జొన్న కొనుగోళ్లపై వివరణ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-06-22T10:06:17+05:30 IST

జొన్న పంటను సేకరించే అంశంపై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

జొన్న కొనుగోళ్లపై వివరణ ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జొన్న పంటను సేకరించే అంశంపై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీస మద్దతు ధర రావడం లేదని పేర్కొంటూ రైతు స్వరాజ్య వేదికకు చెందిన సంగెపు బొర్రన్న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జొన్నల కనీస మద్దతు ధర రూ. 2,738 ఉండగా, ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల కేవలం రూ. 1,500 నుంచి రూ. 1,700లకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వరి వద్దని.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో రైతులు జొన్నలు వేశారని తెలిపారు.  అయితే ఇప్పుడు పంటను సేకరించడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయశాఖ కమిషనర్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ తదితరులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. 


Updated Date - 2022-06-22T10:06:17+05:30 IST