ఎమ్మెల్యేల అనుయాయులకే దళిత బంధు

ABN , First Publish Date - 2022-09-26T09:01:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యేల అనుయాయులకే దళిత బంధు

  • 11 నుంచి ఆందోళనలు.. 28న హైదరాబాద్‌లో మహాధర్నా 
  • టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి

ఆలేరు, సెప్టెంబరు 25: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళితబంధులో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30 వరకు రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. అలాగే, అక్టోబరు 11, 12 తేదీల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 17, 18 తేదీల్లో కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేపట్టాలని ఆయన ఎమ్మార్పీఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్టోబరు 28న లక్ష మందితో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


దళితబంధు పథకం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే వాళ్లకే అందుతుందని, అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల చేతిలో ఈ పథకం ఉండడం వల్ల రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు చెల్లించిన వారికే లబ్ధి చేకూరుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఈ పథకానికి తాము వ్యతిరేకులం కాదని, అర్హులైన నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి పథకాన్ని సమర్ధంగా అమలు చేసే కార్యాచరణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు. అనంతరం ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు. 

Read more