ఆదివాసీల ఇలవేల్పు.. ‘ముసలమ్మ తల్లి’

ABN , First Publish Date - 2022-03-16T05:47:06+05:30 IST

ఆదివాసీల ఇలవేల్పు.. ‘ముసలమ్మ తల్లి’

ఆదివాసీల ఇలవేల్పు.. ‘ముసలమ్మ తల్లి’
గుంజేడులో కొలువైన ముసలమ్మ దేవత, విగ్రహంజాతరకు రంగులు వేసి సిద్ధం చేసిన గుంజేడు ముసలమ్మ ఆలయం

ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు 

నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ


కొత్తగూడ, మార్చి 15 : దట్టమైన అడవి...చుట్టూ కొండలు...పక్కన సెలయేరు వేదికగా వెలసిన తోలెం వంశీయుల ఇలవేల్పు ఆదివాసీల దేవతగా వెలసి ప్రస్తుతం అందరి దైవంగా ముసలమ్మతల్లి విలసిల్లుతోంది. కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ.. కొంగుబంగారం చేస్తూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ముసలమ్మ జాతర ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడులో ముసలమ్మ కొలువుదీరి ఉంది. రోజువారీగా ఈ జాతరకు భక్తులు వస్తునప్పటికీ ప్రతీ రెండేళ్లకొకసారి ఈ గుంజేడు ముసలమ్మ జాతరను మహాజాతరగా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర నిర్వహిస్తున్న సమయంలో గుంజేడు ముసలమ్మ దేవత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందని ఆదివాసీల నమ్మకం. మూడు రోజుల పాటు నిర్వహించే జాతర కోసం దేవాదాయశాఖ, పూజారులు భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు.   


అందరి దేవత... 

ఆదివాసీ ఇలవేలుపుగా వెలసిన గుంజేడు ముసలమ్మను ఆదివాసీలతోపాటు నేడు ఆదివాసేతరులు కూడా తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. ఏజెన్సీతోపాటు ఇతర జిల్లాల నుంచి ముసలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ముసలమ్మ దేవతను దర్శించుకోవడం, ముసలమ్మ దేవత సమీపంలో ప్రవహించే ముత్యాలమ్మ వాగు నీరు తీసుకుని వెళ్లి తమ భూముల్లో చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా నీళ్లు చల్లిన భూముల్లో పడిన పంటలో కొంతభాగాన్ని దేవతకు సమర్పించుకుంటారు. సంతానం లేని వారు దేవత విగ్రహం ఎదుట సంతు(వరం) పడుతుంటారు. 


నేటి నుంచి జాతర....

ముసలమ్మ దేవతకు 1075, 1076 ఏళ్ల నుంచి తోలెం వంశీయులు జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట్లో ప్రతీ శుక్రవారం జాతర నిర్వహించే వారు. నేడు ప్రతీ రోజు భక్తులు ఆలయానికి వచ్చి ముసలమ్మ దేవతను దర్శించుకుంటున్నారు. ప్రతీ రెండేళ్లకొకసారి గుంజేడు ముసలమ్మ దేవత మహాజాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే మహాజాతరలో మొ దటి రోజు ఈనెల 16న గుంజేడు గ్రామస్థులు యేటి ఒడ్డు వెలసిన ముత్యాలమ్మ దేవతకు బోనాలు సమర్పిస్తారు. రెండో రోజు గురువారం ముసలమ్మ దేవతను గుట్ట మీద నుంచి తీసుకువచ్చి గద్దెపై ఏర్పాటు చేస్తారు. శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం ముసలమ్మ దేవతను వన ప్రవేశం చేయిస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. మహాజాతర నిర్వహణకు దేవాదాయ శాఖ ఈవో భిక్షమాచారి, ప్రధాన పూజారులు తోలెం చిన్ననర్సయ్య, తోలెం వెంకటేశ్వర్లు, పూజారులు తోలెం కిర్‌కుమార్‌, తోలెం వెంకన్న, తోలెం రాంబాబు, తోలం నవీన్‌కుమార్‌, తోలెం అనంతరావు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయానికి రంగులు వేశారు. అలంకరణలు చేసి ముస్తాబు చేశారు. 

Updated Date - 2022-03-16T05:47:06+05:30 IST