సరిహద్దులు దాటిన ఫేస్‌బుక్‌ ప్రేమ

ABN , First Publish Date - 2022-08-12T09:56:07+05:30 IST

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన హైదరాబాద్‌కు చెందిన ప్రియుడిని మనువాడేందుకు పాకిస్థాన్‌ యువతి ఊహకందని సాహసం చేసింది.

సరిహద్దులు దాటిన ఫేస్‌బుక్‌ ప్రేమ

  • హైదరాబాద్‌ యువకుడిని పెళ్లాడేందుకు పాక్‌ యువతి విఫలయత్నం
  • అడ్డదారిలో భారత్‌లోకి వచ్చే యత్నం
  • నేపాల్‌ సరిహద్దులో పట్టుబడిన వైనం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన హైదరాబాద్‌కు చెందిన ప్రియుడిని మనువాడేందుకు పాకిస్థాన్‌ యువతి ఊహకందని సాహసం చేసింది. అడ్డదారిలో భారత్‌లో అడుగుపెట్టేందుకు విఫలయత్నం చేసి అధికారులకు పట్టుబడింది. 


పట్టించిన వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌..  

హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన మహ్మద్‌ అహ్మద్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఓ హోటల్లో పని చేస్తున్నారు. అతనికి పాకిస్థాన్‌, పైసలాబాద్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని కలీజా నూర్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రేమగా మారగా.. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని తెలిసి, ఎలాగైనా ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కలీజాను భారత్‌కు వచ్చేయమని అహ్మద్‌ పిలిచాడు. ఇందుకోసం పాక్‌ నుంచి దుబాయ్‌ మీదుగా నేపాల్‌ చేరుకుని అక్కడ నుంచి బిహార్‌ సరిహద్దు ద్వారా భారత్‌కు చేరుకోవాలని కలీజాకు పథకం చెప్పాడు. ఆమెకు సహకరించేందుకు తన సోదరుడు ఉస్మాన్‌తోపాటు నేపాల్‌లోని ఓ స్నేహితుడిని కూడా పంపిస్తానని తెలిపాడు. ఇందుకు అంగీకరించిన కలీజా.. నేపాల్‌ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది.


 తన చెల్లెలితో కలిసి కళాశాలకు వచ్చిన కలీజా ఈ నెల 5న కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. అక్కడ జారీ చేసిన సర్టిఫికెట్‌ను బ్యాగులో పెట్టుకుంది. అనంతరం ఎవరికీ తెలియకుండా నేపాల్‌ బయలుదేరింది. మరోపక్క, అహ్మద్‌ సోదరుడు ఉస్మాన్‌ తన చెల్లెలు అర్ధు బాగ్గియా ఆధార్‌ కార్డులో కలీజా నూర్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేశాడు. అన్న సూచనల మేరకు ఆ నకిలీ ఆధార్‌కార్డుతో నేపాల్‌ చేరుకున్న ఉస్మాన్‌.. అక్కడ జీవన్‌లాల్‌ అనే వ్యక్తిని కలిశాడు. సౌదీలో తన స్నేహితుల ద్వారా అహ్మద్‌.. జీవన్‌ సాయం కోరాడు. పథకం ప్రకారం కాట్మాండులో కలిసిన ఈ ముగ్గురూ బిహార్‌ సీతమ్రాహీ జిల్లా, బెట్టమోర్‌లోని ఔట్‌పోస్టు ద్వారా ఇండో-నేపాల్‌ సరిహద్దు దాటేందుకు యత్నించారు. అయితే, అక్కడి అధికారులు తనిఖీల్లో కలీజా వద్ద నకిలీ ఆధార్‌ కార్డుతోపాటు పాక్‌ పాస్‌పోర్టు గుర్తించారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా కాలేజీ వద్ద తీసుకున్న కొవిడ్‌ సర్టిఫికెట్‌ కూడా దొరికింది. దీంతో కలీజా పాక్‌ యువతి అని నిర్ధారించుకున్నారు. వెంటనే కలీజాతోపాటు ఉస్మాన్‌, జీవన్‌ లాల్‌ను గూఢచర్యం నేరం కింద అదుపులోకి తీసుకున్నారు. 

Read more