BRS Festival: బీఆర్‌ఎస్‌ జెండా పండగ

ABN , First Publish Date - 2022-12-14T02:32:32+05:30 IST

దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయాన్ని ప్రారంభించి సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ జాతీయ తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు.

BRS  Festival: బీఆర్‌ఎస్‌ జెండా పండగ

నేడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ముహూర్తం మధ్యాహ్నం 12.37-12.47 గంటల మధ్య

నవ చండీయాగం తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ

హాజరు కానున్న పలు రాష్ట్రాల నేతలు, రైతు నాయకులు

యాగశాలను, పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యాలయాన్ని ప్రారంభించి సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ జాతీయ తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం నవచండీ యాగం నిర్వహించనున్నారు. మఽధ్యాహ్నం 12.37 నుంచి 12.47 గంటల మధ్య కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ జెండాను ఎగరవేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నేతలతో కలిసి తన ఛాంబర్‌లో చర్చిస్తారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఒడిసా, తమిళనాడుకు చెందిన నేతలు, రైతు నాయకులు కూడా హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు పార్టీ ప్రాంరభోత్సంతోపాటు నవచండీ యాగంలో పాల్గొంటారు. గణపతి హోమంతోపాటు కొన్ని పూజలు నిర్వహించడంతో బీఆర్‌ఎస్‌ తాత్కాలిక కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది.

యాగశాల పరిశీలన..

బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. హోమం వివరాలను, కార్యాలయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత యాగశాలను చూసి వెళ్లారు. సీఎం వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మనవడు హిమాన్షు కూడా ఉన్నారు. అంతకుముందు వసంత విహార్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ శాశ్వత భవన నిర్మాణం పనులను కేసీఆర్‌ పరిశీలించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చిల్లరమల్లర రాజకీయాల కోసం కాకుండా ఒక అజెండాతో సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు.

నేడే నవచండీ హోమం

బుధవారం ఉదయం 10.20 గంటలకు యాగశాలలో నవచండీ హోమం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. లోక కల్యాణం, సువర్ణమయ భారతదేశం అనే సంకల్పంతోనే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యాసోజుల గోపీకృష్ణశర్మ తెలిపారు. ఈ హోమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారని చెప్పారు. మంగళవారం ఉదయం యాగశాలలో సంకల్పం, మహా గణపతి పూజ, యాగశాల సంస్కారం, పుణ్యాహవచనం, కలశ స్థాపనతోపాటు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దుర్గాదేవి పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఢిల్లీ పోలీసుల ఆరా..!

పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు? ఎన్ని వాహనాలు వస్తాయనే వివరాలను ఢిల్లీ పోలీసులు ఆరా తీశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఉన్న రోడ్డు ఎయిర్‌ పోర్టుకు వెళ్లడానికి ప్రధాన మార్గం. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రధాని మోదీ కూడా ఇదే మార్గంలో పర్యటనలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ బందోస్తు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ముందే వివరాలు సేకరించారు. అంతకుముందు వీఐపీలు ప్రయాణించే మార్గంలో ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లకు అనుమతి లేద ంటూ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

Updated Date - 2022-12-14T03:56:55+05:30 IST