వడ్లు ఎందుకు కొనరు?

ABN , First Publish Date - 2022-02-27T08:56:55+05:30 IST

యాసంగి వడ్లు కొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. శనివారం కామారెడ్డిలో ఉమ్మడి..

వడ్లు ఎందుకు కొనరు?

ముడి బియ్యం కొనేందుకు కేంద్రం సిద్ధం

 కేసీఆర్‌ అన్నదాతలను మోసం చేస్తున్నారు

కరెంటు బిల్లులు పెంచేందుకు ప్రయత్నాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


కామారెడ్డి/యాదాద్రి/హైదరాబాద్‌/వేములవాడ, ఫిబ్రవరి 26: యాసంగి వడ్లు కొంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. శనివారం కామారెడ్డిలో ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌.. ఇప్పటికీ 46 లక్షల టన్నుల గత వానాకాలం ముడి బియ్యం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే.. తెలంగాణ సర్కారు యాసంగి వడ్లు కొనడానికి సుముఖంగా లేమని చెప్పిందని గుర్తు చేశారు. కేంద్రం ముడి బియ్యం కొంటామని చెబుతున్నా.. ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయట్లేదో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని కేంద్రంపై ఆరోపణలు చేయడం తగదన్నారు.


డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.62వేల కోట్లు బకాయి ఉందని తెలిపారు. ఏటా రూ.6,200 కోట్ల ఆదాయం రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కారు.. ఏప్రిల్‌ నుంచి భారీగా చార్జీలు పెంచేందుకు కసరత్తు చేస్తోందని వెల్లడించారు. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం భువనగిరిలో గూడూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు  పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఒక్కశాతం జనాభా ఉన్న వర్గానికి సీఎం పదవి, మూడు కేబినెట్‌ పదవులు ఇచ్చారని.. 54 శాతం ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులే ఉన్నాయని విమర్శించారు. వేములవాడ ఆలయానికి ఏటా రూ.వంద కోట్ల నిధులు కేటాయిస్తానని ఏడేళ్ల క్రితం ఇచ్చిన మాటను తప్పిన ఘనుడు కేసీఆర్‌ అని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. వేములవాడ దేవస్థానానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ పడమర ద్వారం మెట్లపై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం దీక్ష నిర్వహించారు. విజయశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ధ్వజం

 కేసీఆర్‌ వైఖరితో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో   పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యమ నినాదంలో ఒకటైన ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడం శోచనీయమన్నారు. జాతీయ వికలాంగుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని నారాయణ స్వామికి అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక వినతి పత్రం ఇచ్చింది

Read more