యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు

ABN , First Publish Date - 2022-10-07T07:39:25+05:30 IST

తెలంగాణ జెన్‌కోకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ షాకిచ్చింది.

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు

  • యంత్రాలు బిగించవద్దు.. నిర్మాణ పనులే చేపట్టాలి
  • 9 నెలల్లోగా మళ్లీ అనుమతులు తీసుకోవాలి
  • జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సంచలన తీర్పు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్‌కోకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ షాకిచ్చింది. అప్పులపై కేంద్ర విద్యుత్తు రుణ సంస్థల కొర్రీల నుంచి ఇటీవలే బయటపడిన జెన్‌కోపై ఎన్జీటీ తాజాగా బాంబు వేసింది. యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ ఎన్జీటీ దక్షిణ జోన్‌ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 9 నెలల్లోగా బహిరంగ విచారణలు చేపట్టి, మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి పర్యావరణ అనుమతులు తీసుకునేదాకా విద్యుదుత్పాదన జరగడానికి వీల్లేదని, యంత్రా లు బిగించరాదని జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, డాక్టర్‌ కోర్లపాటి సత్యగోపాల్‌ నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు ఇచ్చిం ది. సివిల్‌ (నిర్మాణ) పనులు మాత్రమే చేసుకోవాలని స్పష్టం చేసింది. యాదాద్రి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కన్జర్వేషన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ట్రస్ట్‌, సమతా (విశాఖపట్నం) ఎన్జీటీలో కేసు దాఖలు చేసి.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలతో పాటు తెలంగాణ పర్యావరణ, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వి భాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ స్టేట్‌ పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌పై విచారించిన బెంచ్‌.. జూలై 22న తీర్పును రిజర్వ్‌ చేసి, సెప్టెంబరు 30న వెలువరించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. 


అటవీ భూములు థర్మల్‌ కేంద్రాలకు వద్దు

అటవీ భూములను అటవీయేతర అవసరాలకు మార్చుతున్నప్పుడు రెడ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమ (థర్మల్‌ కేంద్రాలు)లకు కేటాయించడం తగదని ఎన్జీటీ బెంచ్‌ సూచించింది. ఇక ముందు కూడా థర్మల్‌ కేం ద్రాలకు అటవీ భూములను కేటాయించరాదని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో ఒకచోట 14.03 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ఉందని చెప్పారని, కచ్చితంగా ఎంత దూరంలో ఉందో అటవీ ముఖ్య సంరక్షణ అధికారి/ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాదాద్రికి తదుపరి పర్యావరణ అనుమతి తీసుకోవడానికి 9 నెలల గడువు ఇచ్చింది. ఆలోగా అభయారణ్యాల రక్షణ చట్టం-1972ను అనుసరించి.. జాతీ య అభయారణ్యాల మండలి నుంచి తగిన అనుమతి తీసుకోవాలని బెంచ్‌ నిర్దేశించింది. ఆ తర్వాత పర్యావరణ అనుమతి తీసుకోవడానికి వీలుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) తా జాగా జారీ చేయాలని సూచించింది.


 దాన్ని అనుసరిం చి.. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఏఐ) రూపొందించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అందులో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అనుమతి తీసుకునే సమయంలో విద్యుదుత్పాదన కోసం విదేశాల నుంచి వచ్చే బొగ్గును కూడా కలిపి మండిస్తామని చెప్పి.. తాజాగా సింగరేణి నుంచి కోల్‌ లింకేజీ తీసుకొని, 100 శాతం ఆ బొగ్గునే మండించాలని నిర్ణయం తీసుకోవడాన్ని బెంచ్‌ తప్పుపట్టింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం కచ్చితంగా ఎంత దూరంలో ఉందో నివేదిక తయారు చేయడంతో పాటు దేశీయ బొగ్గు వాడడం వల్ల కాలుష్యం ఏ మేర కు వెలువడనుంది..? దాని ప్రభావం ఎంత? వంటి అంశాల ఆధారంగా, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 


యాదాద్రికి పర్యావరణ గండం

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మాణ ప్రతిపాదనల నుంచే వివాదాలు ఉన్నాయి. దీని నిర్మాణం 2800 ఎకరాల్లో చేపడుతుండగా.. 2095 ఎకరాల అటవీ భూ మిని మార్పిడి చేశారు. ఇక పర్యావరణ అనుమతి తీసుకునే ప్రక్రియలో పారదర్శకత లేదని ఆది నుంచీ విమర్శలున్నాయి. యాదాద్రి, భద్రాద్రి రెండు థర్మల్‌ ప్లాంట్‌లపైనా విమర్శలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో జెన్‌కో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో సూపర్‌క్రిటికల్‌ టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను నిర్మిస్తుండగా.. అనుమతి తీసుకునే సమయంలో విదేశీ బొగ్గును కలిపి మండిస్తామని చెప్పింది. దీని ధర భారీగా ఉండడం.. కోల్‌ బ్లాక్‌లకు దూరంగా ఉండడంతో విద్యుదుత్పాదనకయ్యే వ్యయం భారీగా ఉంటుందని సింగరేణి నుంచి కోల్‌ లింకేజీ తీసుకున్నారు. ఇప్పుడిదే ఈ ప్లాంట్‌కు గం డంగా మారింది. ప్లాంట్‌ నిర్మాణ సమయంలో రూ. 25099 కోట్ల అంచనాలతో పనులు చేపట్టగా.. అందు లో పర్యావరణ పరిరక్షణకే రూ.5597 కోట్లను వెచ్చించనున్నట్లు జెన్‌కో గుర్తు చేసింది. తాజాగా అంచనా వ్యయం రూ.29965 కోట్లకు చేరింది. ఇప్పటిదాకా 55 శాతం పనులు మాత్రమే జరగ్గా.. రూ.16 వేల కోట్ల దాకా వెచ్చించారు.  గండాలన్నీ దాటుతున్న క్రమంలో తాజాగా ఎన్జీటీ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Updated Date - 2022-10-07T07:39:25+05:30 IST