దసరాకు గుడుంబా కిక్కు..!

ABN , First Publish Date - 2022-09-28T05:31:45+05:30 IST

దసరాకు గుడుంబా కిక్కు..!

దసరాకు గుడుంబా కిక్కు..!
గిరిపురం-మరిపెడ రూట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన నల్లబెల్లం లారీ (ఫైల్‌)

భారీగా నల్లబెల్లం దిగుమతి..?

దందాకు అడ్డాలుగా తండాలు 

జిల్లా వ్యాప్తంగా సరఫరా.. ప్రభుత్వ సంకల్పానికి తూట్లు


మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు) సెప్టెంబరు 27:  దసరాకు గుడుంబా కిక్కెక్కనుంది. గిరిజన తండాలు కేంద్రంగా భారీగా నల్లబెల్లం డంపు చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం నల్లబెల్లం దందాకు అడ్డాగా మారి జిల్లావ్యాప్తంగా పటిక, నల్లబెల్లాన్ని గుడుంబా తయారీదారులకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నప్పటికీ నియంత్రించడంలో జిల్లా అధికారయంత్రాంగం చొరవ చూపకుండా అంతా ’మాములే’నని చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరిపెడ మండలం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాకు సరిహద్దున ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు నుంచి నేరుగా పెద్ద టర్బో లారీల్లో నల్ల బెల్లం, పటిక ఇక్కడికి భారీగా దిగుమతి అవుతుంది.  ఇక్కడి నుంచి జిల్లాలోని ఏజెన్సీ మండలాలు బయ్యారం, కొత్తగూడ, గంగారం, గూడూరులతో పాటు పొరుగున ఉన్న నర్సింహులపేట, చిన్నగూడూరు, కురవి, డోర్నకల్‌, నెల్లికుదురు, మహబూబాబాద్‌ మండలాల్లోని పలు గిరిజన తండాలకు గుడుంబా తయారీకి అవసరమైన ముడిసరుకులతో పాటు నల్లబెల్లం అక్రమంగా రవాణా అవుతోంది. 


బెల్లం దందాకు కేరాఫ్‌ మరిపెడ..

బెల్లం దందాకు మరిపెడ మండలం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. మండలంలోని మాకులతండా, ఆనేపురం తండాలు, తానంచర్లలోని ధరావత్‌తండా, ఆర్లగడ్డతండా, వీరారంలోని బాల్యతండా, ఉల్లెపల్లి మాలోత్‌తండా, బాబోజిగూడెంలోని పలు తండాలు, మరిపెడ మున్సిపల్‌ సీతారాంపురం, గోపాలపురం, గిరిపురం ఇటుకలపాడుతండా, ఊకల్‌రేఖ్యతండా, చిన్నగూడూరు మండలందూమ్డతండా, బాబోజితండా, చిన్నతండా, మంగోరిగూడెం తండాలను దళారి కేంద్రాలుగా చేసుకొని బెల్లం లారీలు అడ్డాలకు చేరగానే క్షణాల్లోనే దిగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి బోలేరా, టాటా ఏస్‌, ఇతర వాహనాలతో జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.


అంతా ‘మాములే’..

 కొంత కాలంగా తండాలు కేంద్రంగా బెల్లం దందాకు ఫుల్‌స్టాఫ్‌ లేకుండా సాగుతున్నా అంతా ‘మాములే’నని ప్రజలు భావిస్తున్నారు. అసలు దొంగలను వదిలి బినామీలపై కేసులు పెట్టి చేతులు దులుపేసుకుంటున్నారని అధికారులపై బహిరంగ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు గిరిపురం-మరిపెడ  రహదారుల్లో  ఓ టర్బో లారీ, మహబూబాబాద్‌ రహదారిలో  స్థానిక పోలీసులకు మరో టర్బో లారీ, ఎక్సైజ్‌ పోలీసులకు ఓ డీసీఎం బెల్లం తరలిస్తూ పట్టుపడ్డాయి. దీంతో బెల్లం దందా తెరపైకి వచ్చింది.


 ఏరులై పారనున్న గుడుంబా

దసరాకు ఈ సారి ఊరూరా, తండాతండాల్లో గుడుంబా కిక్కే... గుడుంబా తయారీదారులు నాటు సారా తయారీ కోసం తమ ఇళ్లల్లో బెల్లం, ముడిసరుకు అంతా సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని చోట్ల గుడుంబా ఘాటు గుప్పుమంటోంది. గుడుంబా బారిన పడి అనేక కుటుంబాలు చిధ్రమైన సంఘటనలు కూడా ఈ జిల్లాలో కోకొల్లలుగా మిగిలే ఉన్నాయి.


పట్టుబడితే పీడీ యాక్టు : కిరణ్‌నాయక్‌,జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 

నల్ల బెల్లం, పటిక, గుడుంబాతో పట్టుబడితే అందుకు బాధ్యులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. ఎక్సైజ్‌, పోలీసులు సమన్వయంతో నిషేధిత వస్తువుల నిర్మూలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. జిల్లాలోని తొర్రూరు, గూడూరు, మహబూబాబాద్‌ సర్కిల్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఐదుగురిపై ఇప్పటికే ఈ ఏడాది పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశాం. బైండోవర్‌ ఉల్లంఘన కింద 32 మంది నిందితుల నుంచి రూ.30 లక్షల పెనాల్టీ వసూలు చేశాం. 22 మందిని ఖమ్మం జైలుకు తరలించాం. ఏప్రిల్‌ మాసం నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా  సుమారు 1700 మందిపై  కేసులు పెట్టి బైండోవర్‌ చేశాం. గుడుంబా కాచినా.. నల్లబెల్లం, పటిక విక్రయిస్తున్న వారి సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. మరిపెడకు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ మంజూరు కోసం అధికారులకు సైతం విన్నవించాం. 

Read more