CM KCR-Prakash Raj మధ్య స్నేహబంధం ముగిసినట్లేనా.. రాజ్యసభ సీటు ఎందుకు దక్కలేదు..?
ABN , First Publish Date - 2022-05-28T16:51:49+05:30 IST
ప్రకాష్‌రాజ్. తన నటతోనే కాదు, సామాజిక స్పృహతోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా

టీఆర్ఎస్ రాజ్యసభ టిక్కెట్ల వ్యవహారంలో ప్రకాష్‌రాజ్‌కు మొండిచేయి ఎదురుకావడానికి కారణం ఏమిటి? కేసీఆర్, ప్రకాష్‌రాజ్ స్నేహబంధం ఇక ముగిసిన అధ్యాయమేనా? లేక మరో కొత్త బాధ్యతలేమైనా అప్పగించనున్నారా? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం...
రాజకీయాల్లో మార్పు రావాలని బలంగా కోరుకునే వ్యక్తి..
ప్రకాష్‌రాజ్. తన నటతోనే కాదు, సామాజిక స్పృహతోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో ముందుంటున్నారు. ప్రసిద్ధ పాత్రికేయరాలు గౌరీ లంకేష్ హత్య తదితర సంఘటనలలో ఆయన కమలదళాన్ని గట్టిగానే విమర్శించారు. మోదీ విధానాలపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటానికి ఆయన ఏ విధంగానూ సంకోచించరు. ప్రస్తుతం బీజేపీపై సరైన విమర్శలు చేయగలిగినవారిలో ప్రకాష్‌రాజ్ పేరు కూడా వినిపిస్తుంటుంది. ప్రకాష్‌రాజ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాలలోనూ కీలకపాత్ర పోషించే పనిలో పడ్డారు. తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా బెంగళూరు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశారు. కానీ డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికలలో అధ్యక్షుడిగా నిలబడిన తరువాత తెలుగు రాష్ట్రాలలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా సాగిన ఈపోటీలోనూ ప్రకాష్‌రాజ్ ఓటమిపాలయ్యారు.
ప్రకాష్‌రాజ్‌ను టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపుతారనే వార్తలు
దేశ రాజకీయాలను మార్చేస్తానంటూ శపథం చేసిన కేసీఆర్ తన ఫ్రంట్ ఏర్పాట్లలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకాష్‌రాజ్ ప్రత్యక్ష మవడం సంచలనమైంది. అసలు కేసీఆర్‌తో ఈయనకు సంబంధం ఏమిటి, ప్రకాష్‌రాజ్‌కు కేసీఆర్ అంతటి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమేంటనే చర్చ మొదలైంది. ఏతావాతా తేలింది ఏమిటంటే జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు ఆశపడుతున్న కేసీఆర్‌కు ఈ విలక్షణ నటుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ వెనుక ఈ మోనార్క్ ఉంటున్నారని టాక్.

దేశ రాజకీయాల విషయమై తరచూ కేసీఆర్, ప్రకాష్‌రాజ్ సమావేశమవుతుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో గతంలో వీరిద్దరూ మూడురోజులు భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో కీలకంగా మారడంతోపాటు బీజేపీ వ్యతిరేక శక్తిగా ఎలా ఎదగాలనే విషయమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రకాష్‌రాజ్ ను టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపుతారనే వార్తలు గుప్పుమన్నాయి.

ప్రకాష్ రాజ్ పేరు లేకపోవడంపై ఆసక్తి కర చర్చ
తాజా గా తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభకు పంపే ముగ్గురి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కానీ అందులో ప్రకాష్ రాజ్ పేరు లేకపోవడంపై ఆసక్తి కర చర్చ మొదలైంది. ప్రకాష్ రాజ్ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నేతలు మంచి సంబంధాలు ఉన్నాయనే పేరు తొలి నుంచి ఉంది. దీంతో జాతీయస్థాయిలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని చెపుతున్నారు. పదవుల కన్నా ముందు దేశవ్యాప్తంగా బలోపేతం కావడం ముఖ్యమని ఇందుకు ప్రకాష్‌రాజే సరైన వ్యక్తనే ఆలోచనలో గులాబీబాస్ ఉన్నారుట. ఇక మొన్న తమిళ స్టార్ హీరో విజయ్ కేసీఆర్‌ను కలవడం వెనుక కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారుట. అటు ఆయా రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలపై వ్యతిరేకంగా ఉన్నవారితోపాటు, ఇటు కేంద్రంపై అసంతృప్తిగా ఉన్న ఆయా రాష్ట్రాల నేతలను కలుపుకుని ముందుకు పోవాలనే యోచన చేస్తున్నారుట. ఈ కీలక బాధ్యతను ప్రకాష్‌రాజ్ ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చాలనేది తెలంగాణ సీఎం ప్లాన్ అని టీఆర్ఎస్ కేడర్ ఇన్సైడ్ టాక్.
