కుట్ర కథల కుండపోత

ABN , First Publish Date - 2022-07-18T08:23:27+05:30 IST

‘‘క్లౌడ్‌ బరస్ట్‌ అనేది కొత్త పద్ధతేదో వచ్చింది. దీనిమీద ఏవో కొన్ని కుట్రలున్నయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకూ కరెక్టో తెలవదు.

కుట్ర కథల కుండపోత

క్లౌడ్‌ బర్‌స్టపై సీఎం కేసీఆర్‌ విదేశీ కుట్ర సిద్ధాంతం..

అలా కుంభవృష్టి ‘కురిపించుడు’ సాధ్యమేనా?

క్లౌడ్‌ సీడింగ్‌ రహస్యంగా చేయడం కష్టమే: శాస్త్రజ్ఞులు

అమెరికా ‘హార్ప్‌’ ప్రాజెక్టు పైనా పలు అనుమానాలు

దీనివల్ల ఉత్పాతాలు వస్తున్నాయంటూ 2010 నుంచి కథనాలు

2016లో రాజ్యసభలో ప్రస్తావించిన మాజీ మంత్రి అనిల్‌ దవే

అమెరికా ప్రయోగించిన ‘ఆయుధం’గా అభివర్ణన

దాని పరిమితి చాలా తక్కువని శాస్త్రజ్ఞుల వెల్లడి


‘‘క్లౌడ్‌ బరస్ట్‌ అనేది కొత్త పద్ధతేదో వచ్చింది. దీనిమీద ఏవో కొన్ని కుట్రలున్నయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకూ కరెక్టో తెలవదు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మనదేశంలో అక్కడక్కడా క్లౌడ్‌ బరస్టులు చేస్తా ఉన్నారు. గతంలో ఒకసారి కశ్మీర్‌ దగ్గర లద్దాఖ్‌లో, లేహ్‌లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలో కూడా చేస్తున్నారని మనకు గ్లూమీ గ్లూమీగా వచ్చిన సమాచారం.’’


..వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లిన సీఎం కేసీఆర్‌ అక్కడ ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో చేసిన సంచలన వ్యాఖ్యలివి. ఇందులో ముఖ్యమైనవి రెండు విషయాలు. ఒకటి క్లౌడ్‌ బరస్ట్‌. రెండోది విదేశీ కుట్ర కోణం. క్లౌడ్‌ బరస్ట్‌ అనేది నిర్ణీత పరిస్థితుల్లో ప్రకృతి సిద్ధంగా జరిగే సహజ ప్రక్రియ. తక్కువ సమయంలో కుండలతో దిమ్మరించినట్టు ఒకే ప్రాంతంలో(20-30 చదరపు కిలోమీటర్ల పరిధిలో) కేంద్రీకరించినట్టుగా ఎక్కువ వర్షం (గంటకు 100 మిల్లీమీటర్లు అంతకన్నా ఎక్కువ) కురిస్తే దాన్ని ‘క్లౌడ్‌ బర్‌స్ట’గా వ్యవహరిస్తారు. 2013లో కేదార్‌నాథ్‌ విలయానికి కారణం ఇదే. సాధారణంగా క్లౌడ్‌ బర్‌స్టలు కొండ ప్రాంతాల్లో ‘ఎక్కువగా’ సంభవిస్తాయి.  కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లో తరచుగా సంభవించే ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు కారణం ఇవే. ఇక, విదేశీ కుట్ర అంటే.. క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించడం ద్వారా నష్టం కలిగించే ప్రయత్నం చేయడం. దీన్ని ‘వెదర్‌ మాడిఫికేషన్‌/వెదర్‌ కంట్రోల్‌’గా వ్యవహరిస్తారు.


అంటే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించడం. వాతావరణ నియంత్రణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపించే పదబంధం.. క్లౌడ్‌ సీడింగ్‌. అంటే మేఘాల్లోకి సిల్వర్‌ అయోడైడ్‌ను పంపించడం ద్వారా కృత్రిమంగా వర్షాలు కురిపించడం. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో క్లౌడ్‌ సీడింగ్‌ ద్వారా.. గేమ్స్‌కు ముందే వర్షాలను కురిపించడం ద్వారా చైనా ఆ ఆటలకు అడ్డం లేకుండా చేసింది. అప్పట్నుంచి క్లౌడ్‌ సీడింగ్‌ అనే మాట విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ.. ఆ ఒలింపిక్స్‌కు ముందు చాలాకాలం నుంచే చైనా వాతావరణ సంస్థ క్లౌడ్‌ సీడింగ్‌ చేసేది. దేశంలోని నదుల్లో నీరు తగ్గిపోకుండా చూడడానికి, పంటపొలాలకు అవసరమైన నీరు అందించడానికి ఆ విభాగం చైనావ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేసేది. చేస్తోంది. అందుకే.. లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో క్లౌడ్‌ బర్‌స్టలకు కారణం చైనాయేనన్న ఆరోపణలు వినిపిస్తుంటాయి.  


1946లోనే...

చైనా కన్నా చాలా దశాబ్దాల ముందే.. అమెరికాలో క్లౌడ్‌ సీడింగ్‌ జరిగింది. మేఘాల్లోకి క్రష్డ్‌ డ్రై ఐస్‌ను చల్లగలిగితే మంచువాన కురుస్తుందని విన్సెంట్‌ జోసెఫ్‌ షేఫర్‌ అనే అమెరికన్‌ కెమిస్ట్‌ కనిపెట్టారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేసే షేఫర్‌.. 1946, నవంబరు 13న బెర్క్‌షైర్‌ కొండల్లో తొలిసారి క్లౌడ్‌ సీడింగ్‌ చేసి చూపారు. ఆ తర్వాత.. 1947లో ‘ప్రాజెక్ట్‌ సిర్రస్‌’ పేరుతో 1947లో అమెరికా ‘వాతావరణ నియంత్రణ’లో భాగంగా తుఫాన్ల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేసింది. జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ, అమెరికా ఆర్మీకి చెందిన సిగ్నల్‌ కోర్‌, నేవల్‌ రిసెర్చ్‌ విభాగం, వైమానిక దళం ఇందులో భాగమయ్యాయి. ఆ ఏడాది అక్టోబరు 13న వారు ఒక తుఫాను తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయగా.. అది దారి మార్చుకుని వేరే చోట కుంభవృష్టి కురిపించింది. దీంతో ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ 1962-83 నడుమ ‘ప్రాజెక్ట్‌ స్టార్మ్‌ ఫ్యూరీ’ పేరిట.. తుఫాన్ల తీవ్రతను తగ్గించేందుకు క్లౌడ్‌ సీడింగ్‌ విస్తృతంగా చేశారు.


అవేవీ పెద్దగా ఫలించకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ తర్వాత క్లౌడ్‌ సీడింగ్‌ విధానం నిర్ణీత ప్రాంతాల్లో వర్షాలు కురిపించడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. అదీ అంత సులభం కాదు. ఒక ప్రాంతంలో ఈ పద్ధతిలో వర్షం కురిపించాలంటే అక్కడి గాలిలో తగినంత నీటి ఆవిరి ఉండాలి. నీటి ఆవిరి లేకుంటే క్లౌడ్‌ సీడింగ్‌ వల్ల ఉపయోగం ఉండదు. పైగా క్లౌడ్‌ సీడింగ్‌ ద్వారా ఒక ప్రాంతంలో వర్షం కురిపించాలంటే.. కింద నుంచి మేఘాల్లోకి సిల్వర్‌ అయోడైడ్‌ పార్టికల్స్‌ను షూట్‌ చేయాలి. లేదా విమానాల ద్వారా మేఘాల పైనుంచి ఆ పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఆ ప్రాంతవాసులకు ఆ విషయం తెలుస్తుంది. క్లౌడ్‌ సీడింగ్‌ పరిమితి చాలా తక్కువ. కాబట్టి ఈ పద్ధతిలో ఎవరికీ తెలియకుండా రహస్యం క్లౌడ్‌ బర్‌స్టలను సృష్టించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో కుట్ర కోణం ఇంకేమై ఉంటుంది అంటే.. అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధ సమయంలో ఆ దేశంలో చేపట్టిన ‘ఆపరేషన్‌ సోబర్‌ పొపేయే’ గురించి కొందరు గుర్తుచేస్తున్నారు. దీన్ని ‘ప్రాజెక్ట్‌ కంట్రోల్డ్‌ వెదర్‌ పొపేయే/మోటార్‌పూల్‌/ఇంటర్‌మీడియెరీ కంపాట్రియోట్‌’గా కూడా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది అమెరికా సైన్యం చేపట్టిన క్లౌడ్‌ సీడింగ్‌. పెద్ద ఎత్తున వానలు కురిపించి వియత్నాం సైనికులకు ఆహారం, ఆయుధాలు అందకుండా అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం. కానీ, అది యుద్ధరంగం కాబట్టి, అమెరికా సేనలు బహిరంగంగానే ఆ పని చేశాయి. ఇలాంటి ప్రయోగాలను రహస్యంగా చేయడం కష్టం. ఈ నేపథ్యంలో.. అమెరికానే చేస్తున్న ‘హార్ప్‌’ అనే మరో ప్రయోగం గురించి కొందరు ప్రస్తావిస్తున్నారు.


ఏమిటీ హార్ప్‌?

హార్ప్‌ అంటే.. ‘హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్‌ అరోరల్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌’. భూ ఊపరితలం నుంచి గగనతలంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు, ఇతర మార్పుల ఆధారంగా వాతావరణాన్ని శాస్త్రజ్ఞులు ఐదు రకాలుగా విభజించారు. వీటిని భూ ఆవరణాలు అంటారు. అవి.. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. వీటిలో థర్మో ఆవరణం 80కి.మీ. నుంచి 400 కి.మీ. ఎత్తువరకూ ఆవరించి ఉంటుంది. ఈ ఆవరణంలో వాయువులు అయాన్ల రూపంలో ఉండడంతో దీన్ని ఐనో ఆవరణంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఆవరణంలో ఆక్సిజన్‌, నైట్రోజన్ల నిరంతర రసాయనిక చర్యల వల్ల కాంతిపుంజాలు ఏర్పడతాయి. ఆ కాంతిపుంజాలనే మనం ‘అరోరా’లుగా వ్యవహరిస్తాం. స్కాండినేవియన్‌ దేశాల్లో కనిపించే అరోరా బొరియోలిస్‌ (నార్తర్న్‌ లైట్స్‌) అంటే ఈ కాంతిపుంజాలే. రేడియో కమ్యూనికేషన్స్‌కు అత్యంత కీలకం ఈ ఆవరణమే. అందుకే.. ఈ ఆవరణంపై పరిశోధనలు జరిపేందుకు అమెరికా అలస్కాలో ఈ ప్రోగ్రామ్‌(హార్ప్‌) కింద 1993లో ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రజ్ఞులు రేడియో ట్రాన్స్‌మిటర్ల ద్వారా రేడియో బీమ్‌లను పంపి ఆ ప్రాంతానికి పై భాగంలో ఉన్న గాలిని వేడి చేస్తుంటారు. దానివల్ల భూ ఉపరితల వాతావరణంలో జరిగే మార్పులను పరిశీలిస్తుంటారు.


అయితే ఈ ప్రాజెక్టులోని సంక్లిష్టతల నేపథ్యంలో చాలా మంది దీన్ని వాతావరణ నియంత్రణ ప్రాజెక్టుగా పొరబడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ దావానలం చెలరేగినా, వరదలు, తుఫాన్లు సంభవించినా.. వాటన్నింటికీ కారణం ఇదేనని కుట్ర కోణాన్ని తెరపైకి తెస్తుంటారు. ఈ ఆరోపణలకు మూలం.. 2010లో నాటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ చేసిన ఆరోపణ. అప్పట్లో హైతీని కుదిపేసిన తీవ్ర భూకంపానికి కారణం ఇదేనని ఆయన ఆరోపించారు. అప్పట్నుంచీ దీనిపై ‘కాన్‌స్పిరసీ థియరీలు (కుట్ర సిద్ధాంతాలు)’ విస్తృతంగా వినిపిస్తున్నాయి. 2010 నుంచి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి ఉత్పాతం సంభవించినా దీనికి ముడిపెట్టడం మొదలైంది. మన కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి, దివంగత అనిల్‌ మాధవ్‌ దవే 2016లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అమెరికా చేపట్టిన ఈ ‘ఆయుధం’ విద్యుదయస్కాంత తరంగాలను భూ ఉపరితల వాతావరణంలోకి పంపిస్తోందని.. ఇది భూతాపానికి కారణమయ్యే ‘అవకాశం’ ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. కానీ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉపయోగించే  రేడియో ట్రాన్స్‌మిటర్ల ప్రభావం, పరిధి చాలా తక్కువ అని.. దీనివల్ల భూతాపం పెరగదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు.


అంతేకాదు.. వేరే దేశాల్లో,  కావాల్సిన చోట, కావాల్సిన ప్రకృతి ఉత్పాతాలు సృష్టించేంత శక్తి దీనికి లేదని వారు తేల్చిచెబుతున్నారు.. ఇప్పటిదాకా సాధించగలిగింద ఏదైనా ఉందంటే.. అది పరిమిత ప్రాంతంలో, అదీ వాతావరణం సహకరిస్తే మబ్బులు వర్షించేలా చేయడం, పొగమంచు పోయేలా చేయడం వంటివి మాత్రమేనని మిక్‌వెస్ట్‌ అనే శాస్త్రవేత్త వివరించారు. నానాటికీ పెరుగుతున్న భూతాపం ప్రకృతి ఉత్పాతాలకు కారణమవుతోందని శాస్త్రజ్ఞులు చాలాకాలంగా హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలికాలంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులన్నీ అందులో భాగమేనని వారు పేర్కొంటున్నారు.

సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2022-07-18T08:23:27+05:30 IST