ఓయూలో క్లస్టర్ విధానం
ABN , First Publish Date - 2022-05-24T09:30:18+05:30 IST
విద్యార్థులకు సమీకృత విద్యావిధానాన్ని అందించడంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

- ఒకే గొడుగు కిందకు 10 అటానమస్ కాలేజీలు
- దేశంలో ఇదే తొలిసారి అన్న అధికారులు
హైదరాబాద్ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సమీకృత విద్యావిధానాన్ని అందించడంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా కళాశాలల మధ్య ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల పరస్పర సహకారం, విద్యార్థుల ఉమ్మడి పరిశోధన, అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ విధానం ద్వారా అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు ఓయూకు అనుబంధంగా ఉన్న పది అటానమస్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చే విధానంపై ఆయా కళాశాలల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఆయా కళాశాలల ప్రతినిధులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు.
కళాశాలల మధ్య ఉత్తమ బోధన విధానాల మార్పిడికి ఈ ఒప్పందం దోహదపడుతుందని నవీన్ మిట్టల్ అన్నారు. ఈ విధానం ద్వారా ఉత్తమ విద్యావిధానం విద్యార్థులకు చేరువకానుందని ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. నూతన విద్యా విధానాలను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం దేశంలో ఇదే తొలిసారని ప్రొఫెసర్ డి.రవీందర్ చెప్పారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు భిన్న పాఠ్యాంశాలు, భిన్న కళాశాలల వాతావరణంలో చదివిన అనుభవం వస్తుందన్నారు. క్లస్టర్ విద్యావిధానంపై హైదరాబాద్‌లోని పది కళాశాలలు సంతకాలు చేశాయి. ఇందులో సెయింట్ ఆన్స్ కళాశాల-మెహిదీపట్నం, లయోలా అకాడమీ-సికింద్రాబాద్, సెయింట్ జోసఫ్ డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల, ఆర్‌బీవీఆర్‌ఆర్ కళాశాల- నారాయణగూడ.. భవన్స్ కళాశాల-కింగ్ కోఠి, నిజాం కళాశాల, యూనివర్సిటీ మహిళా కళాశాల-కోఠి, ప్రభుత్వ సిటీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల-బేగంపేట ఉన్నాయి.
గ్రూపు-1 పోస్టులకు 1,90,253 దరఖాస్తులు
గ్రూపు-1 పోస్టుల కోసం సోమవారం నాటికి 1,90,253 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. 503 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు 2,84,211 మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో తమ వివరాలను ఎడిట్ చేసుకున్నారు. అలాగే, కొత్తగా 1,36,714 మంది వివరాలు నమోదు చేసుకున్నారు.
ఎంసెట్‌కు 2.15 లక్షల దరఖాస్తులు
ఎంసెట్‌కు సోమవారం నాటికి 2,15,589 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 1,38,916 మంది, అగ్రి, మెడికల్ విభాగానికి 76,673 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.