దళితబంధు మూడు నెలల ముచ్చటగానే మిగిలింది: విజయశాంతి

ABN , First Publish Date - 2022-09-26T02:01:25+05:30 IST

సీఎం కేసీఆర్ ఎన్నికల స్టంట్‌గా మొదలుపెట్టిన దళితబంధు మూడు నెలల ముచ్చటగానే మిగిలిందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు

దళితబంధు మూడు నెలల ముచ్చటగానే మిగిలింది: విజయశాంతి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎన్నికల స్టంట్‌గా మొదలుపెట్టిన దళితబంధు మూడు నెలల ముచ్చటగానే మిగిలిందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ‘‘హుజూరాబాద్ ​ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన ఈ స్కీం అర్హులందరికీ అందేలా లేదు. ఇంతకుముందు అన్ని నియోజకవర్గాల్లో 1500 మంది చొప్పున ఈ స్కీం వర్తింపజేస్తామని చెప్పిన సర్కారు... ఇప్పుడు డబ్బులు లేవంటూ 500 మందికే కుదించింది. దీంతో ఒక్కో నియోజకవర్గంలో వందకు పైగా గ్రామాలుండగా ఊరికి ఒకరిద్దరికి మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఇందులోనూ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడం, వారు అధికార పార్టీ లీడర్లు, కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడంతో ఆ రెండు, మూడు కూడా అర్హులకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దళిత బంధు స్కీం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వారు తమకి ఇష్టమైన వారికే యూనిట్లు అందిస్తున్నరు. ఏం కేసీఆర్... ఇలాగేనా ఒక పథకాన్ని అమలు చేసే పద్ధతి? దళితుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్‌కి దళిత సోదరులు కచ్చితంగా తగిన జవాబిస్తారు’’ అని విజయశాంతి ఫేస్‌బుక్‌లో హెచ్చరించారు. 

Read more