కేసులు పెరుగుతున్నాయ్‌.. మాస్క్‌ పెట్టుకోండి

ABN , First Publish Date - 2022-06-11T08:01:31+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, వారం రోజుల్లో 56 శాతం అధికంగా నమోదయ్యాయని,

కేసులు పెరుగుతున్నాయ్‌.. మాస్క్‌ పెట్టుకోండి

4 నుంచి 6 వారాల పాటు ఇదే పరిస్థితి.. వారంలో పాజిటివ్‌లు 56 శాతం అధికం


బీఏ4, బీఏ5 వేరియంట్‌ కేసులే ఎక్కువ

పాజిటివిటీ 0.17 నుంచి 1.47 శాతానికి

ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు లేవు

ఆందోళన వద్దు.. మాస్క్‌లు తప్పనిసరి

12 ఏళ్లు దాటిన విద్యార్థులకు టీకాకు తల్లిదండ్రులు, విద్యా శాఖకు సూచనలు

మీడియాతో డీహెచ్‌ గడల శ్రీనివాసరావు

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, వారం రోజుల్లో 56 శాతం అధికంగా నమోదయ్యాయని,  పాజిటివ్‌ రేటు 0.17 నుంచి 1.47 శాతానికి చేరిందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఇది పాజిటివ్‌ల పెరుగుదల మాత్రమేనని.. నాలుగో వేవ్‌ రాదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అధికం ఒమైక్రాన్‌ ఉప వేరియంట్లు బీఏ4, బీఏ 5వేనని పేర్కొన్నారు. నెల రోజుల్లో  65 శాతం పాజిటివ్‌లు ఈ వేరియంట్‌లవేనని వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్తే మాస్కులు ధరించాలని సూచించారు. గత వారం 355 కేసులు నమోదవగా, ఈ వారం 555కు చేరాయని డాక్టర్‌ గడల తెలిపారు. ఒమైక్రాన్‌ వ్యాప్తి తర్వాత పది వారాలకు మళ్లీ ఇప్పుడే పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఇంకో 4 నుంచి 6 వారాలు ఇదే పరిస్థితి ఉండొచ్చని అన్నారు. అయితే, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 వారాలుగా ఒక్క కొవిడ్‌ మరణమూ సంభవించలేదని చెప్పారు. కాగా, కొత్త కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే నమోదవుతున్నట్లు గడల తెలిపారు. దేశంలోనూ వారం వ్యవధిలో కేసులు 66 శాతం పెరిగినట్లు చెప్పారు. 


వచ్చే ఏడాది చివరిదాకా..

ప్రస్తుతం కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఈ పరిస్థితి నాలుగో వేవ్‌కు దారితీయదని డీహెచ్‌ తెలిపారు. ఇటువంటి అనూహ్య పెరుగుదల (సర్జ్‌)లు వచ్చే ఏడాది డిసెంబరు వరకు వస్తూ పోతుంటాయని చెప్పారు. కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు చేరుకుందన్నారు. వచ్చే ఏడాది చివరికి సాధారణ జలుబుగా మారుతుందన్నారు. ఆలోపు కొన్ని సర్జ్‌లు వస్తుంటాయన్నారు. కాగా, విస్తృత స్థాయిలో టీకా పంపిణీ, గత కొవిడ్‌ వేవ్‌లలో అధిక సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారినపడడంతో యాంటీబాడీలు వృద్ధి చెందడం, హెర్డ్‌ ఇమ్యూనిటీ కారణంగా రాష్ట్రంలో నాలుగో వేవ్‌కు అవకాశం లేదన్నారు. ప్రస్తుత కేసుల్లో జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు.


తల్లిదండ్రులూ జాగ్రత్తలు తీసుకోండి

ఈ నెల 13 నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయని, తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీహెచ్‌ సూచించారు. ముఖ్యంగా 12-15 ఏళ్ల పిల్లలకు టీకా ఇప్పించాలన్నారు. ఇప్పటికే విద్యా శాఖకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. టీకా పొందని పిల్లలను గుర్తించి, తమకు సమాచారం ఇస్తే పాఠశాలలోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని వెల్లడించారు. టీకా విషయంలో తల్లిదండ్రులు అపోహలకు లోను కావద్దన్నారు. వానకాలం సీజనల్‌ వ్యాధు లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్‌కు, సీజనల్‌ వ్యాధులకు మధ్య తేడాలు గుర్తించాలని సూచించారు. 

Updated Date - 2022-06-11T08:01:31+05:30 IST