కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ABN , First Publish Date - 2022-06-25T09:29:43+05:30 IST

ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌ కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక అనువాద పురస్కారాన్ని శుక్రవారం

కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌  కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక అనువాద పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. జర్నలిస్టు భాషాసింగ్‌ పారిశుధ్య కార్మికులపై హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ అనే పుస్తకాన్ని ‘అశుద్ధ భారత్‌’ పేరిట సజయ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తక అనువాదానికే ఆమెకు ఈ పురస్కారం లభించింది. రూ.50 వేల నగదు బహుమతి, జ్ఞాపికను పురస్కారంలో భాగంగా అందిస్తామని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివా్‌సరావు ఓ ప్రకటనలో తెలిపారు. అకాడమీ అనువాద పురస్కార ఎంపిక జ్యూరీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యురాలు శేషారత్నం, సీనియర్‌ కవి ముకుందరామారావు, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు ఉన్నారు. ఈ సందర్భంగా సజయ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘‘ఈ పురస్కారం నా ఒక్కరికి కాదు.


ఆ పుస్తకంలో ప్రస్తావించిన అనేక మంది మహిళలకు, సఫాయి కార్మిక సమూహాలకు, సఫాయి కర్మచారీ ఆందోళన్‌ ఉద్యమానికి చెందిన పురస్కారం’’ అన్నారు. సజయను కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు బోర్డు కన్వీనర్‌ కె.శివారెడ్డి, జాతీయ గిరిజన మౌఖిక సాహిత్య వేదిక సభ్యుడు సమ్మెట నాగమల్లేశ్వరరావు, వీక్షణం వేణుగోపాల్‌, రచయితలు కొండవీటి సత్యవతి, వాసిరెడ్డి నవీన్‌ తదితరులు అభినందించారు. కాగా, ఇదే అనువాదానికి  తెలుగు విశ్వవిద్యాలయం గత సంవత్సరం సజయను విశిష్ట పురస్కారంతో సత్కరించింది.   

Updated Date - 2022-06-25T09:29:43+05:30 IST