ఎంతమందిని పిలుద్దాం?

ABN , First Publish Date - 2022-06-29T09:40:59+05:30 IST

హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మొత్తం 380-400 మందిని ఆహ్వానించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంతమందిని పిలుద్దాం?

  • ఎవరెవరిని పిలుద్దాం?
  • రెండు మూడు రోజులుగా కసరత్తు.. 
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి జాబితా సిద్ధం!


న్యూఢిల్లీ/హైదరాబాద్‌/కరీంనగర్‌ జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మొత్తం 380-400 మందిని ఆహ్వానించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ఈ సారి ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందని తెలిసింది. వీరిలో రాష్ట్ర ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేబినెట్‌ మంత్రులు, ఆఫీస్‌ బేరర్లు, కీలక నేతలు ఉంటారని సమాచారం. ఆయా రాష్ట్రాలకు చెందిన వారిలో ఎవరిని పిలవాలి.. ఎంత మందిని పిలవాలనే విషయంపై ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పర్యవేక్షణలో లిస్ట్‌ రెడీ అవుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. జూన్‌ 30వ  తేదీనే అతిథులంతా హైదరాబాద్‌కు చేరుకుంటారని సమాచారం. ఎన్‌ఈసీ సమావేశానికి ముందే బూత్‌ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై అధిష్ఠానానికి ఒక నివేదికను అందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


జూలై 2న హైదరాబాద్‌ మాదాపూర్‌ లోని నోవాటెల్‌ వేదికగా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 3వ తేదీన పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని బహింరంగ సభ ఉంటుంది. సభలో ప్రధాని ఏం మాట్లాడతారన్న దానిపై నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు కమల సైన్యం చేయాల్సిన కసరత్తు ఏమిటి? రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ను ఎలా ఢీకొట్టాలి? అజెండా ఏంటి? అనే విషయాలపై ప్రధాని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా మోదీ ప్రసంగం ఉంటుందని కూడా చెబుతున్నారు. సుమారు పది లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభ ద్వారా అధికారపార్టీకి తమ సత్తా ఏంటో చూపాలని బీజేపీ భావిస్తోందని.. పరేడ్‌ గ్రౌండ్‌లో సభ కాదు.. కమలం పార్టీ శక్తి ప్రధర్శనకు, రాబోయే ఎన్నికల సమరానికి సన్నాహక వేదిక అవుతుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  


3న విజయ్‌ సంకల్ప్‌ సభ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో వచ్చే నెల 3న బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు విజయ్‌ సంకల్ప్‌ సభ అనే పేరు పెట్టారు. విజయ్‌ సంకల్ప్‌ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జూలై 2, 3 తేదీల్లో హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జూలై 2 మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా నోవాటెల్‌కు వెళతారని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. మోదీ నోవాటెల్‌లోనే బస చేస్తారని ఆ నేత వెల్లడించారు. 


మోదీ విందులో తెలంగాణ రుచులు 

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి విచ్చేస్తున్న నేతలకు అందించే భోజనం విషయంలో స్థానిక నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా నేతలకు తెలంగాణ రుచులు చూపించాలని నిర్ణయించారు. 3వ తేదీన అందించే మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు ఉండేలా చూస్తున్నారు. పచ్చిపులుసు, పంటికూర పప్పు, గంగవాయిలి-మామిడికాయ పప్పు, తెల్లజొన్న రొట్టెలు, దొడ్డు బూంది లడ్డూ, సాయంత్రం స్నాక్స్‌గా సర్వపిండి, సకినాలు, గారెలు వంటివి వడ్డించనున్నారు. ఈ వంటకాలను సిద్ధం చేసేందుకు కరీంనగర్‌ నుంచి యాదమ్మ అనే మహిళను రప్పిస్తున్నారు. కరీంనగర్‌ పరిసరాల్లో యాదమ్మ వంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.  

Updated Date - 2022-06-29T09:40:59+05:30 IST