ఎన్‌ఐఏ అధికారినంటూ దందాలు
ABN , First Publish Date - 2022-10-18T04:56:13+05:30 IST
ఎన్‌ఐఏ అధికారినంటూ దందాలు
మరో ఇద్దరితో కలిసి వసూళ్లు
ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన కేయూ పోలీసులు
ఆర్మీ యూనిఫామ్, ఎయిర్ పిస్టల్ స్వాధీనం
హనుమకొండ క్రైం, అక్టోబరు 17: ఎన్‌ఐఏ అధికారినంటూ రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఒక ఎయిర్ పిస్టల్, నకిలీ గుర్తింపు కార్డు, ఒక ల్యాప్‌ట్యాప్, రెండు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ సీపీ తరుణ్‌జోషి అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు.
నల్గొండ జిల్లా ఆదిసర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి చదువు మధ్యలో ఆపేశాడు. తర్వాత దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. తాగుడుకు, జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఎయిర్ పిస్టల్, ఆర్మీ దుస్తులు కొనుగోలు చేసి ఆర్మీలో పని చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నాడు. తనకు ఆర్మీలో పెద్ద అధికారులతో పరిచయం ఉందని.. నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మ బలికాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడు. శిక్షణ పేరుతో మహరాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో వైష్ణవి కెరీర్ ఫౌండేషన్‌లో వారిని చేర్పించాడు. కొద్ది రోజుల తర్వాత డబ్బులు ఇచ్చిన వారు నరేష్ మోసం చేశాడని గుర్తించారు. అతడి తల్లిదండ్రులను నిలదీయంతో డబ్బులు తిరిగి ఇచ్చాడు.
ఇంకా సులభంగా డబ్బులు సంపాదించాలని ఎన్‌ఐఏ అధికారి అవతారమెత్తాడు. అతడి అడ్డాను వరంగల్‌కు మార్చాడు. హనుమకొండకు చెందిన ఇద్దరు యువకులు నేపట్ల రాజేశ్, వినయ్‌బాబులను పరిచయం చేసుకున్నాడు. వారితో కలిసి దందాలు చేయసాగాడు. ఎన్‌ఐఏ అధికారులమంటూ నకిలీ పిస్టల్ చూపి స్తూ పలువురిని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో గాలించారు. నరేష్ సోమవారం హనుమకొండకు వస్తున్నట్టు సమాచారం అందడంతో కేయూ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. నరే్‌షను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అతడికి సహకరించిన మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. నరేష్ నుంచి ఎయిర్ పిస్టల్, ఆర్మీ దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జగిత్యాల జిల్లాలో కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా, నరేష్ అరెస్టుకు సహకరించిన సెంట్రల్‌జోన్ డీసీపీ అశోక్‌కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, కేయూ సీఐ దయాకర్‌లను సీపీ అభినందించారు
