యాదాద్రికి గోదావరి జలకళ!

ABN , First Publish Date - 2022-03-22T09:07:11+05:30 IST

గోదావరి జలాలు యాదాద్రీశుడి చెంతకు చేరాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆరంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.

యాదాద్రికి గోదావరి జలకళ!

  • కాళేశ్వరం నుంచి గండి చెరువులోకి నీటి విడుదల
  • రాగి బిందెలో కొండపైకి నీళ్లు తీసుకెళ్లిన ప్రభుత్వ విప్‌ సునీత
  • పవిత్ర జలాలతో మహాకుంభాభిషేక ఉత్సవానికి పూజలు


యాదాద్రి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలు యాదాద్రీశుడి చెంతకు చేరాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆరంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సోమవారం ఉదయం ఓ రాగిబిందెలో పవిత్ర గోదావరి జలాలను యాదాద్రీశుడి చెంతకు తీసుకొచ్చారు. ఈ జలాలతోనే దేవస్థాన అర్చకులు.. మహాకుంభ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో స్వస్తివాచనం పూజలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు గోదావరి జలాల మళ్లింపునకు ఉద్దేశించి బస్వాపూర్‌ వద్ద నృసింహస్వామి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. 11.39 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మాణమవుతుండగా.. తొలిదశలో 1.5 టీఎంసీల నీటిని మళ్లించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. 42 మీటర్ల ఎత్తు, 495 మీటర్ల వెడల్పు, మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తుండగా.. రిజర్వాయర్‌లోకి నీరు తరలించడంతో పాటు కాల్వల పరిశీలనపై ఇప్పటికే అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.


ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి వద్ద ఆపరేషన్‌ ట్యాంక్‌ (ఓటీ) 1, 2లను ఏర్పాటు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రారంభించిన ఓటి 1 నుంచి గోదావరి జలాలను గండి చెరువులోకి వదిలారు. ఓటీ 2పై ట్రయల్‌ రన్‌ను అధికారులు పరిశీలించారు. ఈ రిజర్వాయర్‌ కోసం ఇప్పటికే బీఎన్‌ తిమ్మాపూర్‌లో 382 ఎకరాలు, బస్వాపూర్‌లో 900 ఎకరాలు, వడపర్తిలో 285 ఎకరాలు సేకరించారు. జంగంపల్లిలో 129 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. మిగిలిన 611 ఎకరాలకు సంబంధించి సర్వే పనులు కొనసాగుతున్నాయి. కాగా, గండి చెరువును సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.33 కోట్ల నిధులు కేటాయించింది. 

Updated Date - 2022-03-22T09:07:11+05:30 IST