19న బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్‌

ABN , First Publish Date - 2022-10-17T09:28:46+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ నేతల తీరుతో అసంతృప్తికి గురైన భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఈ నెల 19న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ముఖ్య నేతల సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు.

19న బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్‌

  • ఢిల్లీలో ముఖ్య నేతల సమక్షంలో చేరిక
  • నేడు ఆయన ఇంటికి పార్టీ కీలక నేతలు 
  • 20 నుంచి మునుగోడులో విస్తృత ప్రచారం 

నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ నేతల తీరుతో అసంతృప్తికి గురైన భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఈ నెల 19న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ముఖ్య నేతల సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కొందరు కీలక నేతలు సోమవారం హైదరాబాద్‌లోని నర్సయ్యగౌడ్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఈ నెల 13న చండూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న బూర నర్సయ్యగౌడ్‌ అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు 15న ప్రకటించారు. 19న బీజేపీలో చేరిన అనంతరం, 20 నుంచి నర్సయ్యగౌడ్‌ మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఆ పార్టీ నేతలు కార్యచరణ రూపొందించారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఈ నెల 28న హైదరాబాద్‌లోని నాంపల్లిలో బీసీ నేతలు నర్సయ్యగౌడ్‌తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.రాష్ట్ర ఆవిర్భావం నుంచి నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్నారు. తెలంగాణ డాక్టర్స్‌ అసోసియేషన్‌ను స్థాపించిన ఆయన ఆ వర్గంలో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. భువనగిరి ఎంపీగా రెండుసార్లు పోటీ చేసిన ఆయనకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి.  


టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఆపరేషన్‌ షురూ..

ఉప ఎన్నిక ముందు కీలక నాయకుడు పార్టీ చేజారడంతో నష్టాన్ని భర్తీ చేసేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు బూర కౌంటర్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. చండూరు ఎంపీపీ కల్యాణి రవికుమార్‌ దంపతులను మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ద్వారా శనివారం కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేర్పించారు. మునుగోడు నియోజకవర్గంలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు సర్పంచ్‌లకు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి టీఆర్‌ఎస్‌ కండువా కప్పారు. బూర నర్సయ్యగౌడ్‌ దురుద్దేశంతో సీఎం కేసీఆర్‌, పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారని, ఆత్మగౌరవం అంటున్న ఆయన ఢిల్లీలో బీజేపీ నాయకుల అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులు పడిగాపులు కాశారని మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, బాల్క సుమన్‌లు విమర్శలు చేశారు. రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌పై బీసీ వ్యతిరేకి అని ముద్ర వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో ఈ ఆరోపణలను పోస్టు చేయగా దానికి కౌంటర్‌గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఉన్న ఫొటోను నర్సయ్యగౌడ్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-10-17T09:28:46+05:30 IST