దాడులు చేస్తే భయపడం

ABN , First Publish Date - 2022-08-16T09:22:59+05:30 IST

దాడులు చేస్తే బీజేపీ భయపడదని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు.

దాడులు చేస్తే భయపడం

తెలంగాణలో అరాచక పాలన.. 1947కు ముందు పరిస్థితులే ఇప్పుడు

భద్రత ఇవ్వడంలో సీపీ విఫలం: సంజయ్‌

దేవరుప్పుల, ఆగస్టు 15: దాడులు చేస్తే బీజేపీ భయపడదని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం జనగామ జిల్లా దేవరుప్పులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను చూస్తే విసునూర్‌ రామ చంద్రారెడ్డి, కేటీఆర్‌ను చూస్తే బాబుదొర గుర్తుకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 1947కు ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కేసీఆర్‌ దోచుకుపోతున్నాడని విమర్శించారు. మాయ మాటలతో మోసం చేసి పేదల బతుకులు నాశనం చేశాడని దుయ్యబట్టారు. కాగా, దేవరుప్పులలో ఘర్షణ జరిగిన వెంటనే బండి సంజయ్‌ డీజీపీకి ఫోన్‌ చేశారు. స్థానిక సీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నా, భద్రత కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని డీజీపీ ఆఫీసుకు వస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి బండి సంజయ్‌ ఫోన్‌ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


కుటుంబ పాలనకు పాతర: కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ ప్రభుత్వం ఉండేది ఇంకా ఆరు ఏడు నెలలేనని, తర్వాత ఆ పార్టీ, ప్రభుత్వం ఉండవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారని పేర్కొన్నారు. బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని ఖండించారు. కిషన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ దాడిని టీఆర్‌ఎస్‌ మంత్రి సమర్థించుకోవడం దారుణమని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ దాడులు పిరికిపంద చర్య అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. దాడికి బాధ్యులయిన మంత్రి ఎర్రబెల్లిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అసహనంతోనే టీఆర్‌ఎస్‌ దాడులు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌ ఆరోపించారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు పిచ్చి పిచ్చివేషాలు వేస్తే రాష్ట్రం రణరంగమవుతుందని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి హెచ్చరించారు. 


పాదయాత్రకు నేటితో వెయ్యి కి.మీ పూర్తి

బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం వెయ్యి కి.మీ పూర్తి చేసుకోనుంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా క్రాస్‌ రోడ్‌ సమీపంలో పాదయాత్ర ఈ మైలు రాయిని చేరుకోబోతోంది. అయితే సంజయ్‌ అక్కడికి వచ్చేసరికి బాగా పొద్దు పోయే అవకాశం ఉండటంతో బుధవారం ఉదయం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 

Read more