ఏబీఎన్‌ చానల్‌ను వెంటనే ప్రసారం చేయండి

ABN , First Publish Date - 2022-04-20T08:58:52+05:30 IST

‘‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’’ చానల్‌ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని సిటీ విజన్‌, హైదరాబాద్‌ కేబుల్‌ సంస్థ ఎంఎ్‌సవోలను టెలికాం వివాదాల సెటిల్మెంట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీ శాట్‌) ఆదేశించింది.

ఏబీఎన్‌ చానల్‌ను వెంటనే ప్రసారం చేయండి

సిటీ విజన్‌, హైదరాబాద్‌ కేబుల్‌ ఎంఎస్‌వోలకు టీడీ శాట్‌ ఆదేశం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’’ చానల్‌ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని సిటీ విజన్‌, హైదరాబాద్‌ కేబుల్‌ సంస్థ ఎంఎ్‌సవోలను టెలికాం వివాదాల సెటిల్మెంట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీ శాట్‌) ఆదేశించింది. ఈ రెండు సంస్థలు చానల్‌ ప్రసారాలను నిలిపివేశాయని ఏబీఎన్‌ సంస్థ దాఖలు చేసిన బ్రాడ్‌కాస్టింగ్‌ పిటిషన్‌పై ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ధీరుభాయ్‌ నారన్‌భాయ్‌ పటేల్‌, సభ్యుడు సుబోధ్‌ కుమార్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏబీఎన్‌ చానల్‌ తరఫున న్యాయవాది గుంటూరు ప్రేరణ వాదనలు వినిపిస్తూ... ప్రసారాలను అక్రమంగా నిలిపివేసిన ఎంఎ్‌సవోలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2020లో ట్రాయ్‌ సవరించిన మార్గదర్శకాల  మేరకు ఫ్రీ టు ఎయిర్‌ చానల్స్‌ను ఉచితంగా ప్రసారం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ట్రాయ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఏబీఎన్‌ చానల్‌ ప్రసారాలను నిలిపివేశారని పేర్కొన్నారు. తెలుగు న్యూస్‌ చానల్స్‌ అన్నీ ఒకే వరుసలో ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే ఎక్కువ చానల్స్‌ చూసే అవకాశాన్ని కూడా కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ వినియోగదారులకు ట్రాయ్‌ కల్పించిందని టీడీశాట్‌ దృష్టికి తీసుకొచ్చారు.


రూ. 130కే సుమారు 200 చానళ్లను చూసే అవకాశాన్ని ట్రాయ్‌ నూతన టారిఫ్‌ ఆర్డర్‌ కల్పించిందని, దీని ప్రకారం చానళ్లు ఎంపిక చేసుకోవడానికి వినియోగదారులకు స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. ఫ్రీ టు ఎయిర్‌ చానళ్లను ప్రసారం చేయడానికి ఎంఎ్‌సవోలతో ఒప్పందం అవసరం లేదని, ఒకవేళ ఒప్పందం చేసుకోవాలంటే అందుకు ‘‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’’ సిద్ధంగా ఉన్నప్పటికీ ఎంఎ్‌సవోలు అందుకు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా, విచారణకు హైదరాబాద్‌ కేబుల్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. సిటీ విజన్‌ సంస్థ తరఫున న్యాయవాది వాదిస్తూ... ఏబీఎన్‌ చానల్‌ ప్రసారాలను తాము నిలిపివేయలేదన్నారు. ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. దీంతో జోక్యం చేసుకున్న టీడీ శాట్‌...‘‘ఏబీఎన్‌ చానల్‌ ప్రసారాలను నిలిపివేయనప్పడు వాళ్లెందుకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తారు?’’ అని ప్రశ్నించింది. అయితే, గత విచారణలోనూ ఇదే చెప్పారని, కౌంటర్‌ దాఖలు చేసిన తదుపరి విచారణ పూర్తయ్యే వరకు చానల్‌ ప్రసారాలను పునరుద్ధరించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రేరణ అభ్యర్థించారు. ఈ మేరకు స్పందించిన టీడీ శాట్‌.. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించడమే కాకుండా గతంలో ప్రసారాలను నిలిపివేయలేదన్న విషయాన్ని పేర్కొంటూ వారం రోజుల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆ రెండు సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది.  

Updated Date - 2022-04-20T08:58:52+05:30 IST