మునుగోడులో కాంగ్రెస్ దిద్దుబాట
ABN , First Publish Date - 2022-08-04T10:29:33+05:30 IST
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.
హైదరాబాద్/నల్లగొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఆ నియోజకవర్గంలో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులకు భరోసా కల్పించి, ధైర్యాన్ని అందించే దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్‌రెడ్డి దూషిస్తున్నప్పుడు ఆయన వెంట వేదికపై ఉన్నారన్న కారణంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులను సస్పెండ్ చేసింది. వారి స్థానంలో త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు. రెండు మూడురోజులపాటు పరిస్థితిని పరిశీలించి మరి కొందరిపై వేటు వేయడానికి పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు పీసీసీ పిలుపు మేరకు బుధవారం కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి.
ఇక ప్రలోభాలకు లోనై పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఏఐసీసీ నియమించిన పార్టీ వ్యూహ, ప్రచార కమిటీ ప్రతినిదులు గురువారం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, చండూరు మండలాల్లో పర్యటించనున్నారు. కమిటీ కన్వీనర్ మధుయాష్కీగౌడ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, ఎస్.ఎ.సంపత్‌కుమార్, ఇరవత్రి అనిల్‌కుమార్‌లతో కూడిన కాంగ్రెస్ బృందం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలోకి రావడానికి సానుకూలంగా ఉన్న నేతలను, కార్యకర్తలను ప్రోత్సహించేందుకు కూడా కమిటీ వ్యూహాన్ని రూపొందించినట్టు తెలిసింది. మరోవైపు శుక్రవారం చండూరు మండల కేంద్రంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఈ సభకు హాజరు కానున్నారు. దీంతోపాటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు.