MP Bandi Sanjay: బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి
ABN , First Publish Date - 2022-12-23T02:56:29+05:30 IST
‘ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే నేను చెప్పుతో కొట్టుకుంటా. తలను ముక్కలు చేసుకుంటా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ
తలను ముక్కలు చేసుకుంటా
టీఆర్‌ఎస్ దివాలాతో బీఆర్‌ఎస్‌ను తెరిచారు
కేసీఆర్ కుటుంబానిది అహంకారం: బండి
సిరిసిల్ల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే నేను చెప్పుతో కొట్టుకుంటా. తలను ముక్కలు చేసుకుంటా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎక్కువ రోజులు బతకాలని తనకేమీ లేదని, ఉన్న ఊరిలో నిజాయితీతో ధర్మంకోసం బతకాలని ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అహంకారంతో, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ దివాలా తీసిన కంపెనీ అని బోర్డులు మార్చి కొత్తగా బీఆర్‌ఎస్ పార్టీని తెరిచారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని దానిని ఎవరూ పట్టించుకోరన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్లు దేశాన్ని అభివృద్ధి చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, తెలంగాణ ఎక్కడ అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో సబ్సిడీలు ఎత్తివేశారని, ఉచిత ఎరువులు ఇస్తామన్న మాట ఏమైందని నిలదీశారు. కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న అవినీతి అరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, కేంద్రం యూరియా మీద సబ్సిడీని ఎంత ఇస్తుందో యూరియా బ్యాగు చూస్తే తెలుస్తుందన్నారు. రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి సీఎం కేసీఆర్ సహకరించడం లేదని ఆరోపించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘాన్ని నష్టాల్లోకి నెట్టారన్నాని, రూ.33 కోట్ల అవినీతి జరిగిందని, విచారణ కమిటీ వేసి నివేదికను బయట పెడతామని అన్నారు. గర్భిణులకు ఇచ్చే కిట్‌కు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పేరు పెట్టుకున్నాడని, అవి బీఆర్‌ఎస్ పార్టీ డబ్బులా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పథకంగా పెట్టాలి గానీ కేసీఆర్ పేరు పెట్టుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు.
ట్విటర్ టిల్లు ముఖంలో భయం
‘డ్రగ్స్ వాడుతున్నావని నాలుగేళ్లుగా మొత్తుకున్నా. ఇన్నాళ్లు నోరు మెదపని ట్విటర్ టిల్లు (కేటీఆర్) డ్రగ్స్ మానేసిన తరువాత టెస్ట్‌కు సిద్ధమని చెప్పడం సిగ్గుచేటు. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నేను పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా’ అని ’ అని బండి సంజయ్ అన్నారు. ఈడీ విచారణ మొదలుకావడంతో ట్విటర్ టిల్లు ముఖంలో భయం మొదలైందని, అందుకే సహనం కోల్పోయి అవాకులు, చెవాకులు పేలుతున్నాడని అన్నారు.