CM KCR BRS: యాగం చేసి జెండా ఎగరేసి

ABN , First Publish Date - 2022-12-15T02:40:12+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తాత్కాలిక కార్యాలయం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

CM KCR BRS: యాగం చేసి  జెండా ఎగరేసి

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నవ చండీయాగంలో పాల్గొన్న కేసీఆర్‌ దంపతులు

హాజరైన కుమారస్వామి, అఖిలేశ్‌ యాదవ్‌,

తమిళ ఎంపీ, రైతు సంఘాల నాయకులు

తరలివచ్చిన మంత్రులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తొలి సంతకం

అనుబంధ సంఘంగా భారత రాష్ట్ర కిసాన్‌ సమితి

కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా గుర్నామ్‌ సింఘ్‌ చడూ,

కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ నియామకం

ప్రారంభోత్సవానికి హాజరుకాని కేటీఆర్‌

అమరావతిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

సంక్రాంతిలోపు ఏర్పాటుకు సన్నాహాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) తాత్కాలిక కార్యాలయం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత ఉదయం 10.20 నుంచి 12 గంటల వరకు నవ చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలు, రైతు నాయకులు హాజరయ్యారు. వారిలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అఖిలేశ్‌యాదవ్‌, రైతు నాయకులు గుర్నామ్‌సింగ్‌, తమిళనాడు వీసీకే పార్టీ అఽధ్యక్షుడు, ఎంపీ తిరుమావళన్‌ తదితరులు ఉన్నారు. కాగా, కేసీఆర్‌ సతీమణి శోభారాణి, కూతురు కవిత, అతిథులతో కలిసి నవచండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రుత్వికులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్‌ నేరుగా మొదటి అంతస్తులో ఉన్న తన చాంబర్‌కు వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ లెటర్‌ హెడ్‌పై జాతీయ అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘంగా భారత రాష్ట్ర కిసాన్‌ సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ కిసాన్‌ నేత, హరియాణా రాష్ట్రం కురుక్షేత్రకు చెందిన గుర్నామ్‌ సింఘ్‌ చడూను, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ మంగళవారం ప్రధాని మోదీని కలిసి తన నియోజకవర్గం హసన్‌లో సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరడం గమనార్హం.

నామా ఇంట్లో సీఎం భోజనం..

బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నివాసంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా అక్కడే భోజనం చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్దార్‌ పటేల్‌ రోడ్డు ‘జై కేసీఆర్‌, జై భారత్‌, జై బీఆర్‌ఎస్‌’ నినాదాలతో హోరెత్తింది. బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయం అయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడింది. అటు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం తెలంగాణ భవన్‌, తుగ్లక్‌ రోడ్డులోని సీఎం అధికారిక నివాసంలోనూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు నినాదాలతో సందడి చేశారు. ఢిల్లీ పోలీసులు, తెలంగాణ పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంత్రి కేటీఆర్‌ గైర్హాజరు

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ హాజరు కాలేదు. ఇందుకు కారణాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాలతోపాటు సిరిసిల్లలో సెస్‌ ఎన్నికల నామినేషన్లు కూడా ఉండడంతో ఢిల్లీకి వెళ్లలేకపోయినట్లు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్‌ఎస్‌ వేదికగా దేశం మొత్తానికి పరిచయం కానున్నాయని, దేశంలో రాబోయే గుణాత్మక మార్పునకు బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం నాంది పలుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-15T04:02:39+05:30 IST