Podu survey: పోడు సర్వేకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-11-25T04:11:05+05:30 IST

రాష్ట్రంలో పోడు భూముల సర్వే, హక్కు పత్రాల జారీ అంశం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది.

 Podu survey: పోడు సర్వేకు బ్రేక్‌

ఫారెస్ట్‌ రేంజర్‌ దారుణ హత్యతో కలకలం.. డిమాండ్లపై అధికారుల పట్టు

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన సర్వే, గ్రామ సభలు.. మంత్రి చెప్పినా ఏర్పాటు కాని అదనపు బృందాలు

పోడు పత్రాల జారీ మరింత జాప్యమయ్యే అవకాశం

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోడు భూముల సర్వే, హక్కు పత్రాల జారీ అంశం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. పోడు సాగుదారులు, అటవీ శాఖల మధ్య ఏర్పడుతున్న సరిహద్దుల పంచాయితీ హద్దులు మీరి దాడుల వరకు వెళుతోంది. దీంతో పోడు హక్కు పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2005 డిసెంబరు 13కు ముందు నుంచి సాగు చేసుకుంటున్న వారందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తామని తెలిపింది. ఆ ప్రకటనతో చర్యలు ప్రారంభమైనా.. ఎక్కడా సజావుగా సాగడం లేదు. ఇదిలా ఉండగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన అటవీ అధికారి హత్యతో పోడు సర్వేలో పాల్గొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే సర్వే చేస్తామని చెబుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పోడు సర్వే నిలిచిపోయింది.

ప్రభుత్వ ద్వంద్వ నీతితోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆదివాసీ, గిరిజన, పోడుదారు ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం అటవీ అధికారుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోకపోతే.. పోడు హక్కు పత్రాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడుతుందని అంటున్నాయి. కాగా, ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నా, లేకపోయినా.. సర్వే, గ్రామసభలు జరుగుతాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక అధికారులు లబ్ధిదారులతో చెప్పినట్టు తెలుస్తోంది.

ముందుంది అసలు పోరు..

పోడు పత్రాల జారీ కోసం చేపట్టిన సర్వేలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతుండగా, కొన్ని చోట్ల గ్రామసభల్లో ఇబ్బందు లు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవిక పోడు సాగుదారులతో పాటు వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. దీంతో సాగు భూమి గుర్తింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ సర్వేల్లోనే తేలాల్సి ఉన్నా గ్రామసభల వరకూ వెళ్తున్నాయి. క్షేత్రస్థాయి సమస్య గ్రామసభల వరకూ వెళ్తుండటంతో అది అక్కడ పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో సర్వే అనంతరం జరిగే గ్రామసభల్లోనూ పలు సమస్యలు తెరమీదకు వచ్చే అవకాశాలు క నబడుతున్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి పోడు చేసుకుంటు న్న భూముల్లోనూ అటవీ అధికారులు హరితహారం మొక్కలు నాటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఎర్రబోడు, మాణిక్యారం గ్రామాలతో పాటు భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ అటవీ అధికారులు మొక్కలు నాటారని స్థానికులు చెబుతున్నారు. హరితహారం మొక్కలు నాటిన భూముల్లోనూ సర్వే చేయాలని డిమాండ్లు వస్తున్నందునే ఘర్షణ వాతావరణం నెలకొంటోందని ఆదివాసీ సంఘం నేత ఒకరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. హరితహారం మొక్కలు నాటాలని ప్రభుత్వం అటవీ అధికారులకు లక్ష్యం నిర్దేశించి, మరోవైపు పోడు పత్రాల జారీకి ఏర్పాట్లు చేయాలని సూచించడంతో.. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అదనపు బృందాలేవి..?

పోడు సర్వే, గ్రామ సభలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు బృందాలను తీసుకోవాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించినా ఇంతవరకు ఒక్క అదనపు బృందమూ ఏర్పాటు కాలేదు. ఇక, అదనపు బృందాల్లో ఏ స్థాయి అధికారులుండాలి, ఏ శాఖల నుంచి తీసుకోవాలన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే పలు చోట్ల సర్వే పూర్తి చేసిన అధికారులనే ఇతర ప్రాంతాల్లో సర్వేకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు 17 జిల్లాల్లో సర్వే చేసిన అధికారులే అదనపు బృందాల కింద ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుందన్నది అవగతమవుతోంది. సర్వే పూర్తయిన చోట గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నా.. అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో గ్రామసభలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సర్వేలు సైతం ఆలస్యం కానున్నాయి. సిబ్బంది కొరత, సర్వేలో చోటుచేసుకుంటున్న ఘటనలతో అటవీ అధికారులు నిరాసక్తత కనబరుస్తుండడంతో పోడు హక్కు పత్రాల జారీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-25T04:11:05+05:30 IST

Read more