Assembly Meetings: 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

ABN , First Publish Date - 2022-12-07T02:52:56+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవనున్నాయి. 12న (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై 16 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని సమాచారం.

Assembly Meetings: 12 నుంచి   అసెంబ్లీ సమావేశాలు?

ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం

గవర్నర్‌ అనుమతి కోరకుండానే ప్రారంభం!

తమిళిసై తీరును ఆక్షేపిస్తూ చర్చ!

వర్సిటీల చాన్స్‌లర్‌గా తొలగిస్తూ బిల్లు?

అప్పులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు..

ఐటీ, ఈడీ దాడులపై చర్చించే అవకాశం

కేంద్ర వైఖరి నిరసిస్తూ తీర్మానాలను ప్రవేశ పెట్టే యోచన

నేడు జగిత్యాలలో సీఎం పర్యటన

కలెక్టరేట్‌, తెలంగాణ భవన్‌ ప్రారంభం..

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవనున్నాయి. 12న (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై 16 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని సమాచారం. 10న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రధాన అజెండా ఏమిటి? అన్న అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి కూడా స్పీకర్‌ అనుమతితోనే సమావేశాలను నిర్వహించబోతున్నారు. గవర్నర్‌ అనుమతి కోరకుండానే సెప్టెంబరులో సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి సెప్టెంబరు 6న సమావేశాలను ప్రారంభించగా.. 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగాయి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గవర్నర్‌ను దూరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈసారి కూడా స్పీకర్‌ ద్వారానే సమావేశాలను ప్రారంభించనుంది. అంటే.. ఆ సమావేశాల (ఎనిమిదో)కు కొనసాగింపుగానే తాజా సమావేశాలను నిర్వహించనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, శాసన సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఇదివరకే ఆదేశించారు. డిసెంబరు రెండో వారంలో సమావేశాలను ప్రారంభించాలని చెప్పారు. దానికి అనుగుణంగానే 10న క్యాబినెట్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు.

కేంద్ర ఆంక్షలు, గవర్నర్‌ తీరుపైనే దృష్టి

ఈసారి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్‌ఎస్‌ విరుచుకుపడనుంది. అప్పులపై ఆంక్షలు, గ్రాంట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడాన్ని ఎత్తి చూపనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్ర పురోగతి దెబ్బతింటుందని చెప్పనుంది. కేంద్రం ఆంక్షలు విధించకపోతే రాష్ట్ర జీఎ్‌సడీపీ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14.50 లక్షల కోట్లకు చేరేదని, ఆంక్షల కారణంగా రూ.11.50 లక్షల కోట్లకే పరిమితమైందన్న ఆగ్రహంతో ప్రభుత్వం ఉంది. రుణాలపై విధించిన ఆంక్షల వల్ల రూ.40 వేల కోట్ల అప్పు పుట్టకుండా పోయిందని ఇటీవల సీఎం ఆరోపించిన సంగతి తెలిసిందే. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన గ్రాంట్లను ఇవ్వడం లేదని.. 14వ, 15వ ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు గ్రాంట్లు విడుదల చేయడం లేదని ప్రభుత్వం ఆక్రోశిస్తోంది. మరోవైపు భయానక వాతావరణం సృష్టించేలా మంత్రులపై ఐటీ, ఈడీల ద్వారా దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. ఇలా కేంద్ర ప్రభుత్వ వైఖరిని సభకు వివరిస్తూనే.. తీర్మానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపే అవకాశముంది. అదేసమయంలో రాష్ట్ర గవర్నర్‌ తీరును కూడా ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ సమావేశాల్లో గవర్నర్‌ వైఖరిపై చర్చించనున్నట్లు తెలిసింది.

సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఎనిమిది బిల్లులను గవర్నర్‌ వద్దకు పంపించగా.. ఇప్పటికి ఒక్క జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించారు. మిగతా ఏడు బిల్లులను పెండింగ్‌లో పెట్టడంపైనా సభలో చర్చించనున్నారు. ఈ బిల్లులను ఆమోదించాలంటూ ఓ తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపనున్నట్లు తెలిసింది. యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించే బిల్లునూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ బిల్లును సభలో ఆమోదించి, గవర్నర్‌కు పంపిస్తే.. దాన్ని కూడా ఆమె పెండింగ్‌లో పెడతారేమోన్న చర్చ జరుగుతోంది. కాకపోతే.. గవర్నర్‌ను కార్నర్‌ చేసి, మరింత విమర్శల పాలు చేయడానికే బిల్లును ఆమోదించి పంపాలన్నది సర్కారు ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కూడా పలు వేదికలను వినియోగించుకుంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర ప్రభుత్వ తీరును పూసగుచ్చినట్లు వివరించారు. ఇలా రాజ్‌భవన్‌కు, సీఎంవోకు మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం కాస్త ఘాటుగానే స్పందించే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-12-07T04:07:47+05:30 IST