బువ్వ రుచి, బలమూ!!

ABN , First Publish Date - 2022-08-17T10:45:56+05:30 IST

త్వరలో పోషక్‌ అభియాన్‌ పథకం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కానుంది.

బువ్వ రుచి, బలమూ!!

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బలవర్ధక బియ్యం పంపిణీ 


100% ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు

ఇప్పటికే 4 జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు

మరో 7 నెలల తర్వాత అన్ని జిల్లాల్లో అమలు

ఇక సీఎంఆర్‌, పీడీఎస్‌ కింద ఫోరిఫైడ్‌ బియ్యమే


హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): త్వరలో పోషక్‌ అభియాన్‌ పథకం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కానుంది. పేదలు, బడి పిల్లలు, అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోషక్‌ అభియాన్‌ కింద బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌)ను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని 2023 ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో వందకు వందశాతం అమలు చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలొచ్చాయి. ఫలితంగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ-12 తో కూడిన బియ్యాన్ని సేకరించే పనిలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిమగ్నమైంది. ప్రధాని మోదీ 2019 ఆగస్టు 25న నిర్వహించిన ‘మన్‌కీ బాత్‌’లో బలవర్ధక బియ్యం పంపిణీ ఆవశ్యకతను వివరించారు. తర్వాత దేశవ్యాప్తంగా ‘ఆహారభద్రత కార్డుల్లో’ లబ్ధిదారులుగా ఉన్న పేదలందరికీ ఫోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించారు.  నిరుడు ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా పైలెట్‌ ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాలను ఎంపికచేశారు. తొలుత ఐసీడీఎస్‌ కోటా, మధ్యాహ్న భోజనం కోటాల కింద ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేశారు. ఆతర్వాత ఆహారభద్రత కార్డుదారులకు కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో.. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 53.90 లక్షల కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 36.44 లక్షల కార్డులు కలిపి మొత్తం 90.34 లక్షల ఆహార భద్రత కార్డులు కలిగివున్న 2.86 కోట్ల మందికి కూడా ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే క్రమంలో అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఫోర్టిఫైడ్‌ బియ్యమే సరఫరా చేస్తారు. దీంతో ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, విటమిన్‌- బి 12 తో కూడిన బలవర్ధకమైన ఆహారం పేదప్రజలకు అందుతుంది.


లక్ష్యానికి అనుగుణంగా సమాయత్తం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకమీదట సాధారణ బియ్యానికి డిమాండ్‌ ఉండదు. కేంద్రం ఫోర్టిఫైడ్‌ రైస్‌ మాత్రమే సేకరిస్తోంది. ఇందుకు రైస్‌మిల్లర్లు అప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ పూర్తిచేయాలంటే... సీఎంఆర్‌, ఎఫ్‌ఆర్‌కే రూపంలో ఇవ్వక తప్పదు. ఇప్పటికే 6 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఎఫ్‌సీఐకి ఇచ్చాం. భవిష్యత్తులో కూడా వంద శాతం ఇచ్చేందుకు ఏర్పాటుచేస్తున్నాం. వచ్చే ఏప్రిల్‌ నుంచి పీడీ ఎస్‌ వంద శాతం ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీచేసేందుకు వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం

- రాజిరెడ్డి, జనరల్‌ మేనేజర్‌, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ’

Updated Date - 2022-08-17T10:45:56+05:30 IST