10 దాకా వేచి చూద్దాం!

ABN , First Publish Date - 2022-02-23T09:20:37+05:30 IST

పార్టీలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, కొత్తగా వచ్చిన వారు అవమానిస్తున్నారని పేర్కొంటూ...

10 దాకా వేచి చూద్దాం!

ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ

బీజేపీ అసంతృప్త నేతల నిర్ణయం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పార్టీలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, కొత్తగా వచ్చిన వారు అవమానిస్తున్నారని పేర్కొంటూ బీజేపీలోని కొంత మంది సీనియర్‌ నేతలు మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా పార్టీ  జాతీయ నాయకత్వం బిజీగా ఉన్న నేపథ్యంలో, వచ్చే నెల 10 వరకూ వేచి చూడాలని, ఆ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించారు. మంగళవారం, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్‌ నేత సుగుణాకర్‌రావుతో పాటు హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ నేతలు వెంకట రమణి, రాములు తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. పార్టీలో కొత్తగా చేరిన కొంత మంది ముఖ్యుల జిల్లాల పర్యటనలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా వారు ఇతర జిల్లాల పర్యటనలకు వెళ్లడం, స్థానికంగా మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారికి కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం క్రమశిక్షణా రాహిత్యమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీలో కొనసాగుతున్న అసమానతలకు సంబంధించి, జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే తమ అభిప్రాయాలను సేకరించిన దృష్ట్యా, వచ్చే నెల 10 తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్దేశించుకోవాలని నిర్ణయించారు. కొద్ది రోజుల కిందట, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావుతో పాటు మరికొందరు స్థానిక నేతలు కరీంనగర్‌లో సమావేశమై పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఈ సమావేశంలో విమర్శలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో, పార్టీ హైకమాండ్‌ ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేస్తారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో, వారి అభిప్రాయాన్ని తీసుకునే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డికి అప్పగించింది. దీంతో ఆయన ఒకరిద్దరు సీనియర్ల అభిప్రాయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, అసంతృప్త నేతలు మరోమారు భేటీ కావడం చర్చనీయాంశమైంది.

Read more