‘బుజ్జాయి’ ఇక లేరు!
ABN , First Publish Date - 2022-01-28T08:21:24+05:30 IST
దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (91) కన్నుమూశారు.

- ‘డుంబు’ సృష్టికర్త చెన్నైలో కన్నుమూత
- ప్రముఖ కార్టూనిస్టుగా పేరుప్రఖ్యాతులు
- బొమ్మల కథలతో అలరారించిన సుబ్బరాయశాస్త్రి
- ‘దేవులపల్లి’ కుమారుడు.. స్వగ్రామం పిఠాపురం
చెన్నై, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు. 1931 సెప్టెంబరు 11న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన సుబ్బరాయశాస్ర్తికి చిన్నతనం నుంచి చిత్రలేఖనమంటే మక్కువ. అదే ఆయన్ని బాపిరాజు, మొక్కపాటి, పిలకా, గోఖలే వంటి మహామహుల వద్ద చిత్రలేఖన మెళకువలు నేర్చుకునేలా ప్రేరేపించింది. తన తండ్రి దేవుపల్లి ఒడే బడిగా ఎదిగిన మేధావి. తన కార్టూన్లలో ‘బుజ్జాయి’గా చిరపరిచితుడైన ఆయన.. భారత్కు సరికొత్త కామిక్స్ కథల్ని పరిచయం చేశారు.
ఎంతోమంది కార్టూనిస్టులకు స్ఫూర్తినిచ్చారు. ఆరు దశాబ్దాలకు పైగా ఇలస్ర్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో, ఇంకా తమిళం, ఆంగ్లం, హిందీ పత్రికల్లో ఆయన బొమ్మల కథలు పాఠకులను అలరించాయి. 17ఏళ్ల ప్రాయంలోనే ‘బానిస పిల్ల’ పేరుతో 30 పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని అచ్చు వేయగా, అది వేలాది కాపీలు అమ్ముడుపోయింది. 1963లో సంపూర్ణ ‘పంచతంత్రం’ ‘ఇలస్ర్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో ధారావాహికంగా ఐదేళ్లు ప్రచురించారు. అది ఆయనకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ‘డుంబు’ పాత్రను సృష్టించిన ఆయన.. దాని పేరుతో 1954లో ఆంధ్రప్రభలో సీరియల్ నిర్వహించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో వందకు పైగా చిన్నారుల కామిక్స్, కథల పుస్తకాలు ముద్రించారు. 1959, 1960, 1961లలో వరుసగా కేంద్రప్రభుత్వం ప్రోత్సాహక అవార్డులు ఇవ్వగా, 1992లో ఏపీ ప్రభుత్వం ‘బాలబంధు’ బిరుదుతో సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.