‘డబుల్‌ బెడ్‌’ లబ్ధిదారుల ఎంపికకోసం గ్రామసభ

ABN , First Publish Date - 2022-12-31T23:38:21+05:30 IST

మండలంలోని సర్వేల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం డబల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళ పంపిణీ కోసం గ్రామ సభ నిర్వహించారు.

‘డబుల్‌ బెడ్‌’ లబ్ధిదారుల ఎంపికకోసం గ్రామసభ
సర్వేల్‌ గ్రామసభలో మాట్లాడుతున్న సీపీవో

సంస్థాననారాయణపురం, డిసెంబరు 31: మండలంలోని సర్వేల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం డబల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళ పంపిణీ కోసం గ్రామ సభ నిర్వహించారు. మొత్తం 64 డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. ఇందుకోసం 220 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేద ప్రజలు చేసుకున్న దరఖాస్తులను గ్రామసభలో పరిశీలించారు. ఇందులో 106మందిని అనర్హులుగా గుర్తించారు. 114 మందిని అర్హులుగా గుర్తించారు. వీటిలో 64మందిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనర్హులుగా గుర్తించిన జాబితాలో ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగాయని భావిస్తే వారు వారం రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకుంటే తిరిగి పరిశీలిస్తామని తెలిపారు. మరోసారి గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లా సీపీవో మాన్యనాయక్‌, ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, సర్పంచ కట్టెల భిక్షపతి, తహసీల్దార్‌ రాజు, ఎంపీడీవో రాములు, ఎంపీటీసీ యాదయ్య పాల్గొన్నారు.

తుర్కపల్లిలో ఇళ్ల కేటాయింపునకు మరోసారి సర్వే

తుర్కపల్లి : మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు గ్రామంలో శనివారం మరో సారి సర్వే నిర్వహించారు. మండల కేంద్రంలోని 213 సర్వే నెంబరులో ఉన్న ప్రభుత్వ భూమిలో 40 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. ఇందుకు 177మంది లబ్ధిదారులు ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మండల స్థాయి అధికారులు పలు సర్వేలు నిర్వహించి, ఇటీవల మొదటి గ్రామ సభ నిర్వహించి 37 మంది లబ్ధిదారులను అర్హులుగా, 139 మంది లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించారు. దీనిపై లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభలో గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులతో కలిసి లబ్ధిదారుల ఎంపికపై మరో సారి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో క్లష్టర్‌ ఆఫీసర్‌ శ్యాంసుందర్‌, తహసీల్దార్‌ బ్రహ్మయ్య ఉన్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

చౌటుప్పల్‌ రూరల్‌ : పారదర్శకంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని దండుమల్కాపుం సర్పంచ వెల్వర్తి యాదగిరి తెలిపారు. మండల పరిధిలోని దండుమల్కాపురంలో డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికపై మొదటి గ్రామసభ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్ధార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాస్‌, ఉప సర్పంచ మల్కాజిగిరి కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:38:25+05:30 IST