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో నుంచే కాకుండా రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ, రెన్యూవల్‌, విద్యార్థుల అడ్మిషన్లు, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు, పన్నులు, సుంకాలు చెల్లించే వారి నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది మొదలైన ఐదు నెలల్లోనే రూ.23 కోట్ల విరాళాలు హరితనిధికి వచ్చాయి. పర్యావరణం, పచ్చదనం పెంపుకోసం ప్రభుత్వం హరితనిధి ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించేందుకు ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు మే నెలలో తీసుకునే వేతనంలో నుంచే విరాళాలు సేకరించే ప్రక్రియను ఆరంభించారు. 


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అఖిల భారత సర్వీసు ఉద్యోగులు ఏటా రూ.1,200, రాష్ట్ర ఉద్యోగులు రూ.300 చొప్పునా విరాళాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అడ్మిషన్‌ సమయంలో పదో తరగతి వరకు విద్యార్థులు రూ.10, ఇంటర్‌ విద్యార్థులు రూ.15, డిగ్రీ విద్యార్థులు రూ.25, వృత్తి విద్యా (ఫ్రొఫెషన్‌) కోర్సుల విద్యార్థులు రూ.100 చొప్పున విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ల నుంచి రూ.6 వేల చొప్పున, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్‌ చైర్మన్ల నుంచి రూ.1,200 చొప్పున వసూలు చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.120, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టర్లు వారు చే పడున్న పనుల విలువలో నుంచి 0.01 శాతం, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి 10 శాతం, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల నుంచి రూ.50 చొప్పున వసూలు చేసి హరితనిధికి కేటాయించారు. వాణిజ్య సముదాయాల అనుమతి తీసుకున్న లైసెన్సు హోల్డర్ల నుంచి రూ.1,000, లైసెన్సుల పునరుద్ధరణలో రూ.1,000 చొప్పున విరాళాలు వసూలు చేశారు. పన్నులు, సుంకాలు చెల్లించే వారి నుంచి కూడా విరాళాలు వసూలు చేసి హరితనిధికి జమచేశారు. 

Updated Date - 2022-10-16T08:38:30+05:30 IST