అల్లం మాటున గంజాయి మూటలు
ABN , First Publish Date - 2022-01-22T08:19:11+05:30 IST
డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాను

- కోరాపుట్ టూ నాసిక్ వయా హైదరాబాద్
- గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్ సిటీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా విశాఖ, ఒడిశా ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21వేల నగదు, 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం మియాపూర్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన వికాస్ జాదవ్ కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. విశాఖ-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ ఏజెన్సీలో గంజాయి పండిస్తున్న సుభాష్ కుమార్ అలియాస్ రాహుల్ కుమార్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పంట చేతికి రాగానే అతడు వికాస్ జాదవ్‌కు సమాచారం ఇస్తాడు. దాంతో జాదవ్ తన అనుచరులైన లారీ డ్రైవర్లు నాసిక్‌కు చెందిన అశోక్ కులే, అమోల్ అథవాలేలకు సమాచారం ఇస్తాడు. సమాచారం అందుకున్న అశోక్ మహారాష్ట్రకు చెందిన విశాల్ జగన్నాథ్ పరచోరేకు విషయం చెప్పి లారీని సిద్ధం చేయమంటాడు. జగన్నాథ్ తన అనుచురులైన ఫిరోజ్ మోమిన్, సుడామ్ గోటేకర్లను పురమాయిస్తాడు. ఇలా వారు కొన్నేళ్లుగా లారీల్లో గంజాయిని కోరాపుట్ నుంచి నాసిక్‌కు రవాణా చేసి వికాస్ జాదవ్‌కు చేరవేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా కారులో పైలటింగ్ చేసుకుంటూ సరుకును తరలిస్తారు.
ఈ నెల-19న అశోక్, అథవాలే, రాహుల్ కుమార్‌తో పాటు మరో నలుగురు కారు, డీసీఎంలతో కోరాపుట్‌కు వెళ్లారు. గంజాయి సరఫరాదారుడు సుభాష్ ఆదేశాల మేరకు 800 కేజీల గంజాయిని 5 కేజీల చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తం 156 ప్యాకెట్లను డీసీఎం వ్యాన్‌లో లోడ్ చేశారు. పోలీసుల కళ్లుగప్పడానికి గంజాయిపై అల్లం బస్తాలు వేశారు. కారులో పైలటింగ్ చేస్తుకుంటూ చాకచక్యంగా ఏపీ, తెలంగాణ దాటే ప్రయత్నం చేశారు.
టోల్ రుసుం తప్పించుకుందామని..
తెలంగాణలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్ కొనసాగతుండటం, ఓఆర్ఆర్ టోల్గేట్ల వద్ద టోల్ రుసుముతో పాటు చెకింగ్ పాయింట్స్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేశారు. నగరంలో నుంచి గూడ్స్ లారీ మాదిరిగా వెళ్లడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డీసీఎం వ్యాన్ మియాపూర్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు, వ్యాన్‌లో ఉన్న ఆరుగురిని అరెస్టు చేశారు. డీసీఎం, గంజాయి సహా పట్టుకున్న సొత్తు విలువ రూ.1.80 కోట్లు ఉంటుంది.