రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ABN , First Publish Date - 2022-01-21T05:56:53+05:30 IST
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

బల్దియా కౌన్సిల్ సమావేశం పిలుపు
రూ.4.85కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
టెలీ కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొన్న కార్పొరేటర్లు
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 20: ‘సమష్టి కృషితో వరంగల్ నగరాభివృద్ధిని సాధిద్దాం.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికే మొగ్గు చూపుదాం..’ అని వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం పిలుపునిచ్చింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గురువారం జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉదయం 11.30గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30గంటల వరకు సాగింది. కరోనా నేపథ్యంలో సమావేశాన్ని టెలీకాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించారు. సెల్ఫోన్ల ద్వారా డివిజన్ల సమస్యలు, అజెండా అంశాలపై ఆమోదం తెలియచేశారు.
రూ.4.85 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు సంబంధించి రూ.4.85కోట్ల నిధుల కేటాయింపునకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేవలం 8 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. ఇందులో 42వ డివిజన్ సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం, 44వ డివిజన్ అమ్మవారిపేట రహదారిలో గట్టమ్మ నుంచి జక్కలొద్ది వరకు బీటీ రోడ్డు నిర్మాణం, కొత్తపేట నుంచి ఆరెపల్లి ఓఆర్ఆర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు గాను రూ.3.88కోట్ల నిధుల కేటాయింపు ఉండగా, మిగతా నిధులు చెల్లింపులకు సంబంధించినవిగా ఉన్నాయి. అజెండాలోని అన్ని అంశాలకు సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలియచేసింది. కాగా, జీడబ్ల్యూఎంసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 30 శాతం వేతనాల పెంపు ప్రతిపాదనపై కూడా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేసింది. దీని ద్వారా ప్రస్తుత వేతనాలపై 30 శాతం పెంపు వర్తించనుంది.
ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే..
కరోనా నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశం టెలీ కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ అయినప్పటికీ మూడు గంటల పాటు సమావేశం సాగింది. ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ గుండు సుధారాణి ఇంటి నుంచే కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వింగ్ అధికారులతో కమిషనర్ ప్రావీణ్య బల్దియా ప్రధాన కార్యాలయంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తమ ఇంటి నుంచి సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, క్యాంపు కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. ఇక కొందరు కార్పొరేటర్లు ఇళ్ల నుంచి, మరి కొందరు బయట ఎక్కడ ఉంటే అక్కడి నుంచి, కార్లలో ప్రయాణం చేస్తూ సమావేశానికి సరికొత్త ట్రెండ్నిచ్చారు.
సమస్యలపై గళం
సెల్ఫోన్లలో అజెండా అంశాలను ఆమోదించడంతో పాటు డివిజన్లలోని సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తారు. రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, కుక్కల బెడద, మిషన్ భగీరథ అసంపూర్ణ పనులు, పైప్‌లైన్ లీకేజీలు, డివిజన్లకు కేటాయించిన నిధుల విడుదల, టెండర్ల నిర్వహణ తదితర సమస్యలను కార్పొరేటర్లు వినిపించారు. దీనిపై మేయర్, కమిషనర్లు స్పందించారు. వింగ్ అధికారుల నుంచి వివరణ ఇప్పించారు.
అభివృద్ధి ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి : మేయర్
నగరాభివృద్ధి ఫలితాలు క్షేత్రస్థాయిలో ఆవిష్కృతమవుతున్నాయి. తొలిదశలో చేపట్టిన నాలుగు స్మార్ట్‌రోడ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. ఇక వరంగల్‌లో నిర్మిస్తున్న 11స్మార్ట్‌రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్టీపీల నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, భద్రకాళి బండ్ రెండోదశ నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టుల పూర్తి ద్వారా నగర రూపురేఖలు మారనున్నాయి. ఇక నగరబాట ద్వారా డివిజన్ల అభివృద్ధిని మరింత వేగిరం చేస్తోంది. నర్చరింగ్ నైబర్‌హుడ్ ఛాలెంజ్‌లో వరంగల్ దేశంలో టాప్ టెన్ సిటీ్‌సలో ఒకటిగా నిలువడం గొప్ప విషయం. జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు, సమష్టికృషితో మరిన్ని విజయాలు సాధిద్ధాం. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీలలో ఈసారి ఉత్తమ ర్యాంక్ సాధన కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ర్యాంక్ సాధనకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటున్నాం. ఇందులో ప్రధానమైనది మడికొండలోని బయోమైనింగ్ ప్రాజెక్టు. మెరుగైన పారిశుధ్య నిర్వహణకు అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన వాహనాలు సమకూర్చుకున్నాం. రూ.42 కోట్లతో సమీక్షత మార్కెట్ల నిర్మాణం జరుగనుంది.
కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: చీఫ్ విప్
కరోనా విజృంభిస్తున్న తరుణంలో జీడబ్ల్యూఎంసీ కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాక్సిన్‌తో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అధికారులు అశ్రద్ధ చేయవద్దు.. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి.
విలీన గ్రామాలపై దృష్టి పెట్టండి : ఎమ్మెల్యే అరూరి
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల సమస్యలపై దృష్టి పెట్టండి. గతంలో సమస్యలపై సమీక్ష సమావేశాలను నిర్వహించాం. కానీ ఆశించినంత మేరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ పనులు జరగకపోతే ఎలా?. పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేసి కొత్త ప్రతిపాదనలు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయండి.
మార్కెట్ సదుపాయాల కల్పన జరగాలి : ఎమ్మెల్యే చల్లా
బీట్ బజార్ వ్యాపార కేంద్రాన్ని గొర్రెకుంటకు తరలిస్తూ నిర్మాణమైన మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. త్వరలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలి. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల సమస్యలపై ప్రణాళికను అందచేశా. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి.
సమస్యలపై స్పందిస్తున్నాం : కమిషనర్ ప్రావీణ్య
అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమస్యలపై వెను వెంటనే చర్యలు చేపడుతున్నాం. నిర్దేశిత కాలంలో పనులు పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం.