‘పోడు’ పోరు

ABN , First Publish Date - 2022-07-18T08:35:26+05:30 IST

‘‘నలభై ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం.. ఈ భూములు మావే’’ అంటూ గిరిజనుల ఆగ్రహం! ‘‘ఆ భూములకు సంబంధించి ఎవరికీ పట్టాలు

‘పోడు’ పోరు

అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను

ధ్వంసం చేసిన రైతులు.. అధికారుల ఘెరావ్‌

నల్లగొండ జిల్లా ఎర్రచెర్వు తండాలో ఘటన


తిరుమలగిరి(సాగర్‌), జూలై 17: ‘‘నలభై ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం.. ఈ భూములు మావే’’ అంటూ గిరిజనుల ఆగ్రహం! ‘‘ఆ భూములకు సంబంధించి ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు’’ అంటూ అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేసిన అటవీ అధికారులు!! ఆగ్రహంతో వారు నాటిన మొక్కలను పీకేసి, అధికారులను ఘెరావ్‌ చేసిన గిరిజనులు! నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని ఎర్రచెర్వుతండాలో ఆదివారం జరిగిన ఘటన ఇది. నెల్లికల్లు ఫారెస్ట్‌ బీట్‌ పరిధి కంపార్ట్‌మెంట్‌ నెంబర్‌ 72లోని సుమారు 40 ఎకరాల్లో ఉన్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు కొద్దిరోజులుగా భూమిని చదును చేయిస్తున్నారు. ఆయా భూముల్లో సాగు చేస్తున్న రైతులు వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం అటవీ శాఖ అధికారులు సుమారు ఐదు ట్రాక్టర్లలో పెద్దసంఖ్యలో మొక్కలను తీసుకొచ్చి నాటేందుకు ప్రయత్నించారు. రెండు ఎకరాల్లో మొక్కలను నాటగానే తండాకు చెందిన 100 మంది రైతులు గుంపులుగా ఆ భూముల వద్దకు చేరుకుని అధికారులు నాటిన మొక్కలను పీకేశారు. ప్లాంటేషన్‌ పనులను అడ్డగిస్తూ ఫారెస్ట్‌ అధికారుల వాహనాలను అడ్డుకున్నారు.


40 సంవత్సరాలుగా ఈ భూముల్లో సేద్యం చేస్తున్నామని, గత ఏడాది నుంచి అటవీశాఖ అధికారులు తమను అడ్డుకుంటూ వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. దీనిపై అధికారులు, రైతుల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఫారెస్ట్‌ అధికారులతో రైతులు ఘర్షణకు సిద్ధం కావడంతో.. అటవీ అధికారులు వెనక్కితగ్గి వెళ్లిపోయారు. కాగా.. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ కట్టే సమయంలో అధికారుల కోసం ఈ భూముల వద్దే డెయిరీ ఏర్పాటు చేశారని.. ఈ భూముల్లో తాము జొన్నలు పండించి, గడ్డిని డెయిరీ పశువుల కోసం ఇచ్చేవారమని బాణావత్‌ బాజు అనే మహిళా రైతు తెలిపారు. అప్పట్లో తమకు పట్టా ఇవ్వకపోవడంతో ఇప్పుడు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఏదేమైనా తాము ఈ భూములను వదులుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. అయితే.. అవన్నీ అటవీ శాఖ పరిధిలోని భూములేనని నల్లగొండ డీఎ్‌ఫవో సర్వేశ్వర్‌ స్పష్టం చేశారు. ఆ భూములకు సంబంధించి ఎవరికీ ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలు అందజేయలేదని.. రైతులు నిబంధనలను అతిక్రమించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అటవీ అధికారులపై దాడులు చేస్తే ఊరుకునేదిలేదని.. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-07-18T08:35:26+05:30 IST