Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు సెల్‌ ఫోన్ల ధ్వంసమేల?

ABN , First Publish Date - 2022-12-12T03:16:52+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుదీర్ఘంగా విచారించింది.

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు సెల్‌ ఫోన్ల ధ్వంసమేల?

అమిత్‌ అరోరా మీకు ఎలా తెలుసు?

వాంగ్మూలంలో మీ పేరు ఎందుకు చెప్పారు?

శరత్‌ చంద్రారెడ్డి ఎలా పరిచయం?.. సౌత్‌గ్రూప్‌ ఏంటి?

ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ సీబీఐ బృందం ప్రశ్నల వర్షం

40-50 ప్రశ్నలు.. నాలుగైదింటికే జవాబులిచ్చిన కవిత

హైదరాబాద్‌-ఢిల్లీ ప్రయాణ చరిత్ర ఇవ్వాలని నిర్దేశం

ఏడున్నర గంటల విచారణ.. సీఆర్పీసీ 91 కింద నోటీసు

మరోసారి విచారిస్తామని కవితకు స్పష్టం చేసిన సీబీఐ

విచారణ అనంతరం ప్రగతి భవన్‌కు కవిత.. సీఎంతో భేటీ

ఆమె ఇంటివద్ద బారికేడ్లతో దారులు బంద్‌.. బందోబస్తు

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. తొలుత సీబీఐ గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంది. అక్కడి నుంచి రెండు వాహనాల్లో సరిగ్గా ఉదయం 10.50 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-14లోని కవిత గృహానికి చేరుకుంది. కవిత ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 వరకు.. సుమారు ఏడున్నర గంటలపాటు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. కవితకు సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన నోటీసు మేరకు.. ఈ స్కామ్‌లో సాక్షిగానే ఆమెను విచారిస్తున్నట్లు తెలిపిన డీఐజీ.. తొలుత తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె న్యాయవాది సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపించారు. 40-50 ప్రశ్నలకు గాను.. కవితనాలుగైదింటికే సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఎక్కువ శాతం ప్రశ్నలకు ‘తెలియదు’ అనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

ఆధారాలను ముందు పెట్టి..

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టును సమర్పించిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో ఎక్కువ శాతం ఆ రిమాండ్‌ రిపోర్టు చుట్టే తిరిగినట్లు తెలిసింది. ఈ కేసులో కవిత 10కి పైగా ఫోన్లను వినియోగించిన నేపథ్యంలో.. అన్ని ఫోన్లను ఎందుకు వాడారు? ఆ తర్వాత వాటిని ఎందుకు ధ్వంసం చేశారు? అని ప్రశ్నించినట్లు సమాచారం. అమిత్‌ అరోరా తెలుసా? దినేశ్‌ అరోరాతో మాట్లాడారా? శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా పరిచయం? అంటూ వరుస ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత.. కవిత సెల్‌ఫోన్‌ కాల్‌డేటా రికార్డులను ముందు పెట్టి.. ఏయే రోజు.. ఏయే సమయంలో ఎవరెవరితో మాట్లాడారనే ఆధారాలను చూపిస్తూ అవే ప్రశ్నలను రిపీట్‌ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా, అమిత్‌ అరోరా, విజయ్‌నాయర్‌తో ఫోన్‌లో మాట్లాడారని పేర్కొంటూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ జరిగిన సమయంలోనే ఈ ఫోన్‌కాల్స్‌ వెళ్లాయని గుర్తుచేసినట్లు సమాచారం.

ఆ తర్వాతే శరత్‌ చంద్రారెడ్డికి ఢిల్లీలోని అత్యధిక రిటైల్‌ జోన్ల లైసెన్సులు దక్కాయని పేర్కొంటూ అందుకు అనుబంధంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. సౌత్‌గ్రూ్‌పను ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి? అందులో కవిత పాత్ర ఏమిటి? అనే కోణాల్లో ప్రశ్నించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తొలుత తాము సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి, కొన్ని డాక్యుమెంట్లు, కాల్‌లిస్ట్‌ ఆధారంగా, తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అమిత్‌ అరోరాకు రూ. 100 కోట్ల మేర ముడుపులు అందడం.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణాలు, ముఖ్యంగా చార్టర్డ్‌ విమానాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. నిజానికి ఈ నెల 6న కవితను సీబీఐ విచారించాల్సి ఉండగా.. ఆమె తనకు ఆ రోజు షెడ్యూల్డ్‌ పనులు ఉన్నాయని, 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు సిద్ధమని పేర్కొంటూ లేఖ రాశారు. దీంతో సీబీఐ ఆమెను ఆదివారం విచారించింది.

సీఆర్పీసీ 91 కింద మరో నోటీసు

కవిత విచారణ పూర్తయ్యాక అధికారులు ఆమెకు మరోమారు నోటీసు అందజేశారు. సీఆర్పీసీలోని సెక్షన్‌ 91 ప్రకారం తమకు కావాల్సిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. ‘‘ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ జరిగిన సమయంలో.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లివచ్చిన వివరాలు(ట్రావెల్‌ హిస్టరీ) సమర్పించండి. విమాన ప్రయాణాలు.. చార్టెడ్‌ ఫ్లైట్స్‌ని వాడితే ఆ వివరాలు అందజేయండి’’ అని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే.. సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ద్వారా ఆ వివరాలను సేకరించినట్లు తెలిసింది. కవిత అందించే వివరాలను, తాము సేకరించిన ఆధారాలను బేరీజు వేస్తూ.. మరోమారు కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఆదివారం నాటి విచారణ ముగిశాక సీబీఐ అధికారులు ‘‘అవసరమైతే మరోమారు విచారిస్తాం’’ అని పేర్కొన్నారు.

పొలిటికల్‌ హీట్‌..!

అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది మొదలు.. ఆమెకు సీబీఐ నోటీసులు.. ఆదివారం నాటి విచారణతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. కవిత కూడా తొలుత సీబీఐ నోటీసులకు ఘాటుగా స్పందించారు. అరెస్టు చేసినా భయపడేది లేదని తెగేసిచెప్పారు. ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వరుసగా బీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాను విచారణకు హాజరవ్వాలంటే.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందజేయాలని సీబీఐని డిమాండ్‌ చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించారు.

వెంటనే ప్రగతి భవన్‌కు కవిత

సీబీఐ విచారణ ముగియగానే కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఉన్నారు. ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన కవిత.. సీబీఐ విచారణ వివరాలను ఆయనకు తెలియజేశారు. అంతకు ముందు సీబీఐ విచారణ ముగియగానే ప్రెస్‌నోట్‌ ఇస్తానంటూ చెప్పిన కవిత.. ఆ తర్వాత అందుకు కొంత సమయం పడుతుందంటూ మీడియాకు సమాచారం అందించారు.

కవిత ఇంటి వద్ద భారీ భద్రత

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటివద్ద బంజారాహిల్స్‌ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆమె అభిమానులు పెద్దఎత్తున తరలివస్తుండడంతో.. సీబీఐ విచారణకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్యకర్తలు, వారి ముసుగులో బయటి వ్యక్తులు సీబీఐని అడ్డుకునే ప్రమాదముందనే సమాచారంతో కవిత ఇంటికి దారితీసే మూడు రోడ్లను బారీకేడ్లతో మూసివేశారు. అటు కవిత, బీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా అభిమానులెవ్వరూ రాకూడదంటూ పదేపదే విజ్ఞప్తి చేయడంతో.. విచారణ జరుగుతున్నంతసేపు ఎవరూ అక్కడికి రాలేదు. సీబీఐ విచారణ ముగియగానే.. పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకున్నారు.

Updated Date - 2022-12-12T04:52:11+05:30 IST

Read more