ఈడీ మీటర్లు.. అందుకే కేసీఆర్‌ గజగజ

ABN , First Publish Date - 2022-08-30T07:54:57+05:30 IST

న్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మీటర్లు పెడుతుండడంతో సీఎం కేసీఆర్‌ గజగజ వణుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారో అదంతా..

ఈడీ మీటర్లు.. అందుకే కేసీఆర్‌ గజగజ

ఆయన అంతర్జాతీయ కేడీ

లిక్కర్‌ స్కాంను ఖండించడంలేదేం? 

సీఎం పాదయాత్ర చేస్తే.. నేను బంద్‌ చేస్తా: బండి సంజయ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మీటర్లు పెడుతుండడంతో సీఎం కేసీఆర్‌ గజగజ వణుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారో అదంతా ఈడీ లాగుతోందని చెప్పారు.  కేసీఆర్‌, అంతర్జాతీయ కేడీ అని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే, దానిని మొదట అడ్డుకునేది బీజేపీనే అని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఢిల్లీ లిక్కర్‌ స్కాం విషయంలో మీ కుటుంబానికి సంబంధం లేకపోతే ఎందుకు ఖండించడం లేదు? ట్విటర్‌ టిల్లు ఎందుకు మాట్లాడుతలేరు?’ అని సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయన కూతురు లిక్కర్‌ స్కాం ఏమైందని అడుగుతారన్నారు. రైతు సంఘాల నేతల సమావేశానికి రాష్ట్రంలోని రైతు సంఘాలను ఎందుకు పిలువలేదని నిలదీశారు.


ఆ సమావేశంలో లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయలేకపోయానని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ముందు తెలంగాణ రైతుల గురించి ఆలోచించాలని సూచించారు. మానవ అక్రమ రవాణా, సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, మానభంగాల కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మానవ అక్రమ రవాణా కేసీఆర్‌కు ఇష్టమైన వ్యాపారమని పేర్కొంటూ, ఆయన ఎమ్మెల్యే కాకముందు ఇదే చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్‌, ప్రధాని మోదీని తిడుతున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్‌ మతం గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటూ, తిరిగి దానిని తమపైకి నెడుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి సభకు, విద్యాసంస్థలు బంద్‌ చేయించి, బెదిరించి ప్రజలను తీసుకువచ్చారని ఆరోపించారు.


సింగరేణిలో ఉద్యోగాల కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. ‘మమ్మల్ని అడ్డుకోవాలని మీ పార్టీ వాళ్లకు పిలుపునిచ్చిండ్రు సరే.. మీరు పాదయాత్ర చేయండి.. నేను మానేస్తా.. ఇందుకు సిద్ధమా? సెప్టెంబరు 12న నేను నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమైన.. బందోబస్తు లేకుండా మీరు పాదయాత్ర చేస్తే నేను బంద్‌ చేస్తా’ అని  కేసీఆర్‌కు సంజయ్‌ సవాల్‌ చేశారు.


చెప్పులు మోయడానికి, జరపడానికి.. తేడా తెలియని మూర్ఖుడు కేసీఆర్‌..

చెప్పులు మోయడానికి, జరపడానికి తేడా తెలియని మూర్ఖుడు కేసీఆర్‌. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి వారిని కాలితో తన్నే రకం నాది కాదు. గురువు పట్ల మీకు సంస్కారం ఎక్కడుంది? పాదయాత్రలో ఎంతోమంది చెప్పులు పడిపోతే తీసి ఇచ్చిన. అంతమాత్రాన చెప్పులు మోసినట్లా? అమిత్‌ షా నాకు తండ్రిలాంటి వారు. మోదీ వద్దకు వెళ్లి వంగివంగి సలాం చేసిన సంగతి మరచిపోయారా? అని’’ సంజయ్‌.. సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. 

Read more