ఇక మునుగోడులో అభివృద్ధి పరుగులు

ABN , First Publish Date - 2022-11-08T01:15:53+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే భారతదేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానం లభించినట్లు అవుతుందని ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు.

ఇక మునుగోడులో అభివృద్ధి పరుగులు

దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌

రోడ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మోక్షం

వారం రోజుల్లో నలుగురు మంత్రులు మునుగోడులో సమీక్షలు

నల్లగొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే భారతదేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానం లభించినట్లు అవుతుందని ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో గెలుపొందడంతో సీఎం కేసీఆర్‌ మునుగోడు అభివృద్ధిపై దృష్టి సారించారు. గత నెల 30వ తేదీన చండూరు బహిరంగ సభలో చెప్పినట్లు టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే 15 రోజుల్లో చండూరును రెవెన్యూ డివిజన్‌ చేయడంతో పాటు రోడ్లను అద్దంలా మారుస్తానన్నారు. దీనికి తోడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సైతం మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ప్రభాకర్‌రెడ్డి విజయంతో ఇక మునుగోడు నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది.

వారంలో నలుగురు మంత్రులు మునుగోడుకు రాక

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలవడంతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుం టకండ్ల జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధుల ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం ముఖ్యనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారం రోజుల్లో మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ మునుగోడులో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకా రం చుట్టాలని ఆదేశించారు. ఈ వారంలో నలుగురు మంత్రులు ఎమ్మెల్యే కూసుకుం ట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మునుగోడుకు కావాల్సిన అభివృద్ధి పనులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, సంక్షేమపథకాలపై సమీక్షించనున్నారు. 2023లో వచ్చే సాధారణ ఎన్నికలు లేదంటే ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎదురులేని విధంగా మునుగోడును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంతో పాటు నకిరేకల్‌ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును, మునుగోడు నియోజకవర్గంలోని డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హామీ మేరకు మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాయకులతో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ 2004లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 3వేల ఓట్లు వస్తే 2018లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 73,500ఓట్లు, 2022లో తాజాగా జరిగిన ఉపఎన్నికలో 97వేలకు పైగా ఓట్లు రావడంపై ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో పెద్దఎత్తున ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చినందున ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం కోసం సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారు.

Updated Date - 2022-11-08T01:15:57+05:30 IST