ఫారెన్‌లో.. రయ్‌..రయ్‌..

ABN , First Publish Date - 2022-09-27T06:00:13+05:30 IST

ఫారెన్‌లో.. రయ్‌..రయ్‌..

ఫారెన్‌లో.. రయ్‌..రయ్‌..

ఇక్కడి లైసెన్సుతో విదేశాల్లో షికారు..

అంతర్జాతీయ లైసెన్సులకు పెరుగుతున్న ఆదరణ

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో 3,631 మందికి లైసెన్సు

అమెరికా, యూకే, ఆస్ర్టేలియా, కెనెడా వెళ్తున్నవారిలో ఆసక్తి


మట్టెవాడ, సెప్టెంబరు 26: వరంగల్‌లో కారు నడిపిన, బైక్‌ నడిపిన ప్రపంచంలో ఎక్కడైన సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ నిబంధనలు, వాహనం నడిపేటప్పుడు నిరంతర అప్రమత్తత, వాహనదారులకు ప్రతిరోజు పాఠాలు నేర్పుతునే ఉంటాయి. అందుకే నగరంలో బండినడిపిన వాళ్లు విదేశాల్లో హాయిగా వాహనాలు నడుపవచ్చు. ఈక్రమంలోనే నగరంలో అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. వరంగల్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో నిత్యం సాధారణ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులు ఇస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం, విదేశాల్లో పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం జిల్లా నుంచి విదేశాలకు వెళ్లే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్న త విద్యనభ్యసించడానికి అమెరికా, యూకే, ఆస్ర్టేలియా, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల్లో వాహనాలు న డపాలంటే లైసెన్సులు తప్పనిసరి కావడం తో ఇక్కడ అంతర్జాతీయ లైసెన్సు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వరం గల్‌, హనుమకొండ జిల్లాల్లో 3,631 మంది అంతర్జాతీయ లైసెన్సులు పొందారు.


సంవత్సరంపాటు చెల్లుబాటు..

తెలంగాణ రవాణాశాఖ అందజేస్తున్న ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులకు విదేశాల్లో ఏడాదిపాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో వాహనాలు నడిపేందుకు అనుమతిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే అక్కడ నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాల్సి ఉం టుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండ డంతో ఎక్కువ మంది వరంగల్‌ నుంచే ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ను తీసుకుంటున్నారు. దీంతో విదేశాలకు వెళ్లిన వెంటనే వాహనాలు నడిపేందుకు అవకాశం లభిస్తోంది. సంవత్సరం తర్వాత కూడా అక్కడే ఉండాలంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. వరంగల్‌ నుంచి అంతర్జాతీయ లైసెన్సు తీసుకుంటున్నవారిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువగా అమెరికా, బ్రిటన్‌, సింగాపూర్‌, ఆస్ర్టేలియా వంటి దేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. విదేశాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌పైన ఆధారపడేందుకు ఎక్కువగా అవకాశం లేకపోవడం, సొంత వాహనాలను వినియోగించడం తప్పనిసరి కావడంతో ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడే ఇంటర్నేషనల్‌ లైసెన్సును తీసుకుని వెళ్తున్నారు.


ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎలా పొందాలి..

ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే ముందుగా మనదేశంలో లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసేటప్పుడు ఇక్కడ తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు పాస్‌పోర్ట్‌, ఏ దేశానికి వెళ్తున్నారో అందుకు సంబంధించిన వీసాను జతచేయాలి. ఆరోగ్యవంతంగా ఉన్నట్లు మెడికల్‌ ధ్రువీకరణ పత్రం ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడి నుంచి పొందాలి. ఫామ్‌-ఏను జతచేయాలి. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. రూ.1500 ఫీజు ఆన్‌లైన్‌లో లేదా ఈ-సేవా క్రేందాల్లో చెల్లించాలి. అనంతరం సంబంధిత రవాణాశాఖ అధికారిని సంప్రదించాలి. ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌, ఒరిజినల్‌ వీసా, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు, అన్ని జిరాక్స్‌ కాపీలను సమర్పించాలి. పరిశీలించిన అనంతరం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సును జారీ చేస్తారు.

Read more