హామీల అమలులో కేసీఆర్‌ విఫలం

ABN , First Publish Date - 2022-05-19T05:08:57+05:30 IST

హామీల అమలులో కేసీఆర్‌ విఫలం

హామీల అమలులో కేసీఆర్‌ విఫలం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బినోయ్‌ విశ్వం

ఓరుగల్లు నుంచి మరో భూ పోరాటానికి నాంది

సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినోయ్‌ విశ్వం

సుబేదారి, మే 18: హామీల అమలులో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినోయ్‌ విశ్వం అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంనక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వం మాట్లాడారు. ఓరుగల్లు నుంచి మరో భూ పోరాటానికి సీపీఐ నాంది పలుకుతోందన్నారు. దేశంలో భూ సమస్య ప్రధానమైందని, స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అవుతున్నా నేటికీ పేదలకు భూమి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశంలో నేటికి కోట్ల మంది ప్రజలకు నివాస స్థలాలు లేవని, దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్‌లు పెట్టి పేదల ఇళ్లు కూల్చివేస్తున్న పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. వాటిని అమలు చేయడం లేదన్నారు. భూ పోరాటాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. వరంగల్‌ నగరంలో అనేక చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల అండతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెలరేగిపోతున్నారని, ఈ భూముల్లో జెండాలు పాతి పేదలకు పంచుతామని విశ్వం హెచ్చరించారు. 

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివా్‌సరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, వరంగల్‌, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె భిక్షపతి, జిల్లా నాయకులు, షేక్‌ బాషుమియా, పనాస ప్రసాద్‌, పంజాల రమేష్‌, ఆదరి శ్రీనివాస్‌, ఉట్కూరి రాములు, సీపీఐ నాయకులు, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Read more