శవం మాయం.. పొలమే సాక్ష్యం!

ABN , First Publish Date - 2022-09-21T08:01:00+05:30 IST

అడవి జంతువుల నుంచి రక్షణ కోసం తన పొలం చుట్టూ అక్రమంగా విద్యుత్‌ తీగ వేసుకున్నాడు ఓ రైతు.

శవం మాయం.. పొలమే సాక్ష్యం!

అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగ తగిలి కామారెడ్డిలో రైతు మృతి

నాగిరెడ్డిపేట/మామడ, సెప్టెంబరు 20: అడవి జంతువుల నుంచి రక్షణ కోసం తన పొలం చుట్టూ అక్రమంగా విద్యుత్‌ తీగ వేసుకున్నాడు ఓ రైతు. అతడు ఆ గ్రామ ఎంపీటీసీ కూడా. ఆ కరెంటు తీగ తగిలి పక్క పొలం రైతు చనిపోయాడు. తను ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ వల్లే రైతు చనిపోయాడన్న విషయం బయటకు పొక్కకుండా సదరు ఎంపీటీసీ ఆ రైతు మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాడు. కుటుంబసభ్యుల సాయంతో దూరంగా తీసుకెళ్లి నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో పడేశాడు. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం పెద్ద ఆత్మకూర్‌  గ్రామానికి చెందిన కుమ్మరి నల్లపోశెట్టి(43), ఆ గ్రామ ఎంపీటీసీ మోతె శ్రీనివాస్‌ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. అడవి జంతువులు రాకుండా మోతె శ్రీనివాస్‌ తన పొలం చుట్టూ విద్యుత్తు తీగను అమర్చాడు. ఇది తెలియని నల్లపోశెట్టి సోమవారం తెల్లవారుఝామున 4 గంటలకు తన పొలానికి వెళ్లాడు. గట్టుపై నడుస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ తీగ తగిలి షాక్‌తో నల్లపోశెట్టి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. కొద్ది సేపటి తర్వాత పొలానికి వెళ్లిన శ్రీనివాస్‌ పోశెట్టి మృతదేహాన్ని చూశాడు. విషయం బయటకు పొక్కకుండా రైతు మృతదేహాన్ని నిజాం సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో పడేశాడు. సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. పొలం దగ్గర పోశెట్టి చెప్పులు ఉండడం, ఎంపీటీసీ ఊరు వదిలిపోవడంతో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం పోశెట్టి మృత దేహం తేలింది. శ్రీనివాస్‌ లొంగిపోయాడు.

Read more