కేసీఆర్‌ సారీ చెప్పు!

ABN , First Publish Date - 2022-02-03T07:24:49+05:30 IST

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తే రాజ్యాంగం పనికిరాదంటే? సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే..? కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని వ్యాఖ్యానిస్తే..? పెను దుమారమే!

కేసీఆర్‌ సారీ చెప్పు!

  • రాజ్యాంగాన్ని మార్చాలా?.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా?
  • రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది
  • ఆ రాజ్యాంగం భిక్షతోనే సీఎం అయ్యారు
  • పవిత్ర రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే
  • ప్రజలే ఆయన నాలుకను తెగ్గోస్తారు
  • బీజేపీ కుట్రకు కేసీఆర్‌ మద్దతు: రేవంత్‌రెడ్డి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నేతలు, సంఘాల ధ్వజం
  • ఇందిరా గాంధీయే భంగపడ్డారు
  • ఆఫా్ట్రల్‌ కేసీఆర్‌ ఎంత?: ఎంపీ బండి సంజయ్‌
  • సీఎం కేసీఆర్‌ నిరంకుశ రాజ్యాంగాన్ని 
  • తేవాలనుకుంటున్నారా?: కోదండరాం
  • కేసీఆర్‌ లాంటి మూర్ఖ నాయకుల నుంచి
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: ప్రవీణ్‌ కుమార్‌
  • కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్ష: మందకృష్ణ
  • రాష్ట్రవ్యాప్త ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మల దహనం
  • నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌, బీజేపీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తే రాజ్యాంగం పనికిరాదంటే? సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే..? కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని వ్యాఖ్యానిస్తే..? పెను దుమారమే! ఇప్పుడు రాష్ట్రంలో అదే జరిగింది. మంగళవారం కేంద్ర బడ్జెట్‌పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని మళ్లీ రాయాల్సిన అవసరం ఉందని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పేమీ లేదన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే రాజ్యాంగాన్ని తిరగరాయాలని స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం చేశాయి. ‘‘రాజ్యాంగాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం గురించి ఒక్క మాట మాట్లాడినా ప్రజలు కేసీఆర్‌ నాలుక కోస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న బీజేపీ ఆలోచననే సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఆయన వ్యవహారశైలి చూస్తే చిక్కడపల్లి కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగినట్లుగా ఉంది.


విలేకరుల సమావేశానికి మందు కలిపిన కల్లు తాగి వచ్చి మతి లేకుండా మాట్లాడినట్లు కనిపించింది’’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనులకు రక్షణ కల్పించేలా అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి.. భూస్వాములు, పెట్టుబడిదారులకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించాలన్న బీజేపీ ఆలోచనను సమర్థిస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకొచ్చారని ఆరోపించారు. నిజంగా రాజ్యాంగం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలని భావిస్తే సవరణలను ప్రతిపాదించాలన్నారు. అవేవీ చేయకుండా రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న బీజేపీ ఆలోచనను ప్రతిపాదిస్తున్నారంటే దీన్ని ఏ రకంగా చూడాలని ప్రశ్నించారు. దళిత, గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించాలన్న బీజేపీకి కుట్రకు సీఎం కేసీఆర్‌ వంత పాడారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎంతో కాలం నుంచి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడు వెనక్కి తగ్గి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ద్వారా ఆ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కాగా, రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తుందుకు నిరసనగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల ముందు గురువారం కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.


గురువారం, శుక్రవారం గాంధీ భవన్‌లో దీక్ష చేస్తామని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు. ఇంకో సారి రాజ్యాంగం గురించి మాట్లాడితే చూరచూర అవుతావు బిడ్డా..’’ అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. బుధవారం సంజయ్‌ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారత రాజ్యాంగాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడుతున్నదని, అభ్యంతరాలు ఉంటే చెప్పకుండా రాజ్యాంగాన్నే తిరగ రాయాలనడం సరికాదని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని గతంలో కొన్ని పార్టీలు భయభ్రాంతులకు గురిచేశాయని, ఇప్పుడు బీజేపీ రాజ్యాంగాన్ని తిరగ రాసిందా? అని నిలదీశారు. గతంలో ఇందిరా గాంధీ కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను మార్చేందుకు కుట్ర పన్ని భంగపడ్డారన్నారు. ఆఫ్ర్టాల్‌ కేసీఆర్‌ ఎంతని ఎద్దేవా చేశారు.


కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తారని సంజయ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దీక్ష చేపట్టాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. 


రాజ్యాంగాన్ని మార్చాలంటారా?: కిషన్‌రెడ్డి

రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దారుణమన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించడం సరికాదని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకత్వంపై, కేంద్రంపై కేసీఆర్‌ అడ్డగోలు భాషను ప్రయోగించారని ఆరోపించారు. పాకిస్థాన్‌ ప్రధాని కూడా మోదీని ఎన్నడూ ఇలా విమర్శించలేదని, సీఎం కేసీఆర్‌ మాటలు వింటే బాధేస్తోందని అన్నారు. ఆయనలో అభద్రతాభావం స్పష్టంగా కనిపించిందని, బీజేపీని విమర్శించే ముందు ఆయన ఇచ్చిన హామీలను ఎంతమేరకు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు ఏమిచ్చారని సీఎం అడుగుతున్నారని, అంటే ప్రగతి భవన్‌కు నేరుగా చెక్కు ఇవ్వాలా అని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ‘‘7 ఏళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు లేవు. రాష్ట్రానికి సచివాలయం లేదు. ఉన్నప్పుడు సీఎం సచివాలయానికి రాలేదు. ప్రజలను, మంత్రులను కలవరు. మీరేమైనా రాజ్యాంగానికి అతీతులా?’’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్‌ కుటుంబ సొత్తు కాదని, అందరికీ హక్కు ఉందని స్పష్టం చేశారు. 


ప్రమాదకర ఆలోచన: కంచె ఐలయ్య

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రతిపాదన ప్రమాదకరమైందని ప్రముఖ తత్వవేత్త కంచె ఐలయ్య షెపర్డ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీయడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఆర్‌ఎ్‌సఎ్‌స/బీజేపీ దీర్ఘకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.  కాగా, సీఎం కేసీఆర్‌, చిన్నిజీయర్‌స్వామి ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ మాదిగ విమర్శించారు.


భగ్గుమన్న సంఘాలు

భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించి కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలనడం అంబేడ్కర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు. ఓయూ జేఏసీ, బీఎస్పీ విద్యార్థి సంఘాల నాయకులు కేసీఆర్‌ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, నాగనమోని చెన్నరాములు డిమాండ్‌ చేశారు.


భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి: చాడ 

బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల నుంచి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. విస్తృత  చర్చోపచర్చల అనంతరం రూపొందించిన రాజ్యాంగం స్థానంలో నూతన రాజ్యాంగాన్ని తీసుకు రావాల్సిన అవసరం లేదన్నారు.


ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి: తమ్మినేని

కేసీఆర్‌ కొత్త రాజ్యాంగం అవసరమని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వ నియంతృత్వ ధోరణి, మతోన్మాద విధానాలను విమర్శిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. అయితే, అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలని సూచించారు. 


కేసీఆర్‌నే మార్చాలి: భట్టి

కొత్త రాజ్యాంగాన్ని రాయాలంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఫ్యూడల్‌ మనస్తత్వం బయటపడిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కాదని.. కేసీఆర్‌నే మార్చాలని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ అంతర్లీనంగా చేస్తున్న కుట్రలకు మద్దతుగా కేసీఆర్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మోదీ సర్కారుపై కేసీఆర్‌ తిట్ల పురాణం బూటకమని, బీజేపీ అజెండాను అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. దేశానికి అన్నీ ఇచ్చిన రాజ్యాంగాన్ని తెలంగాణలో ఎన్నడూ అమలు పరచని సీఎం కేసీఆర్‌కు కొత్త రాజ్యాంగం కావాలని అనడానికి అసలు బుద్ధుందా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలకు విలువ లేకుండా చేశారని, రాజ్యాంగ వ్యవస్థలను బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ వ్యాఖ్యల వెనక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కులను కాలరాసే కుట్ర దాగుందని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణను తిరోగమనంలోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 


కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా?: ఈటల 

రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్‌కు దాని స్థానంలో కల్వకుంట్ల రాజ్యాంగం, రాచరిక పాలన కావాలా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తీసేయాలంటూ మాట్లాడిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ను అవమానించారన్నారు. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ అందరికీ సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్‌ 3 ద్వారానే వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుచేటన్నారు.




చర్చ జరిగేది నీ అవినీతిపైనే: డీకే అరుణ

‘‘అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కూడా మార్చాలా? నీ మాటలపై దేశమంతా చర్చ జరగాలా? అవినీతి సామ్రాట్టువు నువ్వు. గుర్తు పెట్టుకో. దేశంలో చర్చ జరిగేది నీ అవినీతి పైనే’’ అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తాను సీఎం అయిన కేసీఆర్‌.. రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని దుయ్యబట్టారు. ఏనాడైనా అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొన్నాడా? అని ప్రశ్నించారు. 


నిరంకుశత్వం కోసమా?: కోదండ

కేసీఆర్‌ రాజ్యాంగం రాస్తా అంటున్నారంటే.. అది కచ్చితంగా నిరంకుశ రాజ్యాంగమే అయి ఉంటుందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించేందుకే రాజ్యాంగం మార్చాలంటున్నారని విమర్శించారు. టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్యూడల్‌ ఆలోచనలున్న కేసీఆర్‌కు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ఏం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. 317 జీవోను సవరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అప్రజాస్వామిక, అరాచక పాలనను ఎదుర్కొనేందుకు త్వరలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించి తీర్మానాలు చేస్తామని చెప్పారు.


ఇరిగేషన్‌ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల మీద ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము విలాసాలు, విందులకు ఖర్చు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండరని, ఆయన పాలనలో ప్రజలు అణచివేతకు గురవుతున్నారని విమర్శించారు. అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి స్థానికత అంటున్నారన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నరంటే అది కచ్చితంగా నిరంకుశ రాజ్యాంగమే అయి ఉంటుంది. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించేందుకే ఆయన రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు.            

టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం


బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే: ప్రవీణ్‌

సీఎం కేసీఆర్‌ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడడం దురదృష్టకర మని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఎంతో మంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగం ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ తన ఆస్తులు, కమీషన్లను పెంచుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని ఆరోపించారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.


సీఎం కేసీఆర్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత రాజ్యాంగాన్ని కేసీఆర్‌ లాంటి మూర్ఖపు నాయకుల నుంచి కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని అనుకుంటున్నారో రాష్ట్ర, దేశ ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టి, ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.


రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్‌ సీఎం అయ్యారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారో వివరించాలి. ఇలాంటి మూర్ఖపు నాయకుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆయన ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.  

బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌


సీఎం కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం గురించి ఒక్క మాట మాట్లాడినా ప్రజలే ఆయన నాలుక తెగ్గోస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా.. రిజర్వేషన్లను తొలగించాలన్న బీజేపీ కుట్రకు కేసీఆర్‌ వంత పాడారు.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి


కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: మందకృష్ణ 

దేశానికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అవసరం లేదని, కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారని.. తానూ ఆయనతో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ విషయంలో నువ్వు కానీ, నీ కుటుంబ సభ్యులు, నీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల రూపంలో ఉన్న తాబేదార్లు ఎవరొచ్చినా.. మేం చర్చకు సిద్ధం. మీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు ఎవరు వస్తారో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పండి’ అని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరమైతే సవరణలు చేసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారని.. కేసీఆర్‌ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


ఇప్పటికే 105 రాజ్యాంగ సవరణలు జరిగాయని, ఇది రాజ్యాంగంలో అంబేడ్కర్‌ చూపిన మార్గమేనని తెలిపారు. దేశంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి రాజ్యాం గం కారణం కాదని.. పాలకులేనని మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ స్పష్టం చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ రాజ్యాంగం మీద నెపం పెట్టి దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కుట్రలో ముందువరుసలో ఉన్న కేసీఆర్‌ను ఓడించినప్పుడే రాజ్యాంగానికి, ప్రజలకు రక్షణ ఉంటుందని తెలిపారు. ఒక దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉంటుందన్న అసహనం కేసీఆర్‌లో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 10 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కేసీఆర్‌ తన వాఖ్యలు వెనక్కి తీసుకునేవరకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు వెంటాడతామని.. అరెస్టులకు వెనకాడేది లేదని తెలిపారు.  


రాజ్యాంగం మార్చాలని, చర్చకు సిద్ధమని చెబుతున్న కేసీఆర్‌.. నేను సిద్ధం. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు ఎవరొస్తారో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పు. నియంతృత్వాన్ని తెచ్చే కుట్రలో భాగస్వాముడైన కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి, ప్రజలకు రక్షణ.


ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ


‘‘కేసీఆర్‌.. రాజ్యాంగాన్ని టచ్‌ చేసి చూడు. ఇంకోసారి రాజ్యాంగం గురించి మాట్లాడితే చూరచూర అవుతవ్‌ బిడ్డా. రాజ్యాంగాన్ని మార్చాలనుకొని ఇందిరాగాంధీయే భంగపడ్డది. ఆఫా్ట్రల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంత?’’ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

Updated Date - 2022-02-03T07:24:49+05:30 IST