Golkonda: గోల్కొండ మెట్లబావి.. దోమకొండకు యునెస్కో సలాం

ABN , First Publish Date - 2022-11-28T02:11:46+05:30 IST

తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అవార్డులను ప్రకటించింది.

Golkonda: గోల్కొండ మెట్లబావి.. దోమకొండకు  యునెస్కో సలాం

రాష్ట్రంలోని రెండు చారిత్రక కట్టడాలకు అవార్డులు

ఆసియా-పసిఫిక్‌ విభాగంలో ఎంపిక

దేశంలో నాలుగు నిర్మాణాలకు పురస్కారాలు

ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలకు గుర్తింపు

హైదరాబాద్‌, దోమకొండ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు అవార్డులను ప్రకటించింది. ఆసియా-పసిఫిక్‌ దేశాలకు ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ కేటగిరీలో చోటు సంపాదించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు అరుదైన అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, దేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించాయి. ఈ అవార్డులకు మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించి దరఖాస్తులు అందగా.. ఆయా కట్టడాల విశిష్టత, పౌరులు, పౌరసంస్థలు పునరుద్ధరించిన తీరు తదితర అంశాలపై జ్యూరీ సభ్యులు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. చివరకు ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలకు ఐదు కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. ఈ అవార్డుల్లో నాలుగింటిని భారత్‌, మరో నాలుగింటిని చైనా దక్కించుకున్నాయి. ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, అఫ్ఘానిస్థాన్‌, నేపాల్‌ దేశాలకు ఒక్కోటి చొప్పున అవార్డులు వచ్చాయి.

Untitled-2.jpg

ఆగాఖాన్‌ ట్రస్ట్‌ చొరవతో..

కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న మెట్లబావి(గోల్కొండ మెట్లబావి) 17వ శతాబ్దం నాటిది. అద్భుతమైన కౌశలంతో ఈ బావిని నిర్మించారు. కాకతీయ పాలకులు కూడా ఈ తరహా బావులను నిర్మించారు. చారిత్రక కట్టడమైన గోల్కొండ మెట్లబావి కాలక్రమంలో మరుగున పడిపోయింది. భారీ వర్షాలతో ఓ భాగం కూలిపోయి.. పూర్తిగా పూడుకుపోయింది. 2013లో ఈ బావి దుస్థితిని గుర్తించిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌ పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ చారిత్రక సంపద పరిరక్షణకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ క్రతువుకు తనవంత సహకారం అందించారు. అలా.. పూడుకుపోయిన బావి పునరుద్ధరణకు నోచుకుంది. ప్రస్తుతం ఈ బావిలో ఊట కొనసాగుతోంది. ఒక పౌర సంస్థగా ఆగాఖాన్‌ ట్రస్ట్‌ చేసిన కృషిని యునెస్కో గుర్తించింది. గోల్కొండ బావికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ చైర్మన్‌ మణికొండ వేదకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ చొరవ వల్ల ఈ బావికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.

Untitled-3.jpg

కామినేని కోట.. దోమకొండ

కామారెడ్డి జిల్లా దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు. 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో నిర్మించారు. నిత్యం పరిరక్షణ చర్యలు తీసుకుంటుండడం వల్ల ఈ కోట్ల ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ కోటలో అద్దాల మెడ, రాజభవనం, అశ్వసాలు, బుర్జులతో పాటు 400 సంవత్సరాల క్రితం రాతితో నిర్మించిన అతి పురాతనమైన శివాలయం(మహాదేవ ఆలయం) ఉంది. ప్రస్తుతం ఈ కోట నిర్వహణ మొత్తం దోమకొండ సంస్థానాధీశుడు, సినీనటుడు చిరంజీవికి వియ్యంకుడు అయిన కామినేని అనిల్‌కుమార్‌ చేపడుతున్నారు. యూపీఏ సర్కారు హయాంలో.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. ఈ కోటను నిర్మించినప్పుడు చుట్టూ ఏర్పాటు చేసిన కందకం ఇప్పటికీ కనిపిస్తుంది. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. చిరంజీవి తనయుడు రాంచరణ్‌, కామినేని అనిల్‌ కుమార్తె ఉపాసనల వివాహం ఇదే కోటలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆర్కిటెక్ట్‌ అనురాధ నాయక్‌ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఈ కోటను పరిరక్షిస్తున్నారు. దోమకొండ కోటకు యునెస్కో గుర్తింపురావడం పట్ల కామినేని అనిల్‌, ఆయన సతీమణి శోభన హర్షం వ్యక్తం చేశారు.

అవార్డుకు ఎంపికైన పలు దేశాల కట్టడాలు

యాజ్ద్‌(ఇరాన్‌)లోని ఉన్న జార్చ్‌ఖానత్‌

యాజ్ద్‌(ఇరాన్‌)లోని సాదౌఘీ హౌస్‌

బ్యాంకాక్‌లోని నీల్సన్‌ హేస్‌ లైబ్రరీ

చారికర్‌(అఫ్ఘానిస్థాన్‌)లోని తోప్‌దారా స్థూప

కఠ్మాండూ(నేపాల్‌)లోని 25 చివాస్‌

ఫ్యూజియాన్‌(చైనా)లోని నాంతియన్‌ బుద్దిస్ట్‌ టెంపుల్‌

షాంఘై(చైనా)లోని వెస్ట్‌ గుయిఝౌ లిలాంగ్‌ నేబర్‌హుడ్‌

మకావో(చైనా)లోని ఎం30 ఇంటి గ్రేటెడ్‌

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పవర్‌ సప్లై అండ్‌ వేస్ట్‌ కలెక్షన్‌

నాంజింగ్‌(చైనా)లోని షియాషిహు బ్లాక్‌

మొట్టమొదటి రైల్వేస్టేషన్‌కు గౌరవం

1853లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ డల్‌హౌసీ ముంబై(అప్పట్లో బాంబే) నుంచి ఠాణే వరకు మొట్టమొదటి రైల్వే లైన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ముంబైలోని బైకుల్లాలో చెక్కలతో నిర్మించిన రైల్వేస్టేషన్‌ నుంచి మొదట్లో కార్యకలాపాలు కొనసాగేవి. భారత్‌లో బ్రిటిష్‌ రాణి పాలన రాకముందే.. అంటే.. 1857లో బైకుల్లా రైల్వేస్టేషన్‌ను దిట్టంగా నిర్మించారు. ఇప్పటికీ ఈ కట్టడం కొనసాగుతోంది. ఈ స్టేషన్‌ శిథిలావస్థలో ఉన్న సమయంలో ‘బజాజ్‌ చారిటబుల్‌ గ్రూప్‌’, ‘ఐ లవ్‌ ముంబై’ అనే ఎన్జీవో సంస్థలు పునరుద్ధరణ బాధ్యతలను తీసుకున్నాయి. రైల్వే శాఖ అందుకు సమ్మతి వ్యక్తం చేయడంతో.. చకచకా పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. కొవిడ్‌ కాలంలో కన్జర్వేటివ్‌ ఆర్కిటెక్ట్‌ అభయ్‌ నరైన్‌ లంభా నేతృత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దారు.

వహ్వా.. శివాజీ మ్యూజియం

యునెస్కో జ్యూరీ ‘అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ కేటగిరీలో అవార్డుకు ఎంపిక చేసిన ఏకైక కట్టడం ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వస్తు సంగ్రహాలయ’ కావడం గమనార్హం. ఈ కట్టడం పునరుద్దరణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు, మంచి నాణ్యతాప్రమాణాలను పాటించినట్లు జ్యూరీ వ్యాఖ్యానించింది. ముంబైలోని ‘విక్టోరియన్‌ గోతిక్‌ అండ్‌ ఆర్ట్‌ డికో ఎన్‌సెంబుల్స్‌’ వందేళ్లుగా ఈ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది.

Updated Date - 2022-11-28T12:42:55+05:30 IST