తుది దశకు తీగల వంతెన
ABN , First Publish Date - 2022-06-06T08:24:12+05:30 IST
కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తీగల వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తి..
రెండు నెలల్లో ప్రారంభించేందుకు కసరత్తులు
దక్షిణ భారతంలోనే అతి పెద్ద తీగల వారధి
తొలిసారి ఈ తరహా బ్రిడ్జి కట్టిన ఆర్‌అండ్‌బీ
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తీగల వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు అధికారులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే వంతెనపై లోడ్ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. మరోవైపు ఈ వారధిని అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులను సైతం వేగంగా పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ నిర్మిస్తున్న తొలి కేబుల్ బ్రిడ్జ్ ఇదే కావడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెయ్యి టన్నుల సామర్థ్యం ఉన్న ఈ బ్రిడ్జిపై ఎంతటి బరువైన వాహనాలైనా సులువుగా వెళ్లేలా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించేలా ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈ వంతెన నిర్మాణంలో ఓ ప్రత్యేకత. హైదరాబాద్‌లో దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెన కంటే ముందే దీని నిర్మాణ పనులు ప్రారంభమైనా, వివిధ కారణాల వల్ల పూర్తికావడంలో ఆలస్యమైంది. కరీంనగర్-సదాశివపల్లి మధ్య ఉన్న మానేరు నదిపై రూ.149 కోట్లతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
ఎల్‌ఎండీ వద్ద కొనసాగుతున్న ఈ నిర్మాణం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ వంతెన పూర్తయితే కరీంనగర్-వరంగల్ మధ్య 7 కి.మీ దూరం తగ్గనుంది.ఈ బ్రిడ్జి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలిచి, రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు టూరిజం హబ్‌గా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేబుల్ బ్రిడ్జి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, ముంబైలో మాత్రమే ఉంది. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా కరీంనగర్‌లో నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి ఔట్‌స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందింది.
అప్రోచ్ రోడ్ల నిర్మాణమే పెండింగ్..
ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జిని అనుసంధానం చేసే రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందుకోసం రూ.34 కోట్లతో విశాలమైన రోడ్లను నిర్మించనున్నారు. కరీంనగర్ కమాన్ నుండి బైపాస్ రోడ్డు వరకు.. అలాగే సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు 4.7 కి.మీ మేర ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవి పూర్తయితే బ్రిడ్జి పైకి వాహనాలను అనుమతించనున్నారు. రాత్రి వేళ పర్యాటలకు కనువిందు చేసేలా వంతెనపై రంగు రంగుల డిజిటల్ లైటింగ్, పర్యాటకులను ఆకట్టుకునే ఇతర పనులను చేపట్టేందుకు అధికారులు రూ.8 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన వెంటనే ఆ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.