సినీ, రాజకీయ ప్రముఖులపై ఈడీ గురి

ABN , First Publish Date - 2022-07-30T08:46:12+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న క్యాసినో దందా కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్‌ ఫోన్‌, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్న

సినీ, రాజకీయ ప్రముఖులపై ఈడీ గురి

చీకోటితో సంబంధాలున్న వారిపై కన్ను

ప్రవీణ్‌ చీకటి దందా అంతా వాట్సాప్‌లోనే 

నాలుగు కీలక బ్యాంకు ఖాతాల గుర్తింపు

హవాలా జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ

ఇక్కడి ప్రముఖుల నుంచి రూ.కోట్లు తీసుకుని

విదేశీ క్యాసినోల్లో ఆడేందుకు డాలర్ల ఏర్పాటు

అతడితో సంబంధాలున్న 20 మంది రాజకీయ,

10 మంది సినీప్రముఖుల విచారణకు సిద్ధం

వారందరికీ ఇప్పటికే నోటీసులు జారీ?


హైదరాబాద్‌, సంగారెడ్డి/మెదక్‌, బోయినపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న క్యాసినో దందా కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్‌ ఫోన్‌, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటిలో కీలకమైన వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రవీణ్‌ క్యాసినో కార్యకలాపాల వివరాలు.. సినీ, రాజకీయ ప్రముఖులతో చాటింగ్‌లు.. అన్నీ అతడి వాట్సాప్‌ ఖాతాలో ఉన్నట్టు సమాచారం. గోవాలోని బిగ్‌డాడీ క్యాసినోకు ప్రవీణ్‌ ఇక్కడి ప్రముఖులను తీసుకెళ్లేవాడని, జూదప్రియులను ఆకర్షించేందుకు సినీ తారలతో కూడిన ప్రచార ప్రోమోలను ప్రముఖుల వాట్సా్‌పలకు పంపేవాడని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈనేపథ్యంలో.. ప్రవీణ్‌తో సంబంధాలున్న పదిమంది సినీ, 20 మంది రాజకీయ నాయకులను విచారించేందుకు ఈడీ సిద్ధమైందని.. విచారణకు హాజరవ్వాలంటూ వారికి నోటీసులు పంపిందని తెలుస్తోంది. అలాగే చీకోటి ప్రవీణ్‌ ఆర్థిక లావాదేవీల్లో కీలకమైన అతడి నాలుగు బ్యాంకు ఖాతాలనూ ఈడీ గుర్తించింది.


ప్రాథమిక వివరాలను పరిశీలించిన అనంతరం.. ప్రవీణ్‌ నేతృత్వంలో పెద్దమొత్తంలో హవాలా దందా జరిగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చిందని సమాచారం. క్యాసినోలు విదేశాల్లో నిర్వహించినప్పుడు ఇక్కడి ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని ప్రవీణ్‌ అక్కడ వారికి డాలర్లు సమకూర్చేవాడని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. చీకోటి ప్రవీణ్‌కు హైదరాబాద్‌లో 20 మంది ఏజెంట్లు ఉన్నారు. వీరు కాక.. ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు తదితర నగరాల్లోనూ పలువురు ఏజెంట్లున్నారు. చీకోటిపై ఈడీ దాడుల నేపథ్యంలో వీరంతా ఫోన్లు స్విచాఫ్‌ చేసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతడి ఫోన్‌లో తమ నంబర్లు ఉండడంతో.. ఈడీ అధికారులు తమను ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. చీకోటి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తూ, అతడి దందాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సంపత్‌ అనే వ్యక్తిని ఈడీ అధికారులు గుర్తించారు. అతడు చీకోటి వద్ద పదిహేనేళ్లుగా పనిచేస్తున్నట్టు సమాచారం. దాడులు జరిగినప్పటి నుంచి అతడు కూడా జాడలేకుండా పోయాడు.


అటు మెదక్‌ జిల్లాలోనూ పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు చీకోటికి లక్షలాది రూపాయలు అప్పుగా ఇచ్చి.. వారం రోజుల వ్యవధిలో 10-15 శాతం వడ్డీతో రాబట్టుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న ఏడుపాయలలోని హరిత హోటల్‌లో చీకోటి సన్నిహితులు అతడికి సన్మానం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వారంతా ఈడీ కన్ను తమపై ఎక్కడ పడుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లో కలుసుకుని దాడుల గురించి చర్చించుకున్నట్లు తెలిసింది. సోమవారం జరిగే ఈడీ విచారణలో ఎలా సమాధానం చెప్పాలో కూడా వారు మాట్లాడుకున్నట్టు సమాచారం.


చర్యలు తీసుకోండి..

తన వాహనంపై ఉండాల్సిన ఎమ్మెల్యే స్టిక్కర్‌.. మాధవరెడ్డి వాహనంపై ఉండడం గురించి మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పందించారు. ‘‘నాకు సంబంధించిన ఎమ్మెల్యే స్టికర్‌ వేరే వ్యక్తుల వాహనాలపై కనిపిస్తే వెంటనే ఆ బళ్లను సీజ్‌ చేసి వారిపైచట్టపరమైన చర్యలు తీసుకోండి’’ అని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బోయినపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు, తన కుటుంబానికి కలిపి మొత్తం మూడు స్టిక్కర్లు మాత్రమే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన స్టిక్కర్‌ను ఎవరూ పెట్టుకోవద్దని కార్యకర్తలకు, స్నేహితులకు, కుటుంబ సభ్యుల స్నేహితులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.


సంక్షోభంలో కూరుకున్నా.. శ్రీలంకలో క్యాసినో

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ఇంకా క్యాసినో దందా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి జూదప్రియుల టూర్లూ సాగుతూనే ఉన్నాయి. ఈ నెల 8, 9, 10 తేదీల్లో.. 15, 16, 17 తేదీల్లో కొలంబోలో నిర్వహించిన క్యాసినోకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు హాజరైనట్టు సమాచారం. జూదానికి అలవాటుపడ్డ ధనవంతులను అక్కడికి ఆకర్షించేందుకు హైదరాబాద్‌, విజయవాడల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌ నుంచి కొలంబోకు నేరుగా విమానాలు ఉండటం, ప్రయాణ సమయం రెండు గంటలే కావడం..  జూదప్రియులకు అనుకూలంగా మారింది. చాలా మంది రాత్రిపూట క్యాసినోలకు వెళ్లి ఉదయానికల్లా హైదరాబాద్‌కు తిరిగొచ్చినట్టు సమాచారం. వారి నుంచి నిర్వాహకులు శ్రీలంక కరెన్సీలో లక్ష నుంచి కోటికి పైగా సొమ్మును వసూలు చేసినట్టు సమాచారం. కొలంబోలో నిర్వహించిన క్యాసినోలో ఈ నెల 8న బాలీవుడ్‌ నటి సోనియా బన్సల్‌, 9న నటుడు ఆఫ్తాబ్‌ శివదాసాని, 10న మౌనీ రాయ్‌ పాల్గొని తమ నృత్యాలతో అలరించారు. అలాగే 15, 16, 17 తేదీల్లో ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ పేరుతో విదేశీ మోడళ్లు, బెల్లీ డ్యాన్సర్లను రంగంలోకి దించి జూదం ప్రియులను అలరించారు. కాగా.. ఆయా తేదీల్లో ఇక్కడినుంచి కొలంబో క్యాసినోకు వెళ్లినవారి జాబితాను ఈడీ ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. వీరిని విచారిస్తే హవాలా సొమ్ముకు సంబంధించిన వివరాలు బయటపడుతాయని ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంలోనూ ప్రవీణ్‌, మాధవరెడ్డి పాత్రపై విచారణ జరుపుతోంది.

Read more