ఈ ఇద్దరివీ అమృత పలుకులే..

ABN , First Publish Date - 2022-08-15T10:58:42+05:30 IST

ఆధునిక ప్రపంచ అనుభవాలను, వలసపాలన విషాదాలను మనస్సులో ఉంచుకుని వందల ఏళ్ల తర్వాత ఏకమైన జాతి సాధించాల్సి లక్ష్యాలను ఆ ప్రసంగాలు కళ్లకుకట్టాయి.

ఈ ఇద్దరివీ అమృత పలుకులే..

ఇద్దరు అగ్ర నేతలు.. రెండు అద్భుత ప్రసంగాలు 

మన ప్రగతికి ఇప్పటికీ అవే తూనికరాళ్లు..

మన చీకటి వెలుగులకు ఇప్పటికీ అవే కొలమానాలు...

రెండు దృక్పథాల మంచి మేళవింపులవి..

గత శతాబ్దిలోనే ఘనమైన ఉపన్యాసాలవి...

దశాబ్దాలు గడిచినా విస్మరించలేని హెచ్చరికలవి..

75 ఏళ్ల నాడు నెహ్రూ, అంబేడ్కర్‌ ఆ ప్రసంగాల్లో 

ఆశించినది నెరవేరినదెంత? విస్మరించినదెంత? 

అమృత మహోత్సవ వేళ ఆ అమృతవాక్కులు 

ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం!ఆధునిక ప్రపంచ అనుభవాలను, వలసపాలన విషాదాలను మనస్సులో ఉంచుకుని వందల ఏళ్ల తర్వాత ఏకమైన జాతి సాధించాల్సి లక్ష్యాలను ఆ ప్రసంగాలు కళ్లకుకట్టాయి. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత రాజ్యాంగ రచనా సంఘం సారథి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 75 ఏళ్ల కిందట చేసిన ప్రసంగాలను ఇప్పటికీ దేశదేశాల్లో ఆలోనాపరులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి రాజ్యాంగ సభ సభ్యులనుద్దేశించి నెహ్రూ చేసిన (ట్రిస్ట్‌ విత్‌ డెస్టిని) ప్రసంగాన్ని.. మరో రెండేళ్ల తర్వాత 1949 నవంబరు 25న అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్తులో చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి మనసుపెట్టి చదివితే జీవితంలో మరిచిపోలేం. ఒక జాతిని, ఒక నాగరికతను పొగడ్తలతో ముంచెత్తిన ఉపన్యాసాలేవి గొప్పవి అనిపించుకోలేవు. 


అహింసతోనూ లేక అతి తక్కువ హింసతోనూ మరే ఇతర దేశం చూడని చాకచక్యంతోనూ మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఏదేశమూ ఒక్కసారిగా ఇవ్వనన్ని ప్రాథమిక హక్కులనూ స్త్రీపురుష సమానత్వ హక్కులనూ మన రాజ్యాంగ రూపకర్తలు ఇచ్చారు. అంతమాత్రాన మన సమాజానికి ఆ హక్కులను పరిరక్షించే, నిజాయితీగా అమలుచేయగలిగే శక్తి ఉందని ఆ ఇద్దరూ భావించలేదు. అందుకే మనకెన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యక్తిపూజ, సంకుచిత మతతత్వం, కులతత్వం జాతీయవాదాల గురించి తస్మాత్‌ జాగ్రత్త ఆనాడే చెప్పారు. అమృత మహోత్సవ కాలంలోనూ ఇంకా అవే పెనుప్రమాదాలుగా ఉండటం వారి భవిష్యద్దార్శనికతకు నిదర్శనం.


వ్యక్తిపూజతో నియంతృత్వం

భారత్‌లోనే ఆ జాడ్యం ఎక్కువ!

ప్రజాస్వామ్యంలో.. ఫలానాది తప్పని చెప్పేందుకు, దాని పరిష్కారానికి ఆ అంశంపై విస్తృత చర్చ జరగాలన్నది అంబేడ్కర్‌ నిశ్చితాభిప్రాయం. అలాగే రాజకీయాల్లో వ్యక్తి పూజ నియంతృత్వానికి దారితీస్తుందని 1949లోనే హెచ్చరించారు. వేల సంఖ్యలో కులాలున్న దేశం ఓ జాతిగా ఎలా ఆవిర్భవిస్తుందని ప్రశ్నించారు. దేశం కంటే మతాన్ని మిన్నగా భావిస్తే మన స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా కోల్పోతామని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో కులమతాలకే ప్రాధాన్యం. వాటి ప్రాతిపదికన పార్టీలే పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలు సైతం కులసమీకరణల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ చేస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో, చట్టసభల్లో సమగ్ర చర్చలే లేకుండా పోయాయి. అసమ్మతిని ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయి. ఆరోగ్యకరమైన చర్చ ఆవశ్యకత గురించి అంబేడ్కర్‌ ఆనాడే నొక్కిచెప్పారు.


 ‘‘రాజ్యాంగ సభ వివిధ వర్గాల గుంపుగా.. సిమెంటు లేని పేవ్‌మెంట్‌గా.. అక్కడో రాయు, ఇక్కడో రాయిగా వేసి ఉన్నట్లుగా ఉంటే ముసాయిదా కమిటీ కర్తవ్య నిర్వహణ (రాజ్యాంగ రచన) చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రతి సభ్యుడూ, ప్రతి వర్గం తాము చెప్పిందే చట్టమని అనుకుని ఉంటే నానా గందరగోళం చోటుచేసుకునేది. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్న నిబంధనను సభ్యులంతా పాటించి ఉంటే రాజ్యాంగ సభ కార్యకలాపాలు నిస్సారంగా ఉండేవి. పార్టీ క్రమశిక్షణ.. రాజ్యాంగ సభను ‘జీ హుజూర్‌’ సభ్యుల గుంపుగా మార్చి ఉండేది. ముసాయిదా కమిటీలో కామత్‌, పీఎస్‌ దేశ్‌ముఖ్‌, సిధ్వా, ప్రొఫెసర్‌ సక్సేనా, పండిట్‌ ఠాకూర్‌, దాస్‌ భార్గవ, కేటీ షా, పండిట్‌ హృదయనాథ్‌ కుంజ్రూ వంటి రెబెల్స్‌ ఉన్నారు. వారు లేవనెత్తిన అంశాలన్నీ సైద్ధాంతికమైనవి. అయితే వారి సలహాలను నేను ఆమోదించలేదు. అంత మాత్రాన వారి సూచనలకు విలువ లేకుండా పోదు. రాజ్యాంగ సభకు వారు చేసిన సేవా తగ్గిపోదు’’ అని అంబేడ్కర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 


కృతజ్ఞతకూ హద్దులు..

దేశానికి జీవితాంతం సేవచేసిన మహనీయుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పు కాదని.. కానీ దానికీ హద్దులున్నాయని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు.

 ‘‘ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి కృతజ్ఞత చూపించాల్సిన పనిలేదు.. ఏ మహిళా తన శీలాన్ని పణంగా పెట్టి కృతజ్ఞత చెప్పనక్కర్లేదు.. స్వేచ్ఛను పణంగా పెట్టిన ఏ దేశమూ గొప్పది కాదు’’ అని ఐరిష్‌ దేశభక్తుడు డేనియల్‌ ఓకానెల్‌ చెప్పిన మాటలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ విషయంలో మన దేశం ఇతర దేశాల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

‘‘భారత రాజకీయాల్లో భక్తి, వ్యక్తిపూజలది కీలక పాత్ర. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భక్తి అనేది మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తిపూజ అనేది పతనానికి.. అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది..’’ అని హెచ్చరించారు. 


నిజమైన జాతి..

భిన్న కులాలు, వర్గాలు కలగలసిన భారత్‌ ఆటోమేటిగ్గా ఓ జాతిగా ఆవిర్భవిస్తుందన్న ఆలోచన మంచిది కాదని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. అమెరికా పౌరులు తమ దేశాన్ని ఐక్య రాజ్యం(యునైటెడ్‌ నేషన్‌)గా పేర్కొనలేదని.. సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా)గా నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. ‘‘సంయుక్త రాష్ట్రాల ప్రజలే తమను తాము ఓ జాతిగా పరిగణించనప్పుడు.. భారతీయులు తమను ఓ జాతిగా భావించడం ఎంత కష్టం? కొందరు రాజకీయ ప్రేరితులు.. ‘భారత ప్రజలు’ అన్న భావనను నిరసించిన విషయం నాకు గుర్తుంది. వారు ‘భరత జాతి’ అనిపించుకోవాలనుకున్నారు. అయితే మనల్ని మనం జాతిగా భావించడం అంటే మాయలో పడినట్లే! వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒక్క జాతిగా ఎలా అవుతారు? సామాజికంగా, మానసికంగా మనమింకా ఓ జాతి కాలేదన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడే జాతిగా ఆవిర్భవించాల్సిన అవసరాన్ని గ్రహిస్తాం. అయితే ఈ లక్ష్యాన్ని గ్రహించడం అమెరికాలో కంటే ఇక్కడే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ కులాల్లేవు. ఇక్కడ ఉన్నాయి.  జాతిగా ఆవిర్భవించాలనుకుంటే ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలి’’ అని పేర్కొన్నారు 


దేశం కంటే మతం ఎక్కువ కాదు..

దేశం కంటే మతం గొప్పదని భావించడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి నాడే విశదీకరించారు. ‘‘స్వజనుల ద్రోహం, మోసం కారణంగానే భారత్‌ స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. కులం, మతం అనే అనాది శత్రువులకు తోడు.. భవిష్యత్‌లో విభిన్న, పరస్పర విరుద్ధ రాజకీయ భావాలు కలిగిన రాజకీయ పార్టీలను చూడబోతున్నాం. దేశం కంటే మతమే మిన్నగా భావిస్తే మన స్వాతంత్య్రం మళ్లీ ప్రమాదంలో పడుతుందనేది మాత్రం నిశ్చయం. అంతేకాదు.. స్వాతంత్ర్యాన్ని ఎప్పటికీ కోల్పోతాం కూడా’’  అని స్పష్టం చేశారు.


సామాజిక ప్రజాస్వామ్యం..

సామాజిక ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదన్నారు. ‘‘సామాజిక ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన విలువలుగా గుర్తించే జీవన మార్గం. ఇది త్రిమూర్తుల కలయిక వంటిది. ఇందులో దేనిని వదిలేసినా ప్రజాస్వామ్య లక్ష్యాన్నే ఓడిస్తుంది’’ అని చెప్పారు. 


ప్రజాస్వామ్యం ఉండాలంటే..

 ‘‘రక్తపాత విప్లవాలను విడనాడాలి. సత్యాగ్రహం, శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ వంటి పద్ధతులు మానుకోవాలి. అరాచక విధానాలను ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది’’ అని పేర్కొన్నారు.


మతతత్వానికి దూరంగా ఉండాలి

బ్రిటిష్‌ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు దీర్ఘకాలం క్రితం శపథం చేశామని.. ఇప్పుడు నవ భారత సేవకు పునరంకితమవుతామని మరోసారి ప్రతినబూనాలని నెహ్రూ ఆనాడు పిలుపిచ్చారు. స్వతంత్ర భారతం మతతత్వానికి.. సంకుచితత్వానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ‘‘అర్ధరాత్రి 12 గంటలు కొట్టినప్పుడు.. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉన్న వేళ.. భారతదేశం నవ జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెట్టింది. చరిత్రలో ఇలాంటి క్షణం అరుదుగా వస్తుంది. పాత నుంచి కొత్తలోకి అడుగుపెట్టినప్పుడు.. ఒక శకం ముగిసినప్పుడు.. సుదీర్ఘకాలం ఓ జాతి ఆత్మను అణచివేసినప్పుడు.. కొత్త గొంతుకొకటి జీవం పోసుకుంటుంది. దేశసేవకు, భారత ప్రజలకు.. మొత్తం మానవాళి సేవకు అంకితమవుదామని ప్రతిన బూనేందుకు ఇది అనువైన సమయం’’ అని తెలిపారు.


విలువలు మరవొద్దు..

చరిత్ర మలుపుల్లో భారత్‌ తన అన్వేషణను ప్రారంభించిందని.. శతాబ్దాల ప్రయాణంలో ఎన్నో విజయాలు, వైఫల్యాలు చవిచూసిందని.. అదృష్ట దురదృష్టాల్లో ఏనాడూ తన అన్వేషణ ఆపలేదని.. అలాగే తన విలువలనూ మరచిపోలేదని నెహ్రూ పేర్కొన్నారు. 

 ‘‘మనం పండుగ చేసుకుంటున్న ఈ విజయం.. గొప్ప విజయావకాశాలకు ఆరంభం దిశగా ఓ అడుగు మాత్రమే. ఈ అవకాశాలను చేజిక్కించుకోగల సత్తా, తెలివిడి మనకున్నాయా? భావి సవాళ్లను ఎదుర్కోగలమా? స్వాతంత్య్రం, అధికారం.. బాధ్యతను తీసుకొస్తాయి. ఈ గురుతర బాధ్యత స్వతంత్ర భారత పౌరులకు  ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ (రాజ్యాంగ) అసెంబ్లీపైనే ఉంది. స్వేచ్ఛావాయువులు పీల్చకముందు.. మనం అన్ని రకాల బాధలూ అనుభవించాం. విషాద స్మృతులతో మన హృదయాలు బరువెక్కి ఉన్నాయి. ఈ బాధల్లో కొన్ని ఇప్పటికీ ఉండి ఉండొచ్చు. అయినా గతం గతః. ఇప్పుడు భవిష్యత్‌ మనవైపు చూస్తోంది. సంకుచిత, విధ్వంసక విమర్శలకు.. అసూయాద్వేషాలకు.. పరస్పర ఆరోపణలకు ఇది సమయం కాదు. భరత సంతతి స్వేచ్ఛాయుతంగా జీవించే స్వతంత్ర భారత సమున్నత సౌధాన్ని మనం నిర్మించాల్సి ఉంది’’  అంటూ భవిష్యత్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు.


వెలుగులు నింపిన గాంధీజీ..

స్వాతంత్య్రం సముపార్జించిన ఈ రోజున మన ఆలోచనలన్నీ దీనికి కారణమైన స్వేచ్ఛాశిల్పి, జాతిపిత మహాత్మాగాంధీ చుట్టూ తిరుగుతున్నాయని.. ఆయన స్వాతంత్య్రమనే దివిటీని చేపట్టి మన చుట్టూ ఉన్న అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపారని నెహ్రూ గుర్తుచేశారు. పెనుగాలులు వీచినా... తుఫాన్లు సంభవించినా ఈ దివిటీని ఆరిపోనివ్వకూడదన్నారు. ‘‘సామాన్యుడికి, రైతులు, కార్మికులకు స్వేచ్ఛ, అవకాశాలు కల్పించేందుకు.. పేదరికం, అవిద్య, వ్యాధులపై పోరాడి అంతం చేయడానికి.. పురోగమన ప్రజాస్వామిక దేశ నిర్మాణానికి.. ప్రతి పురుషుడికి, మహిళకు న్యాయం, సంపూర్ణ జీవితం అందించే ఆర్థిక, సామాజిక, రాజకీయ సంస్థల సృష్టికి కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రతిజ్ఞకు సంపూర్ణంగా కట్టుబడి ఉండేదాకా మనకెవరికీ విశ్రాంతి లేదు’’ అని నెహ్రూ స్పష్టం చేశారు.


అసమానతలను రూపుమాపాలి..

భారత్‌కు సేవ చేయడం అంటే.. కోట్లాది బాధితులకు సేవ చేయడమేనని.. దీనర్థం పేదరికం, అజ్ఞానం, అవకాశాల అసమానతలను రూపుమాపడమేని నెహ్రూ చెప్పారు. 

‘‘కన్నీళ్లు, బాధలు ఉన్నన్నాళ్లూ మన కృషి ముగిసినట్లు కాదు. మన కలలను సాకారం చేసుకోవడానికి కఠోరంగా శ్రమించాలి. ఈ కలలు భారత్‌ కోసమే కాదు... అన్ని దేశాలు, ప్రపంచం మొత్తం కోసం కూడా. శాంతిని విభజించలేం. అలాగే స్వేచ్ఛను కూడా. ఇప్పుడున్న వసుధైక ప్రపంచంలో పురోభివృద్ధిని, విపత్తులను కూడా వేర్వేరుగా చూడలేం’’ అని అన్ని దేశాలకూ హితవు పలికారు.


ఈ తార అస్తమించకూడదు..

‘‘దీర్ఘ సుషుప్తి, పోరాటం తర్వాత మేల్కొని.. స్వేచ్ఛగా, స్వతంత్రంగా భారత్‌ మళ్లీ సగర్వంగా నిలబడింది. చరిత్ర మనకు కొత్తగా మొదలైంది. మనమెలా జీవిస్తామో, ఎలా వ్యవహరిస్తామో ఇతరులు దానిని చరిత్రగా రాస్తారు. ఇది మనకు విధిరాసిన క్షణం. భారత్‌కే కాదు.. మొత్తం ఆసియాకు, ప్రపంచానికి కూడా. ఒక కొత్త తార ఉదయించింది. ఇది తూర్పున పొడిచిన స్వేచ్ఛ అనే తార. ఇది అస్తమించకూడదు. ఈ ఆశ అంతరించకూడదు. మేఘాలు మనల్ని కమ్మేసినా, మన ప్రజల్లో అత్యధికులు బాధల్లో మునిగిపోయినా, క్లిష్టమైన సమస్యలు చుట్టుముట్టినా స్వేచ్ఛను ఆస్వాదిద్దాం. అయితే ఈ స్వేచ్ఛ బాధ్యతలను, భారాలను తీసుకొస్తుంది. స్వేచ్ఛాయుత, క్రమశిక్షణ స్ఫూర్తితో వాటిని మనం ఎదుర్కోవాలి’’ 

Updated Date - 2022-08-15T10:58:42+05:30 IST