Bathukamma sarees: కోటి బతుకమ్మ చీరలు పంపిణీ

ABN , First Publish Date - 2022-09-21T21:38:00+05:30 IST

రేపటి నుంచి బతుకమ్మ చీరలు (Bathukamma sarees) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.

Bathukamma sarees: కోటి బతుకమ్మ చీరలు పంపిణీ

హైదరాబాద్: రేపటి నుంచి బతుకమ్మ చీరలు (Bathukamma sarees) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలు రూపొందించారని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. బతుకమ్మ చీరల ప్రాజెక్ట్ కోసం రూ.339.73 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. బతుకమ్మ చీరల ప్రాజెక్ట్తో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపామని కేటీఆర్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ఆడపడుచుల్లో సంబరాన్ని నింపుతుంది. పేద, ధనిక తేడా లేకుండా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారు. తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెగా అందిస్తోంది. ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలకు ముందుగానే చీరలను అందించాలని అధికారులు నిర్ణయించారు. రేపు (గురువారం) నుంచి నుంచి చీరల పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులై, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందించనున్నారు.


సిరిసిల్లకు బ్రాండ్‌ ఇమేజ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district) వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరలు బ్రాండ్‌ ఇమేజ్‌గా మారాయి. బతుకమ్మ చీరల లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నేత కార్మికులు విజయవంతంగా ముందుకు సాగారు. ఈ సారి మరింత కొత్తదనం కోసం జకార్డ్‌లను ఉపయోగించి బూటా, ఇతర డిజైన్లతో కోటి చీరలు ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని తొలగించే దిశగా ఏటా  బతుకమ్మ చీరల ఆర్డర్లను అందిస్తున్నారు. 2017లో రూ.220 కోట్లతో మొదలైన చీరల ఉత్పత్తి బడ్జెట్‌ పెరుగుతూ వస్తోంది. 2018లో రూ.280 కోట్లు, 2019లో రూ.313.కోట్లు, 2020లో రూ.317.18 కోట్లు ఖర్చు చేశారు. ఈ సారి రూ.339.73 కోట్లతో విభిన్న డిజైన్లలో చీరలు తయారీ చేయించారు. కోటి చీరల్లో 90 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవుతో యువతులు, మహిళలు కట్టుకునే విధంగా, మరో 10 లక్షల చీరలు 9 మీటర్లతో వృద్ధుల కోసం ప్రత్యేకించి తయారు చేస్తున్నారు. 15 వేల మరమగ్గాల్లో ఈ చీరలను కార్మికులు నేశారు. మొత్తం 30 వేల మంది కార్మికులు బతుకమ్మ చీరల కోసం శ్రమించారు.

Updated Date - 2022-09-21T21:38:00+05:30 IST